కొవిడ్‌ టీకా: 3 కోట్ల మార్కును దాటిన భారత్‌

తాజా వార్తలు

Updated : 16/03/2021 04:14 IST

కొవిడ్‌ టీకా: 3 కోట్ల మార్కును దాటిన భారత్‌

దిల్లీ: భారత్‌లో కొవిడ్‌ టీకా పంపిణీ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. జనవరి 16న దేశంలో ప్రారంభమైన వ్యాక్సినేషన్‌ ద్వారా ఇప్పటివరకు 3కోట్ల డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. వీటిలో దాదాపు 2 కోట్ల 45లక్షల మందికి తొలి డోసు అందించగా, మరో 55లక్షల మందికి రెండు డోసులు అందించారు. సోమవారం సాయంత్రానికి దేశంలో 3.15 కోట్ల డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది. దేశంలో అత్యధికంగా రాజస్థాన్‌, మహారాష్ట్రాల్లో ఇప్పటివరకు 28 లక్షల చొప్పున టీకాలను అందించారు. గుజరాత్‌లో 25 లక్షల డోసులు, ఉత్తర్‌ప్రదేశ్‌లో 24లక్షల టీకాలను ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

ప్రపంచ వ్యాప్తంగా 35.9కోట్ల డోసులు..

ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌ వ్యాక్సిన్‌ పంపిణీ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటికే దాదాపు 122 దేశాల్లో వ్యాక్సిన్‌ పంపిణీ ప్రారంభమైనట్లు సమాచారం. ఇప్పటివరకు 35.9 కోట్ల డోసులను పంపిణీ చేసినట్లు అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి. కొవిడ్ వ్యాక్సిన్‌ను పంపిణీ చేస్తున్న దేశాల్లో అమెరికా అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇప్పటికే అక్కడ 10 కోట్ల 70 లక్షల డోసులను పంపిణీ చేశారు. చైనాలో 6.5 కోట్లు, ఈయూలో 4.9కోట్లు, భారత్‌లో 3.15 కోట్లు, బ్రిటన్‌లో 2.5కోట్ల డోసులను అందించారు.

చైనాలో ఎగుమతులకు ప్రాధాన్యం

కరోనా వైరస్‌కు పుట్టినిళ్లుగా భావిస్తున్న చైనాలో కొవిడ్‌ టీకా పంపిణీని భారీ స్థాయిలో చేపట్టారు. టీకా ప్రయోగ దశలోనే భారీగా పంపిణీ చేసిన చైనా అధికారులు, ప్రస్తుతం మందకొడిగానే కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకు అక్కడ 6.5 కోట్ల డోసులను పంపిణీ చేసినట్లు చైనా అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం చైనాలో నాలుగు వ్యాక్సిన్‌లు అందుబాటులోకి వచ్చాయని తెలిపింది. వచ్చే ఏడాది నాటికి వంద కోట్ల మందికి టీకా అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే, ప్రస్తుతం అక్కడ ఆరు కోట్ల మందికి టీకా అందించినప్పటికీ, ఇంతకు పదిరెట్ల డోసులను విదేశాలకు ఎగుమతి చేసేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి. చైనా వ్యాప్తంగా వైరస్‌ తీవ్రత ఎక్కువగా లేని కారణంగానే టీకా ఎగుమతిపై దృష్టి సారించినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని