Basmati: భారత్‌.. పాక్‌.. ‘బాస్మతి’ కొట్లాట
close

తాజా వార్తలు

Published : 07/06/2021 16:20 IST

Basmati: భారత్‌.. పాక్‌.. ‘బాస్మతి’ కొట్లాట

దిల్లీ: బిర్యానీ, పులావ్‌.. ఇవి భారతీయులు, పాకిస్థానీయులకు ఎంతో ఇష్టమైన వంటకాలని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇందులో ఉపయోగించే పొడవాటి బాస్మతి బియ్యం ఇప్పుడు రెండు దేశాల మధ్య కొత్త ఉద్రిక్తతలకు తెరలేపింది. యూరోపియన్‌ యూనియన్‌(ఈయూ)లో బాస్మతి బియ్యం హక్కుల కోసం ఈ రెండు దేశాల గొడవపడుతున్నాయి. బాస్మతి రకంపై పూర్తి హక్కులు చెందేలా భారత్‌ ఈయూలో దరఖాస్తు చేసుకుంది. అయితే దీన్ని పాక్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.

ఐక్యరాజ్యసమితి గణాంకాల ప్రకారం.. ప్రపంచంలో భారత్‌ అత్యధికంగా బియ్యం ఎగుమతులు చేస్తోంది. ఈ ఎగుమతుల ద్వారా ఏడాదికి 6.8 బిలియన్‌ డాలర్లను సమకూర్చుకుంటోంది. ఇక 2.2 బిలియన్‌ డాలర్ల విలువైన బియ్యం ఎగుమతులతో పాకిస్థాన్‌ నాలుగో స్థానంలో ఉంది. అయితే ప్రపంచవ్యాప్తంగా బాస్మతి రకం బియ్యాన్ని ఎగుమతి చేసేది మాత్రం ఈ రెండు దేశాలే. అయితే బాస్మతి భౌగోళిక గుర్తింపుపై భారత్‌, పాక్‌ మధ్య చాలా కాలం నుంచే విభేదాలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా.. యూరోపియన్‌ యూనియన్‌ ఎరువుల ప్రమాణ స్థాయిని కఠినతరం చేయడంతో గత మూడేళ్లుగా ఈయూకు భారత్‌ నుంచి బాస్మతి ఎగుమతులు తగ్గాయి. దీన్ని అదనుగా చేసుకుని పాకిస్థాన్‌ తన ఎగుమతులను విస్తరించుకుంది.

ఈ నేపథ్యంలో బాస్మతి రకంపై పూర్తి హక్కులు భారత్‌కే దక్కేలా యూపీలో ప్రొటెక్టెడ్‌ జియోగ్రాఫికల్‌ ఇండికేషన్‌ కోసం దరఖాస్తు చేసుకుంది. ఈ ప్రక్రియ దాదాపు తుదిదశకు చేరుకుంది. దీంతో భారత్‌కు అనుకూలమైన ఫలితం వస్తే తమ మార్కెట్‌ ప్రమాదంలో పడుతుందని భావించిన పాక్‌.. ఈ దరఖాస్తును వ్యతిరేకించింది. యూరోపియన్‌ యూనియన్‌లో బాస్మతి భౌగోళిక గుర్తింపు కోసం రెండు దేశాలు గతంలోనూ దరఖాస్తులు చేసుకోగా.. ప్రతిసారి రాజీ కుదిరింది. ఈసారి కూడా రెండు దేశాలు చర్చించుకుని ఒక పరిష్కారానికి రావాలని యూరోపియన్‌ కమిషన్‌ సూచించింది. ఇందుకోసం సెప్టెంబరు వరకు గడువు కల్పించింది. ఒకవేళ భారత్‌కు అనుకూల ఫలితం వస్తే బాస్మతి విషయంపై పాక్‌ యూరోప్‌ కోర్టులను ఆశ్రయించేందుకు సిద్ధమవుతోంది.

ప్రొటెక్టెడ్‌ జియోగ్రాఫికల్‌ ఇండికేషన్‌(పీజీఐ) హోదాతో ఆ భౌగోళిక ప్రాంతానికి చెందిన ఉత్పత్తులకు మేధో సంపత్తి హక్కులు లభిస్తాయి. దీని వల్ల నకిలీలు, దుర్వినియోగం నుంచి ఈ ఉత్పత్తులకు రక్షణ లభిస్తుంది. అంతేగాక, నాణ్యాత గుర్తింపు స్టాంపుతో ఎక్కువ ధరలకు విక్రయించుకునే అవకాశం ఉంటుంది. మన దేశానికి డార్జిలింగ్‌ టీకి పీజీఐ గుర్తింపు ఉంది. అయితే బాస్మతి బియ్యంపై చేసుకున్న దరఖాస్తులో తమ దేశం ఒక్కటే ఉత్పత్తిదారు అని ఎక్కడా ప్రస్తావించలేదని, కేవలం గుర్తింపు మాత్రమే కోరినట్లు భారత్ చెబుతోంది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని