ఫైజర్‌ టీకాపై ప్రతిష్టంభన.. కారణాలివేనా..?

తాజా వార్తలు

Published : 21/05/2021 18:44 IST

ఫైజర్‌ టీకాపై ప్రతిష్టంభన.. కారణాలివేనా..?

కేంద్ర ప్రభుత్వంలోకి కీలక వ్యక్తుల అభిప్రాయం

దిల్లీ: భారత్‌లో కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వంతో పలు వ్యాక్సిన్‌ తయారీ కంపెనీలు సంప్రదింపులు జరుపుతున్నాయి. ఇందులో భాగంగా అమెరికాకు చెందిన ఫైజర్‌ కూడా అనుమతుల కోసం తొలుత దరఖాస్తు చేసుకున్నప్పటికీ అనంతరం విరమించుకుంది. వ్యాక్సిన్‌ దిగుమతిపై కేంద్ర ప్రభుత్వం కొన్ని సడలింపులు ఇచ్చినప్పటికీ ఫైజర్‌ వ్యాక్సిన్‌ అనుమతిపై ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్‌ దుష్ర్పభావాలపై వేసే దావాల నుంచి ‘న్యాయసరమైన రక్షణ’ కల్పించాలంటూ ఫైజర్‌ పెట్టిన షరతు భారత్‌లో ఆ వ్యాక్సిన్ ఆలస్యానికి ప్రధాన కారణమని విశ్వసనీయ వర్గాల సమాచారం.

‘నష్టపరిహారం అంశంపై షరతు విధించడమే ఫైజర్‌తో ఉన్న సమస్య. అలాంటి షరతుకు ఎందుకు ఒప్పుకోవాలి. వ్యాక్సిన్‌ దుష్ప్రభావం వల్ల ఏదైనా ప్రతికూల సమస్య ఎదురైతే తయారీ దారుని(ఫైజర్‌ను) ప్రశ్నించలేము. ఎవరైనా వీటిని సవాల్‌ చేస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే.. దానికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుంది. సంస్థకు మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండదు’ అని ప్రభుత్వంలో వ్యాక్సిన్‌ అనుమతులకు సంబంధించిన కీలక వ్యక్తి వెల్లడించారు. దీనికి తోడు భారత్‌లో వ్యాక్సిన్‌ అనుమతి పొందాలంటే స్థానికంగా క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించాలన్న నిబంధనకు కట్టుబడి ఉండడంతో గతంలో చేసుకున్న దరఖాస్తును ఫైజర్‌ ఉపసంహరించుకుంది. ఇటు భారత ప్రభుత్వంతో పాటు ఫైజర్‌ కూడా తన నిబంధనలు మార్చుకోకపోవడంతోనే వ్యాక్సిన్‌ అనుమతిపై ప్రతిష్టంభన నెలకొన్నట్లు కేంద్రంలోని మరో కీలక సభ్యుడు అభిప్రాయపడ్డారు.

వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ఏమైనా దుష్ర్పభావాలు ఎదురైతే..అలాంటి సందర్భాల్లో నష్టపరిహారాలకు సంబంధించిన అంశాలపై రక్షణ కల్పించాలని ఫైజర్‌ సంస్థ డిమాండ్‌ చేస్తోంది. బ్రిటన్‌, అమెరికాతో పాటు చాలా దేశాల్లో అందుబాటులోకి వచ్చిన ఈ వ్యాక్సిన్‌కు, ఫైజర్‌ షరతులకు చాలా దేశాలు అంగీకరించాయి. అయితే, భారత్‌ మాత్రం అటువంటి నిబంధనను ఇప్పటివరకు ఏ వ్యాక్సిన్‌ తయారీ సంస్థకు అంగీకరించలేదు.

ఇక దేశంలో కరోనా వ్యాక్సిన్‌ కొరత ఏర్పడిన నేపథ్యంలో దిగుమతికి వేగంగా అనుమతులు ఇస్తామని భారత ప్రభుత్వం వెల్లడించింది. అంతేకాకుండా క్లినికల్‌ ప్రయోగాలపై నిబంధనలు సడలించడంతో పాటు దిగుమతికి కేవలం మూడు రోజుల్లోనే అనుమతులు మంజూరు చేస్తామని ప్రకటించింది. అయినప్పటికీ మూడు కంపెనీల్లో ఒక్కటి కూడా ఇప్పటివరకు అనుమతి కోసం దరఖాస్తు చేసుకోలేదు. దీంతో ఫైజర్‌, మోడెర్నా, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ వంటి సంస్థలతో భారత ప్రభుత్వమే సంప్రదింపులు జరుపుతోంది. ఈ నేపథ్యంలోనే భారత విదేశాంగశాఖ మంత్రి ఎస్‌ జయశంకర్‌ అమెరికాలో పర్యటించి ఫైజర్‌తో పాటు ఇతర వ్యాక్సిన్‌ సంస్థల అధినేతలతో భేటీ అయ్యేందుకు సిద్ధమయ్యారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని