Eastern Economic Forum: కాలం పెట్టిన పరీక్షకు ఎదురొడ్డి నిలిచింది

తాజా వార్తలు

Published : 03/09/2021 23:32 IST

Eastern Economic Forum: కాలం పెట్టిన పరీక్షకు ఎదురొడ్డి నిలిచింది

భారత్‌, రష్యా మైత్రిపై ‘ఈఈఎఫ్‌’ ప్లీనరీ సెషన్‌లో ప్రధాని మోదీ వ్యాఖ్య

ఇంటర్నెట్‌ డెస్క్: భారత్‌, రష్యాల మైత్రి.. కాలం పెట్టిన పరీక్షకు ఎదురొడ్డి నిలిచిందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. కొవిడ్‌ కట్టడి, వ్యాక్సినేషన్‌ విషయంలో రెండు దేశాల మధ్య బలమైన పరస్పర సహకార బంధం ఏర్పడినట్లు తెలిపారు. రష్యాలోని వ్లాదివోస్టాక్‌ నగరంలో నిర్వహించిన ఈస్టర్న్ ఎకనామిక్‌ ఫోరం(ఈఈఎఫ్‌) ప్లీనరీ సెషన్‌ను ఉద్దేశించి ప్రధాని శుక్రవారం ఆన్‌లైన్‌ వేదికగా ప్రసంగించారు. ‘భారత్‌లో నైపుణ్యం కలిగిన శ్రామికశక్తి ఉంది. రష్యన్‌ ఫార్‌ ఈస్ట్‌(రష్యాలోని తూర్పు భాగం) వనరులతో సమృద్ధిగా ఉంది. ఈ క్రమంలో మా శ్రామిక శక్తి ఈ ప్రాంత అభివృద్ధికి దోహదపడే అవకాశం ఉంద’ని మోదీ పేర్కొన్నారు. 2019లో ఫోరంలో పాల్గొనేందుకు వ్లాదివోస్టాక్‌కు వచ్చిన విషయాన్ని ప్రధాని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ‘యాక్ట్ ఫార్ ఈస్ట్’ పాలసీ విషయంలో భారత్‌ అప్పుడే తన నిబద్ధతను ప్రకటించినట్లు, ఇరు దేశాల మధ్య ప్రత్యేక భాగస్వామ్యంలో ఈ పాలసీ ఒక ముఖ్య భాగమన్నారు. 

ఇంధన విపణిలో స్థిరత్వానికి కృషి..

రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యంలో ఇంధన రంగం కూడా కీలక అంశమని, ప్రపంచ ఇంధన మార్కెట్‌లో స్థిరత్వాన్ని తీసుకురావడంలో ఇరు దేశాలు కలిసి సహాయపడగలవని మోదీ అభిప్రాయపడ్డారు. భారీ వాణిజ్య నౌకల తయారీకి భారత్‌కు చెందిన మజగావ్‌ డాక్స్‌ లిమిటెడ్‌, రష్యాకు చెందిన జ్వేజ్డా కలిసి పనిచేయనున్నట్లు తన ప్రసంగంలో ప్రకటించారు. ఈ క్రమంలో భారత్‌ను సందర్శించాలంటూ రష్యన్ ఫార్ ఈస్ట్ ప్రాంతంలోని 11 ప్రాంతాల గవర్నర్లను ఆహ్వానించారు. ఈ ఏడాది ప్రారంభంలోనూ భారత విదేశాంగ కార్యదర్శి హర్ష్ శ్రింగ్లా మాస్కోలో పర్యటించారు. తూర్పు రష్యాలో పరస్పర ఆర్థిక సహకార బలోపేతంపై చర్చించారు.

ఏమిటీ ఈఈఎఫ్‌, యాక్ట్‌ ఫార్‌ ఈస్ట్‌ పాలసీ..

* ఆసియా-పసిఫిక్ రీజియన్‌, ఆసియాన్‌కు చెందిన ఆయా దేశాల మధ్య ప్రాంతీయ సమైక్యత, ఆర్థిక, పారిశ్రామిక, సాంకేతిక రంగాల అభివృద్ధితోపాటు ఆయా సవాళ్లపై చర్చలకు వేదికగా 2015లో రష్యా.. ఈస్టర్న్‌ ఎకనామిక్‌ ఫోరం(ఈఈఎఫ్‌)ను ఏర్పాటు చేసింది. ఏటా రష్యాలోని వ్లాదివోస్టాక్‌ నగరంలో ప్లీనరీ సెషన్స్‌ జరుగుతాయి.

* సెప్టెంబరు, 2019లో 5వ ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరం ప్లీనరీ సెషన్‌లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ వ్లాదివోస్టాక్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ‘యాక్ట్ ఫార్ ఈస్ట్’ పాలసీకి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా తూర్పు రష్యా అభివృద్ధికి ఒక బిలియన్ అమెరికన్‌ డాలర్ల రుణం ప్రకటించారు. చెన్నై, వ్లాడివోస్టాక్ మధ్య నేరుగా సముద్ర రవాణా కారిడార్ ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని