Agni-5: చైనాకు అగ్ని సంకేతం..!

తాజా వార్తలు

Published : 29/10/2021 02:21 IST

Agni-5: చైనాకు అగ్ని సంకేతం..!

 బలోపేతమైన స్ట్రాటజిక్‌ ఫోర్స్‌ కమాండ్‌

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

భారత్‌ 2018 తర్వాత తొలిసారి అగ్ని-5 క్షిపణిని పరీక్షించింది. ఓ పక్క చైనాతో వివాదం చిక్కుముడులు పడుతున్న వేళ ఈ ఖండాంతర క్షిపణి పరీక్ష జరిగింది. ఈసారి పరీక్షను భారత్‌ వ్యూహాత్మక దళాల కమాండ్‌ (స్ట్రాటజిక్‌ ఫోర్స్‌ కమాండ్‌) చేపట్టింది. అగ్ని-5ను దళాల్లోకి చేర్చేందుకు వీలుగా చేపట్టిన యూజర్‌ ట్రయల్‌ ఇది. ఈ పరీక్షలో డీఆర్‌డీవో రాడార్‌ నౌకలు, టెలీమెట్రీల్లో గమనించింది. కేవలం 18 నిమిషాల్లోపే ఇది లక్ష్యాన్ని ఛేదించింది.

డ్రాగన్‌ కోసమే ఈ ఖండాంతర క్షిపణి..

కొన్ని నెలల క్రితమే పరీక్షలు జరుపుకొన్న ‘అగ్ని ప్రైమ్‌’ క్షిపణి సహా మిగిలిన అగ్ని సిరీస్‌లోని ఆయుధాలు మొత్తం పాకిస్థాన్‌ను దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి చేసినవి. కానీ, ఒక్క అగ్ని-5 ఖండాంతర క్షిపణిని మాత్రం చైనా భూభాగం మొత్తం దాడి పరిధిలోకి తెచ్చేలా తయారు చేశారు. అఫ్రికా, ఐరోపా ఖండాల్లోని కొన్ని దేశాలు కూడా దీని పరిధిలోకి వస్తాయి. ఇలాంటి క్షిపణులు ఉన్న చైనా, అమెరికా, రష్యా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌ల సరసన భారత్‌ చేరింది. ఈ క్షిపణి దాదాపు 1500 కిలోల బరువున్న అణువార్‌ హెడ్‌ను శత్రువుపై ప్రయోగించగలదు. దీనిని కెనస్టర్‌(గొట్టం వంటి పరికరం) నుంచి కూడా ప్రయోగించవచ్చు. దీని వల్ల క్షిపణిని రైలు, రోడు మార్గాల్లో సురక్షితంగా తరలించి ప్రయోగించే అవకాశం లభిస్తుంది. ఇక వార్‌ హెడ్‌ అంతరిక్షంలోకి వెళ్లి తిరిగి భూవాతావరణంలోకి ప్రవేశించే సమయంలో శబ్ద వేగం కంటే కొన్ని రెట్లు అధికంగా ఉంటుంది. ఈ క్రమంలో వార్‌ హెడ్‌ దెబ్బ తినకుండా దేశీయంగా తయారు చేసిన హీట్‌ షీల్డ్‌ను అమర్చారు. ఇది లోపల వైపు వేడిని 50డిగ్రీల సెల్సియస్‌ లోపే ఉండేట్లు చూస్తుంది. 

ఏకకాలంలో పలు వార్‌హెడ్లను ప్రత్యర్థులపై ప్రయోగించే ఎంఐఆర్‌వీ పరిజ్ఞానాన్ని కూడా పరీక్షించినట్లు వార్తలొస్తున్నాయి. కానీ, దీనిపై అధికారికంగా ఎటువంటి ప్రకటన వెలువడలేదు. 

స్ట్రాటజిక్‌ ఫోర్స్‌ కమాండ్‌ ఏమిటీ..

భారత్‌లోని అణ్వాయుధాలను ప్రయోగించే సామర్థ్యం కేవలం స్ట్రాటజిక్‌ ఫోర్స్‌ కమాండ్‌కే ఉంటుంది. దీనిని 2003లో ప్రారంభించారు. దీనిలో త్రివిధ దళాలు సభ్యులే. అణ్వాయుధాలు ప్రయోగించే పరికరాలు మొత్తం ఈ కమాండ్‌ అధీనంలోనే ఉంటాయి. ఐఎన్‌ఎస్‌ అరిహంత్‌ కూడా దీని అధీనంలోనే ఉంటుంది. ప్రస్తుతం దీనికి వైస్‌ అడ్మిరల్‌ పి.బి. పండిత్‌ చీఫ్‌గా వ్యవహరిస్తున్నారు.  

దాదాపు నెల ముందు నుంచే చైనా గగ్గోలు..

భారత్‌ అగ్ని-5ను పరీక్షించనుందని దాదాపు నెలరోజుల ముందు నుంచే భారీగా ప్రచారం జరిగింది. దీనిపై చైనా సెప్టెంబర్‌ 16వ తేదీన స్పందించింది. 1998లో ఐరాస భద్రతా మండలిలో చేసిన 1172 తీర్మానానికి వ్యతిరేకంగా పరీక్షలు నిర్వహించకూడదని హితవు పలికింది. భారత్‌ వల్ల దక్షిణాసియాలో సుస్థిరత, శాంతిభద్రతలకు ముప్పు వాటిల్లుతుందని చైనా విదేశాంగశాఖ ప్రతినిధి ఝావో లిఝియాన్‌ పేర్కొన్నారు. తాజాగా పరీక్ష ముగిశాక కూడా ఆయన నుంచి ఇలాంటి స్పందనే వచ్చింది.  1998లో భారత్‌ అణు పరీక్షలు చేసిన సమయంలో ఐరాస ఈ తీర్మానం చేసింది. వాస్తవానికి 2018లో చైనీస్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ మిసైల్‌ ట్రాకింగ్‌ వ్యవస్థను పాకిస్థాన్‌కు విక్రయిస్తామని ప్రకటించింది. అంతేకాదు, పాక్‌కు ఎంఐఆర్‌వీ పరిజ్ఞానాన్ని ఇచ్చేందుకు అంగీకరించింది.  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని