‘రెండో ఉపద్రవాలను’ ఎదుర్కొనేందుకు భారత్‌ సిద్ధం!

తాజా వార్తలు

Published : 06/04/2021 01:42 IST

‘రెండో ఉపద్రవాలను’ ఎదుర్కొనేందుకు భారత్‌ సిద్ధం!

ఆర్థిక మంత్రిత్వశాఖ నెలవారీ నివేదిక

దిల్లీ: కరోనా వైరస్‌ మొదటి తరంగాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్న భారత్‌, రెండో విజృంభణ వల్ల కలిగే ఉపద్రవాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందని ఆర్థిక మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడంతో పాటు, బలమైన మార్గంలోనే ప్రయాణిస్తోందని ఆర్థిక శాఖ తన నెలవారీ నివేదికలో పేర్కొంది.

‘2020-2021 ఆర్థిక సంవత్సరంలో చరిత్రలో ఎన్నడూ ఎరుగని కరోనా వైరస్‌ విపత్తును భారత్‌ ఎదుర్కొంది. అనంతరం కోలుకున్న ఆర్థిక వ్యవస్థ.. ప్రస్తుతం గాడిలోపడింది. మెరుగైన, బలమైన ఆర్థిక వ్యవస్థను తిరిగి నిర్మించుకునేందుకు భారత్‌ సరైన మార్గంలోనే వెళ్తున్నట్టు అత్యంత విశ్వసనీయ సూచికలు వెల్లడిస్తున్నాయి. కరోనా వైరస్‌ మొదటి దశ విజృంభణ అనుభవాల ద్వారా సెకండ్‌ వేవ్‌ ఉపద్రవాలను ఎదుర్కొనేందుకు భారత్‌ సిద్ధంగానే ఉంది’ అని ఆర్థికశాఖ నెలవారీ నివేదికలో వెల్లడించింది. ఆత్మనిర్భర భారత్‌ మిషన్‌ ద్వారా పెట్టబోయే పెట్టుబడులు ఇందుకు బలమైన పునరుజ్జీవనంగా మారుతాయని పేర్కొంది. అంతేకాకుండా 2021-22 కేంద్ర బడ్జెట్‌లో మౌలిక సదుపాయాలు, మూలధన వ్యయాలకు జరిపిన కేటాయింపులు కూడా భారీ ప్రోత్సాహాన్ని అందిస్తాయని ఆర్థిక శాఖ నివేదిక అభిప్రాయపడింది.

151 రోజులు ఆలస్యంగా సెకండ్‌ వేవ్‌..

దేశంలో కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ విజృంభణ కొనసాగుతున్నప్పటికీ.. ఈ దశ ప్రారంభాన్ని 151 రోజులు ఆలస్యం చేయగలినట్లు ఆర్థిక శాఖ నివేదిక వెల్లడించింది. తొలి విజృంభణ గరిష్ఠానికి- రెండో విజృంభణ ప్రారంభానికి మధ్య 151 రోజుల గడువు ఉందని, ఇతర దేశాల్లో ఈ గడువు చాలా తక్కువని అభిప్రాయపడింది. సెకండ్‌ వేవ్‌ ఉపద్రవాలను ఎదుర్కోవడం కోసం భారత్‌ సిద్ధమయ్యేందుకు ఈ ఆలస్యం దోహదం చేసిందని ఆర్థిక శాఖ నివేదిక స్పష్టం చేసింది. ఇక ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ప్రారంభం కావడంతో గతకొన్ని నెలలుగా దేశ ఆర్థికస్థితి కూడా మెరుగుపడిందని పేర్కొంది.

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని