
తాజా వార్తలు
‘మీ త్యాగాలకు భారతావని రుణపడి ఉంటుంది’
రాష్ట్రపతి, ప్రధాని ఆర్మీడే శుభాకాంక్షలు
దిల్లీ: దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో అహర్నిశలు శ్రమిస్తున్న జవాన్లకు ఆర్మీ డేను పురస్కరించుకుని యావత్ భారతావని కృతజ్ఞతలు చెబుతోంది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహా పలువురు కేంద్రమంత్రులు, ప్రముఖులు సోషల్‌మీడియా వేదికగా ఆర్మీ డే శుభాకాంక్షలు తెలిపారు. విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన అమరవీరులను స్మరించుకున్నారు.
1949లో తొలి భారతీయ జనరల్.. బ్రిటిష్ అధికారి నుంచి భారత సైన్యం బాధ్యతలు తీసుకున్న గుర్తుగా ఏటా జనవరి 15న సైనిక దినోత్సవం జరుపుకొంటున్నాం. దిల్లీలో శుక్రవారం జరిగిన ఆర్మీడే కార్యక్రమంలో చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, త్రివిధ దళాల అధిపతులు ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణె, ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ భదౌరియా, నేవీ చీఫ్ అడ్మిరల్ కరంబీర్ సింగ్.. జాతీయ యుద్ధ స్మారకం వద్ద అమరవీరులకు నివాళులర్పించారు.
* భారత సైన్యంలోని పరాక్రమ వీరులకు, వీరవనితలకు ఆర్మీ డే శుభాకాంక్షలు. దేశ సేవలో ప్రాణాలు అర్పించిన ధీరులను యావత్ భారతావని గుర్తుంచుకుంటుంది. సైనికుల త్యాగాలకు దేశం ఎప్పటికీ రుణపడి ఉంటుంది - రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
* ఆర్మీ డే శుభాకాంక్షలు. శౌర్యానికి, దేశభక్తికి, అంకితభావానికి మన ధీర జవాన్లు ప్రతీకలు. వెలకట్టలేని మీ త్యాగానికి దేశం ఎప్పటికీ కృతజ్ఞతగా ఉంటుంది - ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
* తల్లి భారతిని అహర్నిశలు రక్షిస్తున్న పరాక్రమ సైనికులు, వారి కుటుంబసభ్యులకు ఆర్మీ డే శుభాకాంక్షలు. మన సైన్యం బలమైనది, ధైర్యవంతమైనది. కృత నిశ్చయంతో, పరాక్రమాలతో దేశాన్ని ఎల్లప్పుడూ తలెత్తుకుని గర్వపడేలా చేస్తున్నారు. దేశ ప్రజలందరి తరఫున భారత ఆర్మీకి సెల్యూట్ చేస్తున్నా - ప్రధానమంత్రి నరేంద్రమోదీ
* భారత ఆర్మీ ధైర్య పరాక్రమాలు, త్యాగాలకు దేశం సెల్యూట్ చేస్తోంది. దేశానికి నిస్వార్థ సేవ చేస్తున్న మిమ్మల్ని చూసి భారత్ గర్వపడుతోంది - కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
ఇవీ చదవండి..
వాటర్ బాటిల్‌పై కేసు.. ఐదేళ్ల తర్వాత గెలుపు