
తాజా వార్తలు
సిక్కిం సరిహద్దుల్లో భారత్, చైనా జవాన్ల ఘర్షణ!
పలువురికి గాయాలు
గ్యాంగ్‌టక్: తూర్పు లద్దాఖ్ వివాదంతో భారత్, చైనా మధ్య ఓ వైపు ప్రతిష్టంభన కొనసాగుతుండగానే.. వాస్తవాధీన రేఖ వద్ద మరో ప్రాంతంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. సిక్కింలోని నకులా సరిహద్దుల్లో భారత్, చైనా జవాన్లు ఘర్షణకు దిగారు.
నకులా వద్ద భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చేందుకు పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) బలగాలు ప్రయత్నించాయి. వీరిని భారత బలగాలు అడ్డుకొన్నాయి. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. గతవారం చోటుచేసుకున్న ఈ ఘటన తాజాగా సోమవారం వెలుగులోకి వచ్చింది. పీఎల్ఏ సైనికులను భారత బలగాలు వెనక్కి పంపాయి. ఈ ఘర్షణల్లో పలువురు జవాన్లు గాయపడినట్లు తెలుస్తోంది.
స్పందించిన ఆర్మీ..
కాగా.. ఘటనపై భారత సైన్యం అధికార ప్రతినిధి ఒకరు స్పందించారు. జనవరి 20న ఉత్తర సిక్కింలోని నకులా ప్రాంతంలో భారత్-చైనా జవాన్ల మధ్య స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుందని తెలిపారు. అయితే స్థానిక కమాండర్ల జోక్యంతో సమస్య అప్పుడే పరిష్కారమైందన్నారు. దీనికి సంబంధించి అవాస్తవ కథనాలకు దూరంగా ఉండాలంటూ మీడియాను కోరారు.
కాగా.. తూర్పు లద్దాఖ్‌లో ప్రతిష్టంభనపై రెండు దేశాల మధ్య తొమ్మిదో విడత చర్చలకు కొద్ది రోజుల ముందే ఈ ఘర్షణ చోటుచేసుకోవడం గమనార్హం. లద్దాఖ్ అంశంపై ఆదివారం భారత్, చైనా సైనిక ఉన్నతాధికారులు సమావేశమైన విషయం తెలిసిందే. నిన్న ఉదయం 10 గంటలకు మొదలైన ఈ చర్చలు సోమవారం తెల్లవారుజామున 2.30 గంటల వరకు కొనసాగాయి. సరిహద్దుల్లో ఉద్రిక్తతల తగ్గింపు, బలగాల ఉపసంహరణపైనే ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. బలగాల తగ్గింపు తొలి బాధ్యత చైనాదేనని భారత బృందం మరోసారి స్పష్టం చేసినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.
అయితే ఓవైపు ఈ చర్చలు జరుగుతుండగానే లద్దాఖ్‌లో డ్రాగన్ కవ్వింపు చర్యలకు పాల్పడింది. లద్దాఖ్ సరిహద్దుల్లో భద్రతను మరింత పెంచింది. దీనికి భారత్ కూడా దీటుగా ప్రతిస్పందిస్తోంది.
ఇవీ చదవండి..
భారత్-చైనా: 15 గంటలకు పైనే చర్చలు