Corona: ఆమె నిద్రకు దూరమై..ఏడుస్తూనే ఉంది
close

తాజా వార్తలు

Published : 16/06/2021 01:25 IST

Corona: ఆమె నిద్రకు దూరమై..ఏడుస్తూనే ఉంది

మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపిన వైరస్

దృష్టి సారించిన టెక్ సంస్థలు

దిల్లీ: ‘కొవిడ్ కారణంగా నా తండ్రిని కోల్పోయాను. ఒక్కసారిగా కుటుంబ బాధ్యతలన్నీ నామీద పడేసరికి ఒత్తిడికి గురయ్యాను’..ఓ యువకుడి ఆవేదన.

‘నేను ఐసీయూలో ఉన్నప్పుడు ఎంతో మంది నా కళ్లముందే ప్రాణాలు విడిచారు. వెంటిలేటర్ల బీప్‌ శబ్దాలతో రాత్రుళ్లు నాకు మెలకువగా ఉండేది. నేనేందుకు బతికున్నానో తెలీదు’..ఓ కొవిడ్ బాధితుడి మనోవేదన.

‘కరోనాతో మా అత్తగారు చనిపోయారు. మా ఇద్దరికి పొసిగేది కాదు. ఆమె దూరమైన దగ్గరి నుంచి నాకు అపరాధభావంతో నిద్ర కూడా రావడం లేదు. ఏడుపు ఆగడం లేదు’..ఓ కోడలి పశ్చాత్తాపం.

ఇలా ఎంతోమందికి కరోనా రెండోదశ కంటిమీద కునుకు లేకుండా చేసింది. ఆత్మీయులను దూరం చేసింది. ఆర్థికంగా దెబ్బతీసింది. వైరస్ సోకి వణికించింది. పైన చెప్పినవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. దాంతో తమ యువఉద్యోగుల మానసిక ఆరోగ్యంపై మహమ్మారి చూపిన ప్రభావంపై టెక్‌ సంస్థలన్నీ దృష్టిసారించాయి. 

హెచ్‌సీఎల్ టెక్నాలజీకి చెందిన సైకాలజిస్ట్‌ విజయలక్ష్మి గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితిని చూడలేదు. ఆమె ఇప్పుడు వారానికి 40మంది ఉద్యోగులకు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. మొదటి దశ సమయంతో పోల్చుకుంటే ఇది నాలుగు రెట్లు అధికమని ఆమె వెల్లడించారు. గతంలో సెషన్లన్నీ సరదాగా గడిచిపోగా..ఇప్పుడు బాధతో నిండిన వ్యక్తులు ఆమె వద్దకు వస్తున్నారు. ‘ఇటీవల నా దగ్గరికి ఓ యువతి వచ్చారు. కొవిడ్‌ కారణంగా తన అత్తగారిని కోల్పోవడం ఆమెను తీవ్రంగా బాధించింది. అది ఆమెను నిద్రకు దూరం చేసింది. అంతకుముందు ఆ అత్తాకోడలికి పొసిగేది కాదు. వాటిని తలచుకొని ఆమె అపరాధభావంతో కుమిలిపోతున్నారు. రెండోదశ తీవ్రతతో ఉద్యోగులు తీవ్ర భయానికి గురయ్యారు. ఐసీయూ పడకలు, వైద్య సేవల కొరత వారిని ఆందోళనకు గురిచేసింది’ అని విజయలక్ష్మి చెప్పారు. అలాగే హెచ్‌సీఎల్ వంటి టెక్ సంస్థలు ఉద్యోగులపై పడిన మానసిక ప్రభావాన్ని గుర్తించాయి. ఇన్ఫోసిస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ వంటి దిగ్గజ సంస్థలు సిబ్బంది సంక్షేమంపై ఎప్పటి నుంచో దృష్టి సారించాయి. శ్రామిక శక్తి ఆరోగ్యమే ఆరోగ్యకరమైన వ్యాపారానికి దోహదం చేస్తుందని వాటి అంచనా. అందుకే సైకాలజిస్టులు ఆ సంస్థల్లో ఎప్పటినుంచో కొలువుదీరారు. 

అయితే ఈ కొవిడ్ మహమ్మారి సృష్టించిన మానసిక సమస్యలను ఎలా పరిష్కరించాలో సంస్థలకు కూడా స్పష్టత లేదు. మొదటి దశలో ఎంతో శ్రద్ధతో పనిచేసిన ఉద్యోగులు..రెండో దశకు వచ్చేసరికి ఆందోళన, భయం, చంచలమైన ఆలోచనలతో కొట్టుమిట్టాడుతున్నారు. న్యూయార్క్, శాన్‌ఫ్రాన్సిస్కో వంటి ప్రాంతాల్లో  సాధారణ జీవితాలను ప్రారంభించగా..ఇక్కడ వీరు క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. దాంతో ఈ సమస్యలను పరిష్కరించడం సంస్థలకు సవాలుగా పరిణమించింది. 

‘కరోనా గరిష్ఠ స్థాయికి చేరిన సమయంలో 50 నుంచి 60 శాతం ఉత్పాదక తగ్గిపోతుందని పలు సంస్థలు అంచనావేశాయి’ అని ఫారెస్టర్ రిసెర్చ్‌ ఉపాధ్యక్షుడు, పరిశోధక సంచాలకులు అశుతోశ్‌ శర్మ వెల్లడించారు. ఈ సంస్థ ఉద్యోగుల ఉత్పాదకతను అధ్యయనం చేస్తుంది. ఈ సమస్యలు దేశపు 194 బిలియన్‌ డాలర్ల టెక్ సేవల పరిశ్రమను దెబ్బతీస్తుందనే భయాల మధ్య..సంస్థలు కౌన్సిలింగ్, చికిత్సలు, కౌన్సిలింగ్‌ యాప్స్ వంటి వాటిని ప్రయత్నించాయి. సిబ్బందితో సానుకూలంగా వ్యవహరించాలని మేనేజర్లకు శిక్షణనిస్తున్నాయి. ‘ఆత్మీయుల మరణాలను దగ్గరి నుంచి చూసేసరికి వారంతా ఆందోళనకు గురయ్యారు. చాలామంది వారేం చేస్తున్నారో గుర్తించడం లేదు’ అని హెచ్‌సీఎల్ హెచ్‌ఆర్‌ ఎడ్ అభిప్రాయపడ్డారు. యాప్స్‌ ఆధారంగా కౌన్సిలింగ్ పొందడమనేది ఇప్పుడిప్పుడే అందుబాటులోకి వస్తోంది. కరోనా కారణంగా గూగుల్ సహకారంతో నడుస్తోన్న స్టార్టప్‌ విసాకు యాక్టివ్ యూజర్లు మూడు రెట్లు పెరిగి మూడు లక్షలకు చేరారు. ఇదంతా ఒక ఏడాది కాలంలోనే జరిగింది. ‘ప్రతి సంస్థలో కనీసం 50 శాతం మంది తీవ్ర వేదనను అనుభవిస్తున్నారు. ఈ విషాద పరిస్థితుల్లో ఏ సంస్థ వారిని అలా వదిలేయలేదు’ అని విసా సీఈఓ అన్నారు. ప్రముఖ సంస్థ టాటా కన్సల్టెన్సీ కూడా ఈ తరహా ప్రయత్నాలే చేస్తోంది. యోగా, ధ్యానం వంటి సెషన్లను నిర్వహిస్తోంది.

కరోనా ప్రభావంపై ఎంఫసిస్ సీఈఓ నితిన్ రాకేశ్ మాట్లాడుతూ..‘మనమంతా దయగల నాయకులుగా ఉండాల్సి సమయం వచ్చింది. కరోనా రెండోదశ భారత్‌ను తీవ్రంగా వణికించింది. గత 18 నెలలుగా వైరస్ మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపింది. సిబ్బందికి పూర్తిస్థాయి రక్షణ అందించాల్సిన సమయం ఇది’ అని వ్యాఖ్యానించారు. ఆయన ప్రతిరోజు వ్యక్తిగతంగా ఉద్యోగుల బాగోగుల గురించి తెలుసుకుంటుంటారు. . ‘ఇప్పుడు అంతా భిన్నంగా ఉంది. మానసిక ఆరోగ్యంపై పనిప్రదేశాల్లో చర్చించేందుకు కొవిడ్ గేట్లు తెరిచింది’ అనిమానసిక వైద్యులు వెల్లడించారు. ఈ బాధలను తగ్గిస్తూ, ముందుకు వెళ్లేందుకు ఐటీ సంస్థలు నాయకత్వం వహించాలని కోరుతున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని