టీకా పంపిణీ: 10కోట్ల మార్కును దాటిన భారత్‌!

తాజా వార్తలు

Published : 11/04/2021 15:04 IST

టీకా పంపిణీ: 10కోట్ల మార్కును దాటిన భారత్‌!

మహారాష్ట్రలోనే కోటి డోసుల పంపిణీ

దిల్లీ: దేశంలో కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ఊపందుకుంది. గడిచిన 24గంటల్లో 35లక్షల డోసులను పంపిణీ చేశారు. గతకొన్ని రోజులుగా నిత్యం సరాసరి 30లక్షల డోసులను పంపిణీ చేస్తున్నారు. ఇలా దేశంలో ఇప్పటివరకు పంపిణీ చేసిన కొవిడ్‌ డోసుల సంఖ్య 10కోట్ల మార్కును దాటినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

భారత్‌లో జనవరి 16 తేదీన కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ మొదలైన విషయం తెలిసిందే. అప్పటినుంచి వేగవంతంగా కొనసాగుతోన్న ఈ ప్రక్రియ.. ఏప్రిల్‌ 10 నాటికి 85రోజులు పూర్తిచేసుకుంది. ఇలా ఇప్పటివరకు 10కోట్ల 15లక్షల డోసులను అందించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. టీకా తీసుకున్న వారిలో 88లక్షల 88వేల మందికి తొలిడోసు అందించారు. మరో 12లక్షల మంది మాత్రం ఇప్పటివరకు రెండు డోసులు తీసుకున్నారు. అయితే, దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నాలుగు రోజుల పాటు ‘టీకా ఉత్సవ్‌’ పేరుతో ప్రత్యేక కార్యక్రమానికి పిలుపునిచ్చింది. దీంతో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో టీకా పంపిణీ కేంద్రాల వద్ద ప్రజలు భారీ సంఖ్యలో క్యూ కడుతున్నారు. ఇదే సమయంలో టీకా నిల్వలు తగ్గిపోయాయని.. సాధ్యమైనంత తొందరగా టీకా డోసులను పంపించాలని ఆయా రాష్ట్రాలు కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నాయి.

మహారాష్ట్రలోనే కోటి డోసులు..

కరోనా వైరస్‌ ఉద్ధృతికి అతలాకుతలమవుతోన్న మహారాష్ట్రలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. ఆదివారం ఉదయం వరకు అక్కడ కోటి 38వేల డోసులను పంపిణీ చేసినట్లు మహారాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. రాజస్థాన్‌లో (95లక్షలు), గుజరాత్‌లో (90లక్షల) అత్యధికంగా కరోనా డోసులను అందించారు. ఉత్తర్‌ప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లలో 80లక్షల చొప్పున కొవిడ్ డోసులను అందించారు.

ప్రపంచ వ్యాప్తంగా 76కోట్ల డోసులు..

కొవిడ్‌ మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటివరకు 154 దేశాల్లో కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చినట్లు అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇలా ఇంతవరకు 76కోట్ల డోసులను పంపిణీ చేశారు. వీటిలో అత్యధికంగా ఒక్క అమెరికాలోనే 18కోట్ల డోసులను పంపిణీ చేశారు. ఇక కరోనా వైరస్‌కు కారణమైన చైనాలోనూ దాదాపు 16కోట్ల డోసులను పంపిణీ చేయగా, తాజాగా భారత్‌లో ఇది 10కోట్ల మార్కును దాటింది. యూరోపియన్‌ యూనియన్‌లో 9కోట్లు, బ్రిటన్‌లో 4కోట్ల డోసులను అందించారు. కానీ, పేద దేశాలు మాత్రం కొవిడ్‌ వ్యాక్సిన్‌ కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని