corona: వరసగా ఏడోరోజు రికవరీలే ఎక్కువ

తాజా వార్తలు

Published : 20/05/2021 16:49 IST

corona: వరసగా ఏడోరోజు రికవరీలే ఎక్కువ

వెల్లడించిన కేంద్ర ఆరోగ్య శాఖ

దిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. మరోవైపు, వరసగా నాలుగో రోజు కొత్త కేసులు మూడు లక్షల దిగువనే నమోదయ్యాయి. ఏడు రోజులుగా కొత్త కేసుల కంటే రికవరీలే ఎక్కువగా ఉండటం ఊరటనిచ్చే విషయం. నిన్న 3,69,077 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తంగా 2,23,55,440 మంది వైరస్‌ను జయించారని గురువారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే రికవరీ రేటు 86.74 శాతానికి పడిపోయింది. రికవరీలపరంగా పది రాష్ట్రాలు 75.11 శాతం వాటాను కలిగి ఉన్నాయి. 

పది రాష్ట్రాల్లో 77.17 శాతం కొత్త కేసులు:

గడిచిన 24 గంటల్లో భారత్‌లో 2,76,110 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దేశవ్యాప్తంగా పది రాష్ట్రాల్లో 77.17 శాతం కేసులు వెలుగుచూశాయి. రెండోదశలో కరోనా హాట్‌స్పాట్‌గా మారిన మహారాష్ట్రలో కొత్త కేసులు తగ్గుముఖం పడుతుండగా.. తమిళనాడు, కర్ణాటక పరిస్థితి కలవరపెడుతోంది. తమిళనాడులో 34,875, కర్ణాటకలో 34,281 మందికి వైరస్ సోకింది. అలాగే వరసగా నాలుగు రోజులుగా నాలుగు వేలకుపైగా మరణాలు నమోదుకాగా, నిన్న తగ్గుముఖం పట్టాయి. తాజాగా 3,874 మంది ప్రాణాలు కోల్పోయారు. 

5.5శాతానికి తగ్గిన దిల్లీ పాజిటివిటీ రేటు..

దేశ రాజధాని దిల్లీలో కరోనా వైరస్ కాస్త అదుపులోకి వచ్చినట్లు కనిపిస్తోంది. 24 గంటల వ్యవధిలో 3,231 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఏప్రిల్‌ 1 తరవాత రోజూవారీ కేసులు ఈ స్థాయిలో తగ్గడం ఇదే తొలిసారి.  నిన్న 233 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక దశలో 400కు పైగా మరణాలు నమోదయ్యాయి. ఇప్పటివరకు 14లక్షలకు పైగా పాజిటివ్ కేసులు వెలుగుచూడగా..22 వేలమందికి పైగా మరణించారు. అలాగే ఏప్రిల్ నెలలో 36 శాతానికి చేరిన పాజిటివిటీ రేటు..5.5 శాతానికి తగ్గింది. వైరస్ కట్టడిలో భాగంగా విధించిన లాక్‌డౌన్ కట్టడి ఆంక్షలు పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. మూడో దశ కరోనా ముప్పు పొంచిఉందని నిపుణులు హెచ్చరిస్తోన్న నేపథ్యంలో..దానిని ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నట్లు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. 

బ్లాక్‌ ఫంగస్‌: ప్రత్యేక కేంద్రాల ఏర్పాటు..
కరోనా నుంచి కోలుకున్న కొందరిలో బ్లాక్‌ ఫంగస్‌ కేసులు వెలుగుచూస్తుండటంతో ప్రభుత్వాలు అప్రమత్తం అవుతున్నాయి. దిల్లీలో ఇప్పటికే 185 బ్లాక్‌ ఫంగస్ కేసులను గుర్తించారు. దాని నిర్ధారణ, చికిత్స నిమిత్తం లోక్‌నాయక్‌, జీటీబీ, రాజీవ్ గాంధీ ఆసుపత్రుల్లో ప్రత్యేక కేంద్రాల ఏర్పాటుకు కేజ్రీవాల్ ఆదేశాలు జారీచేశారు. 


 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని