Islamic State: నీవు నేర్పిన విద్యయే తాలిబన్‌..!

తాజా వార్తలు

Updated : 24/09/2021 13:07 IST

Islamic State: నీవు నేర్పిన విద్యయే తాలిబన్‌..!

 ఇస్లామిక్‌ స్టేట్‌ ఖోరాసాన్‌ వ్యూహం..!

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

రెండోసారి అధికారం చేపట్టిన తాలిబన్లకు ఇస్లామిక్‌ స్టేట్‌ రూపంలో కొత్త తలనొప్పి మొదలైంది. అమెరికా సైన్యం ఉండగా.. తాలిబన్లు అనుసరించిన వ్యూహాలను.. ఇప్పుడు ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదులు అమలు చేస్తున్నారు. దీనికి భారీ సంఖ్యలో తాలిబన్లు బలి అవుతున్నారు. అమెరికా మాదిరిగా దాడులను అడ్డుకోవడానికి తాలిబన్లకు అవకాశం లేకుండా పోయింది. కొత్త ప్రభుత్వంపై ‘కాబుల్‌ ఎయిర్‌పోర్టు దాడి’ నుంచి ‘జలాలాబాద్‌లో బాంబు దాడి’ వరకూ అన్నింటికీ ఇస్లామిక్‌ స్టేట్‌ బాధ్యత తీసుకొంది. ఇస్లామిక్‌ స్టేట్‌ దాడులను పైకి చెప్పుకొంటే పరువు పోతుందని తాలిబన్లు మదనపడుతున్నారు. ఇటీవల తాలిబన్‌ ప్రతినిధి జైబిహుల్లా ముజాహిద్‌ మాట్లాడుతూ అఫ్గానిస్థాన్‌లో ఐసిస్‌ ఉనికే నామమాత్రంగా ఉందని వెల్లడించారు. అయితే వాస్తవాలు మాత్రం మరోరకంగా ఉన్నాయి. కేవలం నెలన్నర వ్యవధిలో ఐసిస్‌ దాడుల్లో మరణించిన వారి సంఖ్య 200 దాటేసింది.

నిద్రలేపి తన్నించుకొన్నట్లు..

అమెరికా సంకీర్ణ సేనలు అఫ్గానిస్థాన్‌లో ఉన్న సమయంలో తాలిబన్లతో పాటు ఐసిస్‌ ఉగ్రవాదులను అదుపులోకి తీసుకొని జైళ్లలో వేశాయి. కానీ, తాలిబన్లు దేశాన్ని ఆక్రమించడం మొదలు పెట్టాక తొలుత జైళ్లను బద్దలు కొట్టారు. ఇలా చేస్తే జైళ్లలోని తాలిబన్లు కూడా అందుబాటులోకి వస్తారన్నది వారి వ్యూహం. కానీ, ఇక్కడ ఒక విషయం మర్చిపోయారు. కేవలం కాబుల్‌లోని పుల్‌-ఇ-చర్కీ జైలును బద్దలు కొట్టిన సమయంలో ఐసిస్‌ మాజీ చీఫ్‌ జియా ఉల్‌ హక్‌ అకా అబూ ఉమర్‌ ఖోరాసాని మాత్రం హత్య చేశారు. కానీ, జైళ్లలో ఉన్న చాలా మంది ఐసిస్‌ ఉగ్రవాదులు బయటపడ్డారు. కాబుల్‌ ఎయిర్‌ పోర్టుపై దాడి చేసిన అబ్దుల్‌ రహ్మాన్‌ ఇలా బయటకు వచ్చినవాడే. ఇతన్ని భారత్‌కు చెందిన ‘రా’ ఏజన్సీ  2017లో పట్టుకొని అఫ్గానిస్థాన్‌లోని సీఐఏకు అప్పజెప్పింది. సీఐఏ బగ్రామ్‌ ఎయిర్‌ బేస్‌లో ఉన్న అత్యంత కట్టుదిట్టమైన  జైలులో నాలుగేళ్ల నుంచి ఉంచింది. ఆగస్టు 15న తాలిబన్లు ఆక్రమించిన తర్వాత చాలా మంది ఉగ్రవాదుల్లానే రహ్మాన్‌ కూడా బయటపడ్డాడు. ఆ తర్వాత కాబుల్‌ ఎయిర్‌పోర్టుపై ఆత్మాహుతి దాడి చేసి 200 మందికి పైగా ప్రాణాలు తీశాడు. మృతుల్లో డజన్ల కొద్దీ తాలిబన్లు ఉన్నారు.

తాలిబన్లు వాడిన మాగ్నెటిక్‌ బాంబులే..!

గత కొన్నేళ్లుగా తాలిబన్లు మాగ్నెటిక్‌ బాంబులను విరివిగా వాడేవారు. వీరు పేలుడు పదార్థాలకు అయస్కాంతాలు అమర్చి అఫ్గాన్‌ అధికారులు, నాయకుల కార్ల కింద పెట్టేవారు. కాబుల్‌ వంటి పట్టణాల్లో దాడులకు ఇలాంటి వ్యూహాలను అమలు చేసేవారు. ఇవి ఎంత ప్రమాదకరమైనవో తాలిబన్లకు తెలిసినంత మరెవరికీ తెలియదు.

కాబుల్‌లో వీటితో భారీ రక్తపాతం..

ఈ మాగ్నెట్‌ బాంబులను గత రెండేళ్లుగా తాలిబన్లు అత్యధికంగా వాడుతూ వచ్చారు. శాంతి చర్చలు జరుగుతున్న సమయంలో చేసిన దాడుల్లో వీటినే అత్యధికంగా వినియోగించారు. నిత్యం ఈ బాంబులు అమర్చిన కార్లు ఎక్కడో ఒకచోట పేలుతుండేవి. దీంతో కాబుల్‌ వాసులు వణికిపోయారు. ఈ బాంబులను మెకానిక్‌ షేడ్లలో కూడా తయారు చేయవచ్చు. వీటికి 25 డాలర్లకు మించి ఖర్చుకాదు. చిన్న డబ్బాలో పేలుడు పదార్థాలను అమర్చి దానిని సెల్‌ఫోన్‌తో అనుసంధానిస్తారు. దీనికి ఒక అయస్కాంతం అమరుస్తారు. దీనిని ప్రత్యర్థి వాహనం కింద ఇంధన ట్యాంక్‌ సమీపంలో పెట్టి.. బాంబుకు అమర్చిన మొబైల్‌ నంబర్‌కు ఫోన్‌ చేస్తారు. దీంతో భారీ పేలుడు సంభవిస్తుంది. అఫ్గాన్‌ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేందుకు 2020, 2021ల్లో డజన్ల కొద్దీ పేలుళ్లకు పాల్పడ్డారు.

రిపేర్లకు వచ్చిన కార్లలో కూడా పేలుడు పదర్థాలు..

కాబుల్‌లోని షా షహీద్‌ ప్రాంతంలో ఆటోమొబైల్‌ షాపులు ఉన్నాయి. వీటిల్లో అబ్దుల్‌సమీ అనే వ్యక్తికి దుకాణం ఉంది. ఇక్కడకు రిపేర్లకు వచ్చిన కార్లలో వీరు మాగ్నెట్‌ బాంబులను పెట్టి పంపించేవారు. సమీ అరెస్టయ్యే వరకు ఈ విషయం బయటపడలేదు. తాలిబన్లు నయానో భయానో వీరిని లొంగదీసుకొని ఈ పనులు చేయించారు. సాధారణంగా ఆ తర్వాత నాటి ఆఫ్గాన్‌ పోలీసులు ఈ ప్రాంతాన్ని జల్లెడపట్టారు.

కశ్మీర్‌లో వాడేందుకు పాక్‌ పన్నాగం..

భారత్‌లో 2012లో ఒక ఇరాన్‌ ఉగ్రవాది ఇజ్రాయెల్‌ దౌత్య సిబ్బంది భార్యపై దాడికి తొలిసారి ఈ మాగ్నెట్‌ బాంబ్‌ను వాడాడు. కశ్మీర్‌లో కూడా తాలిబన్‌ స్టైల్‌లో ఈ బాంబులను వాడాలని పాక్‌ పన్నాగం పన్నింది.  ఈ ఏడాది సాంబ సెక్టార్‌లో భద్రతా దళాలు ఈ మాగ్నెట్‌ బాంబులను స్వాధీనం చేసుకొన్నాయి. వీటిని పాక్‌ ఐఎస్‌ఐ సంస్థ ఉగ్రవాదులకు సరఫరా చేస్తోంది. తాజాగా కశ్మీర్‌లోని పూంచ్‌ జిల్లాలో బుధవారం నాలుగు మాగ్నెట్‌ బాంబులను భద్రతా దళాలు నిర్వీర్యం చేశాయి. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని