మోదీజీ.. మేం చెప్పేది కూడా వింటే బాగుంటుంది!

తాజా వార్తలు

Updated : 07/05/2021 15:19 IST

మోదీజీ.. మేం చెప్పేది కూడా వింటే బాగుంటుంది!

ప్రధాని ఫోన్‌ సంభాషణపై ఝార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌

దిల్లీ: దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో నెలకొన్న కరోనా పరిస్థితులపై ప్రధాని మోదీ గురువారం ఆరా తీశారు. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడి మార్గనిర్దేశం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, ఝార్ఖండ్‌ సీఎంలతో మోదీ మాట్లాడారు. అయితే, ఝార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌ ప్రధాని మాట్లాడిన తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మోదీ కేవలం ఆయన మనసులో ఉన్న మాటల్ని మాత్రమే బయటపెట్టారని.. తాము చెప్పే అంశాలను కూడా విని ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు.

‘‘ఈరోజు ప్రధాని మోదీ ఫోన్‌ చేసి మాట్లాడారు. ఆయన కేవలం తన మనసులోని మాటను బయటపెట్టారు. చేయాల్సిన పనులతో పాటు మేం చెప్పే అంశాలు కూడా విని ఉంటే బాగుండేది’’ అని సోరెన్‌ ట్విటర్‌లో రాసుకొచ్చారు. దేశవ్యాప్తంగా అత్యధిక కరోనా మరణాలు సంభవిస్తున్న రాష్ట్రాల్లో ఝార్ఖండ్‌ ఒకటి. గురువారం రాష్ట్రంలో 133 మంది మృత్యువాతపడ్డారు. దీంతో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 3,479కి పెరిగింది.

సోరెన్‌ వ్యాఖ్యలపై భాజపా వర్గాలు తీవ్ర స్థాయిలో మండిపడ్డాయి. ‘‘హేమంత్‌ సోరెన్‌ ఓ విఫల ముఖ్యమంత్రి. పాలనలో వైఫల్యం చెందారు. ప్రజలకు సాయం చేయడంలోనూ విఫలమయ్యారు. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు తన కార్యాలయానికి ఉన్న హుందాతనాన్ని తగ్గిస్తున్నారు. సమయం గడిచిపోతోంది. సోరెన్‌ ఇప్పటికైనా మేల్కొని పనికి ఉపక్రమించాలి’’ అని భాజపా రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బాబూలాల్‌ మరాండీ ట్విటర్‌ వేదికగా విమర్శించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని