Jal Jeevan Mission: నీటి కష్టాలు తప్పిస్తున్నాం.. మహిళల సాధికారతకు బాటలు వేస్తున్నాం

తాజా వార్తలు

Updated : 02/10/2021 17:42 IST

Jal Jeevan Mission: నీటి కష్టాలు తప్పిస్తున్నాం.. మహిళల సాధికారతకు బాటలు వేస్తున్నాం

‘జల్‌ జీవన్‌ మిషన్‌’ యాప్‌ ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రధాని మోదీ

దిల్లీ: ‘జల్‌ జీవన్‌ మిషన్‌’తో మహిళలు దూరప్రాంతాలకు వెళ్లి నీళ్లను తెచ్చుకునే కష్టాలు తప్పుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇంటింటికీ నల్లా కనెక్షన్లు ఇస్తుండటంతో వారి సమయం ఆదా అవుతోందని, తద్వారా వారు సాధికారత వైపు అడుగులు వేసే అవకాశం లభిస్తోందని పేర్కొన్నారు. ఈ మిషన్‌పై అవగాహన కల్పించడంతో పాటు అమలు విషయంలో పారదర్శకత, జవాబుదారీతనం కోసం రూపొందించిన ‘జల్‌ జీవన్‌ మిషన్‌ యాప్‌’ను ప్రధాని శనివారం ప్రారంభించారు. దీంతోపాటు ‘రాష్ట్రీయ జల్‌ జీవన్‌ కోశ్‌’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఎవరైనా, ఏ సంస్థయినా.. గ్రామీణ ఇళ్లలో, బడుల్లో ఇతరత్రా చోట్ల నీటి కనెక్షన్లు అందించేందుకు సాయం అందించొచ్చు. ఈ సందర్భంగా ప్రధాని.. ఆయా గ్రామ పంచాయతీల పెద్దలు, నీటి సమితుల ప్రతినిధులతోనూ మాట్లాడారు. తమ ఇళ్లకు నీళ్లు అందుతున్నాయని, మహిళలు తమ ఖాళీ సమయాన్ని పిల్లల చదువులకు, ఉపాధి పనులకు కేటాయిస్తున్నారని వారు ప్రధానికి వివరించారు.

8.26 కోట్ల గ్రామీణ ఇళ్లకు నీళ్లు..

2019 ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ‘జల్‌ జీవన్‌ మిషన్‌’ కార్యక్రమాన్ని ప్రకటించారు. ఇందులో భాగంగా రాష్ట్రాల భాగస్వామ్యంతో ప్రతి ఇంటికీ నల్లా నీటి సదుపాయం కల్పిస్తామని ప్రధాని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో మిషన్‌ అమలుకు కేంద్రం రూ.3.60 లక్షల కోట్లు కేటాయించింది. దీంతోపాటు 15వ ఆర్థిక సంఘం కింద మరో రూ.1.42 లక్షల కోట్లు సమకూర్చుతోంది. మరోవైపు దేశవ్యాప్తంగా దాదాపు 3.5 లక్షల గ్రామాల్లో నీటి సమితులు, గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్య కమిటీ(వీడబ్ల్యూఎస్‌సీ)లు ఏర్పాటు చేసింది. గ్రామీణ నీటి సరఫరా వ్యవస్థ నిర్వహణలో ఇవి కీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్రతి ఇంటికి కుళాయి సౌకర్యం అందేలా కృషి చేయడం వీటి బాధ్యత. ఈ మిషన్‌ ప్రారంభం నాటికి దేశంలో 3.23 కోట్ల(17 శాతం) గ్రామీణ ఇళ్లకు నల్లా కనెక్షన్లు ఉండగా.. ప్రస్తుతం ఇది 8.26 కోట్ల(43 శాతం)కు చేరడం విశేషం.

ఈ సందర్భంగా గత ప్రభుత్వాలపై మోదీ విమర్శలు గుప్పించారు. 3 కోట్ల నల్లా కనెక్షన్లు ఇచ్చేందుకు 70ఏళ్లు పడితే.. తమ ప్రభుత్వ హయాంలో కేవలం గత రెండేళ్లలోనే 5కోట్లకు పైగా నల్లా కనెక్షన్లు ఇచ్చామని మోదీ చెప్పుకొచ్చారు. 



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని