లాలూ ప్రసాద్‌కు మళ్లీ నిరాశ 

తాజా వార్తలు

Published : 19/02/2021 18:57 IST

లాలూ ప్రసాద్‌కు మళ్లీ నిరాశ 

రాంచీ: ఆర్జేడీ అధినేత, బిహార్‌ మాజీ సీఎం లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు ఝార్ఖండ్‌ హైకోర్టులో మళ్లీ నిరాశే ఎదురైంది. దాణా కుంభకోణం కేసులో అరెస్టై ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న ఆయన బెయిల్‌ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. మరో రెండు నెలల తర్వాత మళ్లీ కొత్తగా బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేయాలని సూచించింది. లాలూ బిహార్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో డుమ్కా ఖజానా నుంచి రూ. 3.13 కోట్లు అక్రమ ఉపసంహరణకు సంబంధించి గత కొన్నేళ్లుగా ఆయనపై కేసు కొనసాగుతోంది. ఈ కేసుకు సంబంధించి జాయింట్‌ అఫిడవిట్‌, లాలూ జ్యుడీషియల్‌ కస్టడీ పత్రాలను సీబీఐ గతేడాది డిసెంబర్‌లో కోర్టుకు అందించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దాఖలైన బెయిల్‌ పిటిషన్‌పై ఈ నెల 12న విచారించిన న్యాయస్థానం.. శుక్రవారానికి వాయిదా వేసింది. దాణా కుంభకోణం కేసులో అరెస్టైన లాలూ 2017 డిసెంబర్‌ నుంచి జైలు శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే.

ఇటీవల లాలూ ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోవడంతో ఆయన్ను రాంచీలోని రిమ్స్‌ నుంచి దిల్లీ ఎయిమ్స్‌కు తరలించిన విషయం తెలిసిందే. లాలూ కిడ్నీ 25శాతం మాత్రమే పనిచేస్తున్నట్టు ఆయన వ్యక్తిగత వైద్యుడు తెలిపారు. ఈ నేపథ్యంలో లాలూ పెద్ద కుమారుడు తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు 50వేల పోస్టు కార్డులను పంపారు. మానవతా దృక్పథంతో వ్యవహరించి తన తండ్రిని విడుదల చేయాలని కోరారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని