
తాజా వార్తలు
ట్రంప్‌తో సంభాషణా? ఇప్పట్లో లేదు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసం వైట్‌హౌజ్‌ను వీడుతూ నూతన అధ్యక్షుడు జో బైడెన్‌కు ఓ లేఖను విడిచి వెళ్లారు. దీనిపై స్పందించిన బైడెన్.. ఆ లేఖ చాలా హుందాగా ఉందని, త్వరలోనే ట్రంప్‌తో మాట్లాడతానని ప్రకటించారు. ఈ నేపథ్యంలో వారిరువురి మధ్య సమావేశం ఎప్పుడు జరుగుతుందోనన్న ఆసక్తి నెలకొంది. అయితే, డొనాల్డ్ ట్రంప్‌తో.. అధ్యక్షుడు బైడెన్ సమావేశమయ్యే అవకాశమేదీ ఇప్పట్లో లేదని శ్వేతసౌధం వెల్లడించింది. ఈ మేరకు వైట్ హౌస్ సెక్రటరీ జెన్ సాకీ స్పష్టత ఇచ్చారు. ప్రస్తుతానికి వీరిరువురి మధ్య సమావేశం ఏదీ ప్రణాళికలో లేదని ఆమె మీడియా సమావేశంలో పేర్కొన్నారు.
పదవీ విరమణ చేసిన అధ్యక్షుడు.. ఓవల్ ఆఫీస్‌లో ఉండే రిసోల్యూట్ డెస్క్ ద్వారా కొత్త అధ్యక్షుడికి ఓ లేఖను అందచేయడం సంప్రదాయంగా వస్తోంది. బైడెన్ ప్రమాణ స్వీకారానికి హాజరు కాకపోవటం, ఎన్నికల విజయంపై లాంఛనంగా ఒక్కసారి కూడా ఆయనను అభినందించకపోవటం వంటి పలు సంప్రదాయాలను పాటించకుండానే ట్రంప్ శ్వేతసౌధాన్ని వీడారు. దీంతో ఈ లేఖ సంప్రదాయాన్నైనా ట్రంప్ పాటిస్తారా అనే అంశం చివరి వరకూ రహస్యంగానే ఉంది. ఈ క్రమంలో ట్రంప్ తనకు ఓ అతి చక్కటి లేఖను అందజేశారని, తాను ఆయనతో త్వరలోనే మాట్లాడతానని బైడెన్ ప్రకటించటంతో సస్పెన్స్‌కు తెరపడింది. ‘‘అధ్యక్ష హోదాలో ట్రంప్ నాకు రాసిన లేఖ వ్యక్తిగతమైనది. అందువల్ల ఆయనతో సంప్రదించే వరకు దానిని గురించిన వివరాలను వెల్లడించడం సరికాదు. అయితే, ఆ లేఖ హుందాగా సాగింది’’ అని బైడెన్ పేర్కొన్నారు.
ఇవీ చదవండి..
భారత్‌కు ముందు ముందు మరిన్ని సవాళ్లు