కర్ణాటకకు కొత్త సీఎం రాబోతున్నారా?

తాజా వార్తలు

Updated : 27/05/2021 21:49 IST

కర్ణాటకకు కొత్త సీఎం రాబోతున్నారా?

బెంగళూరు: ప్రస్తుత పరిణామాలు చూస్తే కాదని చెప్పలేం. నాయకత్వ మార్పు ఉండబోదని భాజపా అధిష్ఠానం స్పష్టం చేస్తున్నా.. సీఎం యడియూరప్పను తొలగిస్తారన్న వదంతులు కర్ణాటకలో వ్యాపిస్తున్నాయి. ఇందులో నిజమెంత? కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్పను పదవి నుంచి తొలగిస్తున్నారనే వార్తలు ఈ మధ్య ఆ రాష్ర్టంలో విస్తృతంగా ప్రచారమవుతున్నాయి. యడ్డీ స్థానంలో మరొకరిని నియమిస్తారనే ఊహాగానాలు పార్టీలోనూ అంతర్గతంగా చక్కర్లు కొడుతున్నాయి. నాయకత్వ మార్పు ఉండదని పార్టీ అధిష్ఠానం చెబుతున్నా.. ఈ వదంతులకు అడ్డుకట్టపడటం లేదు. సీఎం సన్నిహితులు ఈ వార్తను ఖండిస్తున్నారంటే.. పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. నిజానికి యడ్డీ పదవి చేపట్టినప్పటి నుంచి ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ అమిత్‌ షా, రాష్ర్ట ఛైర్‌పర్సన్‌ అరుణ్‌సింగ్‌ వీటిని ఖండించారు. పదవీ కాలం ముగిసే వరకూ యడ్డీయే సీఎంగా ఉంటారని స్పష్టం చేశారు. అయినప్పటికీ ఈ పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయి. నేతల దిల్లీ పర్యటన, తాజాగా జరిగిన పరిణామాలు ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తున్నాయి.

ఇటీవల కర్ణాటక మంత్రి సీపీ యోగేశ్వర్‌ దిల్లీకి పయనం కావడం రాష్ర్ట రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఆయనతో పాటు ఎమ్మెల్యేలు అరవింద్‌ మిల్లార్‌, బసన గౌడ నాయకత్వ మార్పుకు పట్టుబడుతున్నారని తెలుస్తోంది. యోగేశ్వర్‌ దిల్లీ పర్యటన ఇందుకు బలం చేకూర్చుతోంది. అయితే అరవింద్‌ దిల్లీకి వెళ్లినప్పుడు మాత్రం హై కమాండ్‌ వారిని తిప్పిపంపింది. పార్టీ పెద్దలతో కలిసేందుకు అరవింద్‌కు అనుమతి లభించలేదని భాజపా వర్గాలు చెబుతున్నాయి. రాజీనామా ద్వారా గౌరవంగా పదవి నుంచి వైదొలగాలని యడియూరప్పకు కొందరు నేతలు సూచిస్తున్నట్లు సమాచారం. అనంతరం ఏదైనా రాష్ర్ట గవర్నర్‌ పదవి కానీ, పార్టీలో కోరుకున్న హోదాని కానీ కట్టబెట్టాలని కోరుకుంటున్నారు. యడ్డీ కుమారుడికి క్యాబినెట్‌లో స్థానం ఇవ్వాలని ప్రతిపాదిస్తున్నారు. కొత్త సీఎం అభ్యర్థిగా కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి, డిప్యూటీ సీఎం అశ్వథ్ నారాయణ్‌, ఓ లింగాయత నేత పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వదంతులన్నింటిని సీఎం యడ్డీ అనుచరులు కొట్టిపారేస్తున్నారు. విపక్షాలే ఇలా దుష్ప్రచారాలు చేస్తున్నాయని అంటున్నారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని