Twitter Vs UP police: ట్విటర్‌ ఎండీకి ఊరట
close

తాజా వార్తలు

Published : 24/06/2021 23:34 IST

Twitter Vs UP police: ట్విటర్‌ ఎండీకి ఊరట

బెంగళూరు: యూపీలో దాడి ఘటనకు సంబంధించిన వీడియో కేసులో ట్విటర్‌ ఇండియా ఎండీ మనీశ్‌ మహేశ్వరికి కర్ణాటక హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై ఎలాంటి చర్యలూ తీసుకోవద్దని యూపీలోని ఘజియాబాద్‌ పోలీసులను ఆదేశించింది. ఘజియాబాద్‌ పోలీసులు ఇచ్చిన నోటీసులపై మనీశ్‌ మహేశ్వరి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు.. ఈ మేరకు గురువారం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. తదుపరి విచారణను జూన్‌ 29కి వాయిదా వేసింది. అప్పటి వరకు మనీశ్‌ను అరెస్ట్‌ చేయకూడదని ఘజియాబాద్‌ పోలీసులను ఆదేశించింది. ఒకవేళ మనీశ్‌ను విచారించాలనుకుంటే వర్చువల్‌గా ప్రశ్నించాలని సూచించింది. 

ఉత్తరప్రదేశ్‌లోని ఘాజియాబాద్‌లో ఇటీవల ఓ ముస్లిం వృద్ధుడిపై దాడి ఘటనకు సంబంధించిన కొన్ని వీడియోలు ట్విటర్‌లో వైరల్‌ అయ్యాయి. అయితే, వాస్తవాలను కప్పిపుచ్చి ఆ వీడియోల్లో తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసినట్లు అక్కడి పోలీసులు గుర్తించారు. దీంతో ఆ పోస్టులపై ట్విటర్‌, ట్విటర్‌ కమ్యూనికేషన్‌ ఇండియాపై కేసు నమోదు చేశారు. విచారణకు హాజరుకావాలని నోటీసులు పంపారు. 

ఘజియాబాద్‌ పోలీసుల నోటీసులపై బెంగళూరు వాసి అయిన మహేశ్వరి గురువారం కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. వీడియోకు సంబంధించిన కేసులో తనను తొలుత సాక్షిగా పేర్కొంటూ నోటీసులు ఇచ్చారని, రెండురోజుల తర్వాత నిందితుడిగా మార్చారని పేర్కొన్నారు. ఎవరో వీడియో అప్‌లోడ్‌ చేస్తే తనను నిందితుడిగా పేర్కొన్నారని తెలిపారు. ఈ మెయిల్‌ ద్వారా సమన్లు పంపించి.. వారంలోగా ఘజియాబాద్‌కు రావాలని సూచించారని పేర్కొన్నారు. తాను ఆన్‌లైన్‌లో విచారణకు హాజరవుతానని చెప్పినా నేరుగా రావాలని పోలీసులు సూచించినట్లు మనీశ్‌ కోర్టు దృష్టికి తెచ్చారు. ఆయన పిటిషన్‌ను విచారించిన ఏకసభ్య ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని