‘రాసలీలల సీడీ’ కేసులో మరో ట్విస్ట్‌
close

తాజా వార్తలు

Published : 17/03/2021 13:32 IST

‘రాసలీలల సీడీ’ కేసులో మరో ట్విస్ట్‌

కుమార్తె కిడ్నాప్‌ అయిందంటూ యువతి తండ్రి ఫిర్యాదు

బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి పేరుతో దుమారం రేపిన రాసలీలల సీడీ వ్యవహారం మరో మలుపు తిరిగింది. తమ కుమార్తెను కిడ్నాప్‌ చేశారంటూ ఆ సీడీలో కన్పించిన యువతి తండ్రి నిన్న బెళగావి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పాటు తమ కుమార్తె ప్రమాదంలో ఉందంటూ ఓ వీడియో కూడా విడుదల చేశారు.

‘‘ఆ వీడియో టీవీలో కన్పించగానే నేను మా కుమార్తెకు ఫోన్‌ చేశాను. అయితే అందులో ఉన్నది తాను కాదని, అది నకిలీ వీడియో అని ఆమె నాకు చెప్పింది. తాను ఏ తప్పూ చేయలేదని తెలిపింది. నీ తప్పు లేనప్పుడు నువ్వు ఇంటికి వచ్చేయ్‌ అని నేను అన్నాను. కానీ ఆమె అందుకు ఒప్పుకోలేదు. తన జీవితం ప్రమాదంలో ఉందని, ఇప్పుడు రాలేనని మా అమ్మాయి చెప్పింది. తనను కాంటాక్ట్‌ చేయొద్దని కూడా కోరింది. ఆ తర్వాత నుంచి ఆమె ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ అయ్యింది. ఇప్పుడు ఆమె ఎక్కడ ఉందో తెలియట్లేదు’’ అని యువతి తల్లి వీడియోలో పేర్కొన్నారు. తమ కుమార్తె ఎక్కడ ఉందో చెప్పాలని ప్రభుత్వాన్ని, పోలీసులను కోరారు. మార్చి 2 కంటే ముందే బెంగళూరులోని హాస్టల్‌ నుంచి తమ కుమార్తెను అపహరించుకెళ్లారని యువతి తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

సీడీ వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత గతవారం యువతి కూడా ఓ వీడియోను బయటకు విడుదల చేసిన విషయం తెలిసిందే. అందులో ‘నాకు, కుటుంబసభ్యులకు ప్రాణహాని ఉంది, మేం రెండుసార్లు బలవన్మరణానికి ప్రయత్నించాం. రక్షణ కల్పించాలి’ అని ఆమె పోలీసులను కోరింది. మరోవైపు సీడీ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్‌ బృందం.. యువతికి నోటీసులు జారీ చేసింది.

రాసలీలల సీడీ టీవీలో ప్రసారమైన తర్వాత సదరు యువతి గోవాకు వెళ్లిందని, అక్కడి నుంచి బెంగళూరుకు వచ్చి నగర శివారుల్లో తలదాచుకున్నట్లు అధికారులు గుర్తించారు. ఇదిలా ఉండగా.. సీడీ విడుదలకు ముందు రోజు ఆ యువతి, మరో ఐదుగురితో ఆర్‌.టి.నగరలో సమావేశమైనట్లు కాల్‌ డేటా ఆధారంగా గుర్తించారు. వీడియో విడుదలైన అనంతరం ఒక్కొక్కరు ఒక్కో వైపు వెళ్లినట్లు గమనించారు. యువతి మినహా మిగిలిన వారిని సిట్‌ అధికారులు అదుపులోకి తీసుకుని విచారణ చేసి విడిచి పెట్టారు. ఆ యువతి బాయ్‌ ఫ్రెండు, అతని స్నేహితుడ్ని సిట్‌ అధికారులు ఆదివారం అదుపులోకి తీసుకుని రహస్య ప్రదేశంలో విచారణ ప్రారంభించారు.

కర్ణాటక మాజీ మంత్రి రమేశ్‌ జర్కిహోలీ ఓ మహిళతో సన్నిహితంగా మెలిగిన దృశ్యాలు ఇటీవల వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఉద్యోగం ఇప్పిస్తానంటూ ఆ మంత్రి తనను లైంగిక అవసరాలకు వాడుకున్నారని సదరు యువతి ఆరోపించింది. ఇది కాస్తా వివాదాస్పదం కావడంతో రమేశ్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని