Coronavaccine: కేంద్రానికి కేజ్రీవాల్‌ 4 సూచనలు!

తాజా వార్తలు

Published : 22/05/2021 16:16 IST

Coronavaccine: కేంద్రానికి కేజ్రీవాల్‌ 4 సూచనలు!

దిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య గతంతో పోలిస్తే తగ్గుముఖం పట్టినప్పటికీ.. ఇంకా ఆందోళనకర స్థాయిలోనే కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు టీకాల కొరత వేధిస్తోంది. 18 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు కేంద్రం అనుమతించింది. కానీ అనేక రాష్ట్రాల్లో ఇది పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు. ఇంకా 45 ఏళ్లు పైబడినవారికే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో టీకాల కొరతను అధిగమించేందుకు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ కేంద్రానికి పలు కీలక సూచనలు చేశారు. అవేంటో ఆయన మాటల్లోనే..

* దేశీయంగా భారత్‌ బయోటెక్ అభివృద్ధి చేసిన ‘కొవాగ్జిన్‌’ టీకా ఉత్పత్తిని తప్పనిసరి చేస్తూ దేశంలో ఉన్న వ్యాక్సిన్‌ తయారీ సంస్థలన్నింటికీ ఆదేశాలు జారీ చేయాలి. 24 గంటల్లో వారితో సమావేశం ఏర్పాటు చేసి పరిస్థితిని వివరించి టీకాల సంఖ్యను గణనీయంగా పెంచేందుకు కృషి చేయాలి. 

* విదేశీ టీకా తయారీ సంస్థల నుంచి కేంద్రమే టీకాలు కొనుగోలు చేసి రాష్ట్రాలకు పంపిణీ చేయాలి. నేరుగా తయారీ సంస్థల నుంచి కొనుగోలు చేసేందుకు రాష్ట్రాలకు అనుమతులు ఇవ్వడం వల్ల, కొన్ని రాష్ట్రాల మధ్య విభేదాలు తలెత్తుతున్నాయి. దీనివల్ల విదేశీ సంస్థల ముందు దేశ ప్రతిష్ఠ మసకబారే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వమే టీకాల్ని కొనుగోలు చేసి రాష్ట్రాలకు పంపిణీ చేయాలి. 

* కొన్ని దేశాలు వారి జనాభాకు సరిపడే కంటే ఎక్కువ వ్యాక్సిన్లు కొనుగోలు చేసి నిల్వ చేసుకున్నాయి. వాటిని వెంటనే భారత్‌కు అందజేయాలని విజ్ఞప్తి చేయాలి. ఎలాగైనా అవి భారత్‌కు చేరేలా కావాల్సిన చర్యలు తీసుకోవాలి. 

* విదేశీ టీకా తయారీ సంస్థలకు భారత్‌లో టీకాలు ఉత్పత్తి చేసేందుకు అనుమతి ఇవ్వాలి.

దేశ రాజధానిలో వయోజనులకు టీకా ఇచ్చే కార్యక్రమాన్ని నేటి నుంచి నిలిపివేసినట్లు కేజ్రీవాల్‌ ప్రకటించారు. వీరి కోసం కేంద్ర ప్రభుత్వం పంపిన టీకాలు పూర్తయ్యాయని తెలిపారు. మరిన్ని టీకా డోసులు పంపాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరామన్నారు. అవి అందగానే తిరిగి వ్యాక్సినేషన్‌ ప్రారంభిస్తామన్నారు. ప్రతినెలా దిల్లీకి 80 లక్షల డోసులు అవసరం ఉంటుందని తెలిపారు. కానీ, మే నెలలో కేంద్రం 16 లక్షల డోసులు మాత్రమే కేటాయించిందని వెల్లడించారు. ఇక జూన్ నెలకు ఆ కోటాను కేవలం 8 లక్షలకు మాత్రమే పరిమితం చేయనున్నామని తెలియజేశారన్నారు.

ఇప్పటి వరకు దిల్లీలో 50 లక్ష డోసులు ప్రజలకు అందజేశామని కేజ్రీవాల్‌ తెలిపారు. దిల్లీ మొత్తానికి టీకా అందించేందుకు మరో 2.5 కోట్ల టీకా డోసులు అవసరమన్నారు. ఇలా నెలకు 8 లక్షల డోసులు మాత్రమే పంపితే అందరికీ వ్యాక్సిన్‌ అందించేందుకు 30 నెలలు పడుతుందని తెలిపారు. ఇంత జాప్యం జరిగితే మరిన్ని కరోనా వేవ్‌లు విరుచుకుపడే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని