Keralaను చూసి నేర్చుకోవాలి
close

తాజా వార్తలు

Published : 15/05/2021 08:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Keralaను చూసి నేర్చుకోవాలి

వ్యాక్సిన్‌ వృథాలో సున్నా 
 కేంద్రమిచ్చిన డోసులు కంటే ఎక్కువ వినియోగం 

తిరువనంతపురం: వ్యాక్సిన్‌ కొరతతో దేశమంతా అల్లాడుతోంది. ఈ సమయంలో ఒక మిల్లీ లీటర్‌ వ్యాక్సిన్‌ వృథా అయినా.. కరోనాపై పోరులో అది ప్రతిరోధకమే అవుతుంది. చాలా రాష్ట్రాలు 5 నుంచి 12 శాతం వరకు వృథా చేస్తున్నాయి. కేరళ రాష్ట్రం మాత్రం అందుకు భిన్నమైన బాటలో నడుస్తోంది. ఒక్క చుక్క వ్యాక్సిన్‌ కూడా చేజారనీయడం లేదు. మే ఒకటో తేదీ వరకు డేటా ప్రకారం ఆ రాష్ట్రానికి కేంద్రం నుంచి 73,38,806 డోసులు అందాయి. అయితే 74,26,164 డోసులు ప్రజలకు వేసింది. అంటే తనకిచ్చిన కోటా కంటే అధికంగా 87,358 డోసులు ప్రజలకు వేసింది. ఇదెలా సాధ్యమా అని ఆశ్చర్యపోతున్నారా...? ఈ గొప్పతనమంతా కేరళ ఆరోగ్య సిబ్బందిదే. 

ఆ నర్సుల గొప్పతనమే..

కేరళలో టీకా కార్యక్రమం మిగతా రాష్ట్రాల కంటే మెరుగ్గా సాగుతుంటే ఆ  రాష్ట్ర ఆరోగ్య సిబ్బంది ఘనతే. ముఖ్యంగా అనుభవజ్ఞులైన నర్సులు, సిబ్బంది ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. 5 మిల్లీ లీటర్ల వ్యాక్సిన్‌ వయల్‌లో వృథాను పరిగణనలోకి తీసుకుంటే పది డోసులు ఉంటాయి. కేంద్రం లెక్క ప్రకారం 1.1 శాతం వృథా ఇందులో కలిపి ఉంటుంది. సాధారణ ఆరోగ్య సిబ్బంది ఒక వయల్‌ నుంచి 8 నుంచి 9 డోసులు ఇవ్వగలరు. కేరళ నర్సులు మాత్రం ఓ వయల్‌ నుంచి 11 నుంచి 13 డోసులు వరకూ ఇస్తున్నారు. అంటే కేంద్రం పరిగణనలోకి    తీసుకున్న ఆ 1.1 శాతాన్ని వృథాను కూడా వారు వినియోగించుకుంటున్నారు.

పక్కా ప్రణాళిక ప్రకారం..

చాలా రాష్ట్రాల్లో నలుగురైదుగురు వచ్చినా వ్యాక్సిన్‌ వేస్తున్నారు. కేరళలో అలా కాదు. పది మంది వస్తేనే ..వయల్‌ తెరుస్తున్నారు. సాధారణంగా వయల్‌ తెరిచిన తర్వాత నాలుగు గంటలలోపు వినియోగించాలి. లేకపోతే ఆ డోసులతో ఉపయోగం ఉండదు. అందుకే కేరళలో పక్కాగా టీకా కేంద్రం దగ్గరకు పది మంది వచ్చేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. స్పాట్‌ రిజిస్ట్రేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. దీంతో ఎక్కడా వ్యాక్సిన్‌ వృథా కావడం లేదు. అందుకే కేరళ నర్సుల గొప్పతనాన్ని ఇటీవల ప్రధాని మోదీ కూడా మెచ్చుకున్నారు. కొవిడ్‌పై పోరులో వ్యాక్సిన్‌ వృథా అరికట్టడం  కీలకమని..అందుకోసం కేరళ    ఆరోగ్య సిబ్బంది చేస్తున్న కృషి      అమోఘమన్నారు.  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని