కేరళలోని 4 జిల్లాల్లో Triple Lockdown
close

తాజా వార్తలు

Published : 14/05/2021 19:34 IST

కేరళలోని 4 జిల్లాల్లో Triple Lockdown

రాష్ట్రంలో పూర్తి లాక్‌డౌన్‌ పొడిగింపు

తిరువనంతపురం: కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌  కేరళను కుదిపేస్తోంది. రోజురోజుకీ రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. లాక్‌డౌన్‌ కఠినంగా అమలు జరుగుతున్నా వైరస్‌ వ్యాప్తి మాత్రం ఆగడం లేదు. గడిచిన 24గంటల వ్యవధిలో 1,31,375 శాంపిల్స్‌ పరీక్షించగా.. 34,694 కొత్త కేసులు, 93 మరణాలు వెలుగుచూశాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటికే కొనసాగుతున్న పూర్తి లాక్‌డౌన్‌ను ఈ నెల 23వరకు పొడిగిస్తున్నట్టు సీఎం పినరయి విజయన్‌ ప్రకటించారు. అలాగే, పాజిటివిటీ రేటు అధికంగా ఉన్న తిరువనంతపురం, ఎర్నాకుళం, త్రిస్సూర్‌, మలప్పురం జిల్లాల్లో ట్రిపుల్‌ లాక్‌డౌన్‌ విధిస్తున్నట్టు వెల్లడించారు.  కేరళలో ప్రస్తుతం కొనసాగుతున్న వారం రోజుల లాక్‌డౌన్‌ మే 16నాటికి పూర్తి కానుంది. లాక్‌డౌన్‌ సమయంలో పేదలకు అందిస్తున్న ఉచిత ఆహారం కిట్‌లను మే, జూన్‌ మాసాల్లోనూ పంపిణీ చేస్తామని విజయన్‌ స్పష్టంచేశారు. రాష్ట్రంలో 18 నుంచి 45 ఏళ్ల లోపు వారికి మే 17 నుంచి టీకా పంపిణీ  ప్రారంభించనున్నట్టు సీఎం తెలిపారు. ఈ కేటగిరీకి చెందిన వారు శనివారం నుంచి రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చని సూచించారు. కంపెనీకి నేరుగా ఆర్డర్‌ చేయగా.. తొలి బ్యాచ్‌ కొవిషీల్డ్‌ టీకాలు సోమవారం కోచికి చేరాయని తెలిపారు.

ఏమిటీ ట్రిపుల్‌ లాక్‌డౌన్‌?

కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు మే 16 నుంచి రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో ట్రిపుల్‌ లాక్‌డౌన్‌ అమలు చేయనున్నట్టు సీఎం విజయన్‌ ప్రకటించారు. ట్రిపుల్‌ లాక్‌డౌన్‌ అనేది మూడు అంచెల కొవిడ్‌ 19 కట్టడి వ్యూహం. దీన్ని మూడు దశలుగా చేపడతారు. తొలి దశ కార్పొరేషన్‌ పరిధిలో కఠిన లాక్‌డౌన్‌ అమలు చేస్తారు. వాహనాలు, వ్యక్తులను కూడా బయటకు, లోపలికి అనుమతించరు.

రెండో దశలో కరోనా కేసులు నమోదయ్యే  క్లస్టర్‌ ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ అమలు చేస్తారు. ఈ ప్రాంతాల్లోనే ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులు ఉండటం వల్ల లాక్‌డౌన్‌ అమలుచేయడంతో ఈ వైరస్‌ ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా కట్టడి చేయవచ్చు. 

ఇకపోతే, మూడో దశలో కరోనాతో చికిత్సపొందుతున్న వ్యక్తుల ఇళ్లల్లో లాక్‌డౌన్‌ అమలు చేస్తారు. కమ్యూనిటీ వ్యాప్తిని నియంత్రించడంలో ఈ దశ ఎంతో కీలకంగా కానుంది. ట్రిపుల్‌ లాక్‌డౌన్‌ అమలులో ఉన్న సమయంలో ఆయా ప్రాంతాల్లో వాహనాలను సైతం అనుమతించరు. నిత్యావసరాలు కొనుక్కొనేందుకు/ ఏదైనా అత్యవసరమైతే తప్ప మిగిలిన సమయాల్లో బయటకు రాకుండా చర్యలు తీసుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో ఈ ట్రిపుల్‌ లాక్‌డౌన్‌సమయంలో స్థానిక పరిపాలనా యంత్రాంగమే కిరాణా/ ఇతర నిత్యావసర సరకులను ఇంటికి సరఫరా చేస్తుంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని