Kerala: అత్యధిక కేసులు నమోదవుతున్నా.. కొవిడ్‌ కట్టడిలో రోల్‌ మోడల్‌.. ఎలాగంటే?

తాజా వార్తలు

Published : 28/08/2021 02:12 IST

Kerala: అత్యధిక కేసులు నమోదవుతున్నా.. కొవిడ్‌ కట్టడిలో రోల్‌ మోడల్‌.. ఎలాగంటే?

దిల్లీ: కేరళ.. దేశంలోనే అత్యధిక కరోనా కేసులు నమోదైన రాష్ట్రాల్లో రెండోది. ఇప్పటికీ ఆ రాష్ట్రంలో రోజువారీ కేసులు అధికంగానే నమోదవుతున్నాయి. ఇదే అదనుగా.. విపక్ష భాజపా ప్రభుత్వం తమ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలను చూపి పినరయి సర్కారుపై విమర్శలు సంధిస్తోంది. కానీ, వాస్తవం మాత్రం వేరుగా ఉందంటున్నాయి పలు నివేదికలు. కొవిడ్ నియంత్రణలో మలయాళీలు భేష్ అని.. వారి విధానం దేశానికే ఆదర్శమని నిపుణులు పేర్కొంటున్నారు. రోజువారీ కేసులు ఈ స్థాయిలో నమోదవుతున్నా.. కొవిడ్ కట్టడి విషయంలో దేశానికి కేరళ ఎలా ఆదర్శంగా మారిందో ఓసారి చూద్దాం.

కేరళ జనాభా 3.58 కోట్లు. ఇప్పటివరకూ నమోదైన కరోనా కేసులు 38.8 లక్షలు. మహారాష్ట్ర తర్వాత దేశంలో అత్యధిక కొవిడ్‌ బాధితులు ఈ రాష్ట్రం నుంచే ఉన్నారు. అయితే 24 కోట్ల పైబడి జనాభా ఉన్న ఉత్తర్‌ప్రదేశ్‌లో ఇప్పటివరకు కరోనా బారిన పడినవారి సంఖ్య 17 లక్షలు. ఈ గణాంకాలు చూపి.. కరోనా నియంత్రణలో కేరళ సర్కారు  విఫలమైందంటూ భాజపా నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. దేశమంతా ఒకే విధానం అమలు చేస్తుంటే.. కేరళలోని పినరయి విజయన్‌ ప్రభుత్వం మాత్రం తన ఇష్టారీతిన వ్యవహరిస్తూ ప్రజల ప్రాణాలను కరోనా పడగ కిందకు నెడుతోందంటూ వారంరోజుల క్రితం భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా కూడా విరుచుకుపడ్డారు. కేంద్ర ప్రభుత్వం 70 శాతం ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు చేయమంటుంటే కేరళ మాత్రం 50 శాతం లోపే చేసిందని ఆరోపించారు. ఆయన ఆరోపణలకు బలం చేకూర్చేలా ఇప్పుడు కూడా కేరళలోనే అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. ఈరకంగా చూస్తే నడ్డాది కేవలం రాజకీయ విమర్శ మాత్రమే కాదని.. నిజమేనని అనిపిస్తోంది. కానీ వాస్తవం మాత్రం వేరు అంటున్నాయి నివేదికలు.

కరోనా నియంత్రణలో ముఖ్యమైనది పరీక్షలు, కాంటాక్ట్ ట్రేసింగ్‌, ఐసోలేషన్‌. కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ ఈ విషయమే చెబుతోంది. మొదటగా కొవిడ్‌ పరీక్షల విషయానికొస్తే దేశంలో ప్రతి 100 మందిలో దాదాపు 40 మందికి పరీక్షలు చేశారు. కేరళలో మాత్రం ప్రతి 100 మందిలో 86 మందికి కరోనా పరీక్షలు జరిగినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. నడ్డా చెబుతున్న ఉత్తర్‌ప్రదేశ్‌లో ఈ సంఖ్య 33గా ఉంది. కరోనా సోకినవారి కాంటాక్టులను గుర్తించడం అత్యంత కీలకమని ప్రపంచవ్యాప్తంగా ప్రతిఒక్కరూ చెబుతున్నదే. ఇందులోనూ కేరళ దేశంలో ఏ రాష్ట్రానికి సాధ్యంకాని రీతిలో కాంటాక్టుల్ని గుర్తిస్తోంది. దేశవ్యాప్తంగా 33 మందికి ఒక కేసును గుర్తిస్తుంటే.. కేరళలో మాత్రం ప్రతి ఆరు పరీక్షల ద్వారా ఒక కేసును గుర్తిస్తోందని దిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం నిపుణుడు రాజీవ్‌దాస్‌ గుప్తా తెలిపారు.

దేశవ్యాప్త జనసాంద్రతతో పోలిస్తే కేరళ జనసాంద్రత ఎక్కువగా ఉండటం సహా అధిక ర్యాపిడ్‌ పరీక్షల కారణంగా కేసుల సంఖ్య ఎక్కువగా నమోదవుతున్నట్లు రాజీవ్‌దాస్‌ వివరించారు. భారీ ఎత్తున పరీక్ష నిర్వహణతో దేశం మొత్తం కేసుల్లో కేరళ కేసులు 12 శాతం ఉన్నప్పటికీ మరణాల రేటు మాత్రం 0.5 శాతంగానే ఉంది. దేశవ్యాప్తంగా చూస్తే మరణాల రేటు 1.4 శాతంగా ఉంది. భాజపా నేతలు చెప్పే యూపీలో 1.3 శాతంగా ఉంది. కరోనా నియంత్రణలో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే కేరళను భిన్నంగా నిలిపింది ర్యాపిడ్‌ యాంటిజెన్‌ పరీక్షలే.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని