Vaccine: ఆ రాష్ట్రాల్లో ఒక్క చుక్కా వృథా లేదు
close

తాజా వార్తలు

Updated : 10/06/2021 16:37 IST

Vaccine: ఆ రాష్ట్రాల్లో ఒక్క చుక్కా వృథా లేదు

వ్యాక్సినేషన్‌లో ఆదర్శంగా నిలుస్తున్న కేరళ, బెంగాల్‌

దిల్లీ: ఓ వైపు దేశంలో వ్యాక్సిన్ల కొరత ఉన్న వేళ చాలా రాష్ట్రాల్లో టీకా వృథా సమస్యగా మారుతోంది. అయితే కేరళ, పశ్చిమ బెంగాల్‌ మాత్రం ఇందుకు భిన్నమైన బాటలో నడుస్తూ మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. వ్యాక్సిన్‌ డోసుల్లో ఒక్క చుక్క కూడా వృథాగా పోనివ్వకుండా కేటాయించిన దానికంటే ఎక్కువ మందికి టీకాలు అందిస్తున్నాయి. 

మే నెలలో కేరళ తమకిచ్చిన కోటా కంటే అధికంగా 1.10లక్షల డోసులను ప్రజలకు వేసింది. పశ్చిమ బెంగాల్‌ 1.61లక్షల డోసులను అధికంగా అందించింది. నిజానికి వ్యాక్సిన్‌ వయల్‌లో వృథాను పరిగణనలోకి తీసుకుంటే పది డోసులు ఉంటాయి. కేంద్రం లెక్క ప్రకారం 1.1శాతం ఇందులో కలిసి ఉంటుంది. అంటే సాధారణంగా ఒక వయల్‌ నుంచి 8 నుంచి 9 డోసులు ఇవ్వగలరు. అయితే కేరళ, బెంగాల్‌ రాష్ట్రాలు మాత్రం ఈ వృథాను కూడా వినియోగించుకుంటున్నాయి. అలా ఒక వయల్‌ నుంచి  పూర్తిగా 10 డోసులు ఇవ్వగలుగుతున్నాయి. అనుభవజ్ఞులైన వైద్య సిబ్బంది, నర్సులు ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. తద్వారా ఈ రాష్ట్రాలు కేంద్రం ఇచ్చిన కోటా కంటే ఎక్కువ డోసులను ప్రజలకు అందించగలుగుతున్నాయి. టీకా డోసుల వినియోగంలో కేరళ వైద్య సిబ్బంది పనితీరుపై ఇటీవల ప్రధాని మోదీ కూడా ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. 

ఆ రాష్ట్రంలో మూడో వంతు వృథా..

ఇదిలా ఉండగా.. దేశవ్యాప్తంగా అత్యధిక టీకా వృథా ఝార్ఖండ్‌ రాష్ట్రంలో నమోదైంది. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. ఝార్ఖండ్‌లో వ్యాక్సిన్‌ వృథా 33.95శాతంగా ఉంది. అంటే.. మొత్తం డోసుల్లో మూడో వంతు నిరుపయోగమవుతున్నాయి. ఆ తర్వాత ఛత్తీస్‌గఢ్‌లో 15.79శాతం, మధ్యప్రదేశ్‌లో 7.35శాతం డోసులు వృథాగా పోతున్నాయి. ఇక దిల్లీ, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్ర, గుజరాత్‌లలోనూ ఈ వృథా 3 శాతం కంటే ఎక్కువే ఉండటం గమనార్హం. సాధారణంగా వయల్‌ తెరిచిన తర్వాత నాలుగు గంటల్లో వినియోగించాలి. లేదంటే ఆ డోసులతో ఉపయోగం ఉండదు. అయితే నలుగురైదుగురు వచ్చినా వయల్‌ ఓపెన్‌ చేసి టీకాలు ఇస్తుండటంతో ఈ రాష్ట్రాల్లో వృథా అధికంగా ఉంటోంది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని