Kerala Cabinet: శైలజా టీచర్‌కు దక్కని చోటు
close

తాజా వార్తలు

Published : 18/05/2021 20:43 IST

Kerala Cabinet: శైలజా టీచర్‌కు దక్కని చోటు

తిరువనంతపురం: కరోనా మహమ్మారి కట్టడిలో అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకున్న కేరళ ఆరోగ్య శాఖ మాజీ మంత్రి కేకే శైలజ(64)కు కొత్త కేబినెట్‌లో చోటుదక్కలేదు. రెండో దశ కరోనా ఉద్ధృతి వేళ..మంత్రిగా శైలజ తగిన నిర్ణయాలు తీసుకుంటారని భావించిన కేరళ వాసుల్ని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ నిర్ణయం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.  

ఇటీవల కేరళలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్షపార్టీ నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్‌ తిరిగి అధికారాన్ని చేజిక్కించుకుంది. విజయన్‌ నాయకత్వంలో.. మంగళవారం 21మంది కొత్త మంత్రులతో మంత్రివర్గం ఏర్పాటైంది. దాంట్లో ఆరోగ్య శాఖ మాజీ మంత్రి శైలజకు చోటు దక్కలేదు. ఈ ఎన్నికల్లో కన్నూరు జిల్లా నుంచి పోటీచేసిన ఆమె.. 60వేల ఓట్ల భారీ ఆధిక్యంతో విజయం సాధించారు. మొదటి దఫా ఆరోగ్య మంత్రిగా 2018లో మే నెలలో ప్రాణాంతక నిపా వైరస్‌ను నియంత్రించేందుకు పలుచర్యలు చేపట్టారు. అనంతరం సవాలు విసిరిన కరోనాకు అడ్డుకట్ట వేసి, అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకున్నారు. స్త్రీలే ప్రజారోగ్యాన్ని చక్కగా చూసుకుంటారని నమ్మిన ఆమె ఆరోగ్య శాఖలో పలు విభాగాల బాధ్యతలను మహిళలకు అప్పగించారు. ఆడవాళ్ల దండు అంటూ విపక్షాలు వెక్కిరించినా..నిపా వైరస్‌ను పారదోలడంతోపాటు, మొదటి దశ కరోనాను అదుపులో ఉంచగలిగారు. మంత్రికాగానే గ్రామీణ స్థాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్ని ప్రైవేటు ఆసుపత్రులకన్నా మిన్నగా తీర్చిదిద్దారు. ఈ నిర్ణయాలతో మహమ్మారి రోజుల్లో రాక్‌ స్టార్‌గా మారిన ఆమె..రెండోసారి ఆరోగ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారని ప్రతి ఒక్కరు భావించారు. కానీ అంచనాలను తలకిందులు చేస్తూ..విజయన్ తీసుకున్న నిర్ణయం అందరిని ఆశ్చర్యపర్చింది. 

వ్యక్తుల కంటే పార్టీ గొప్పదని చెప్పేందుకే..

పార్టీ నిర్ణయం ప్రకారం.. గత ప్రభుత్వం నుంచి ఏ ఒక్కరికి రెండోసారి పదవిని కేటాయించకూడదు. అందుకు తగ్గట్టుగానే ఆమెను తప్పించినట్లు తెలుస్తోంది. ఆమెతో పాటు ఏసీ మొయిదీన్, ఎంఎం మణిలను కూడా తప్పించారు. అయితే విజయన్‌కు మాత్రం మినహాయింపు ఉండటం గమనార్హం. అయితే ప్రస్తుతం విజయన్‌ తీసుకున్న నిర్ణయం ప్రభుత్వం, పార్టీపై ఆయనకున్న పట్టును వెల్లడిచేస్తోంది. వరసగా రెండు పర్యాయాలు పూర్తి చేసిన ఏ సభ్యుడికి టికెట్ ఇవ్వకూడదని ఆయన గతంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. దాంతో తాజా ఎన్నికల్లో చాలా మందికి టికెట్లు దక్కలేదు. ఇది సంప్రదాయ ఓటర్లు, సానుభూతిపరులను పార్టీకి దూరం చేస్తుందని ఇతర నేతలు భావించారు. కానీ, అందరి అంచనాలను తలకిందులు చేస్తూ అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్ష కూటమి విజయం సాధించింది. 140 స్థానాలకు గానూ 99 సీట్లను దక్కించుకుంది. ఇది విజయన్ ఆత్మవిశ్వాసాన్ని పెంచడమే కాకుండా..మంత్రి వర్గంలో కొత్త మొహాలకు స్థానం కల్పించేందుకు కారణమైంది. 

అలాగే శైలజాను తప్పించడం ద్వారా వ్యక్తుల కంటే పార్టీనే గొప్పదనే సందేశాన్ని వామపక్షపార్టీ ప్రజలకు ఇవ్వాలనుకుంటోంది. ఏ ఒక్క మంత్రి సాధించిన విజయాలపై ఆధారపడకూడదని ఈ నిర్ణయం ద్వారా స్పష్టం చేసింది. అంతేకాకుండా ఆమెను ఆరోగ్య మంత్రిగా చూడాలనుకున్న ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వం పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించడంలేదు. ఆ మంత్రిత్వ శాఖ కాకపోయినా..మరో ప్రాధాన్య శాఖనైనా తమ టీచరమ్మ దక్కించుకుంటారని అంతా భావించారు. ఏదిఏమైనప్పటికీ, రెండో దశ కరోనా ఉద్ధృతి వేళ.. ఆరోగ్య మంత్రిగా కొత్తవారి ఎంపిక సరైందేనని విజయన్‌ నిరూపించుకోవాల్సి ఉంది. శైలజ పనితీరు తెలిసిన ప్రజలు ఆరోగ్య శాఖ తీసుకొనే నిర్ణయాలను క్షుణ్ణంగా పరిశీలిస్తారని, వారిని మెప్పించడం విజయన్‌కు సవాలేనని పలువురు నేతలు అభిప్రాయపడుతున్నారు.  
 

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని