
తాజా వార్తలు
లక్షద్వీప్‌నూ తాకిన కరోనా మహమ్మారి
‘జీరో కరోనా’జోన్‌గా ఉన్న ఐలాండ్స్‌లో తొలికేసు
కోచి: దేశంలో కరోనా ఊసు లేని ప్రాంతమేదైనా ఉందంటే.. ఇప్పటివరకు లక్షద్వీప్ అని టక్కున చెప్పేవాళ్లం. కానీ ఇకపై ఆ అవకాశం లేకుండా పోయింది. ఏడాది కాలంగా ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఈ మహమ్మారి ఇప్పుడు ఈ దీవులకీ పాకింది. సోమవారం అక్కడ తొలి కరోనా కేసు నమోదైంది.
భారత రిజర్వ్ బెటాలియన్‌కు చెందిన ఓ వ్యక్తి జనవరి 3న కోచి నుంచి కవరత్తి వచ్చారు. ఆ తర్వాత ఆయన అస్వస్థతకు గురవడంతో సోమవారం కరోనా పరీక్షలు నిర్వహించగా.. పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దాదాపు ఏడాది కిందట భారత్‌లోకి కరోనా మహమ్మారి ప్రవేశించినప్పటికీ.. ఈ ఐలాండ్స్‌లో మాత్రం ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. తాజాగా అక్కడ నిబంధనలను సడలించగా.. తొలి కేసు నమోదవడం గమనార్హం.
భారత్ బెంబేలెత్తినా.. ఇక్కడ ‘జీరో’
పది నివాసయోగ్యమైన దీవులు సహా 36 ఐలాండ్స్ సమూహం లక్షద్వీప్. ఇక్కడ దాదాపు 65వేల మంది నివసిస్తున్నారు. చేపల వేట.. వాణిజ్య వ్యాపారాల్లో భాగంగా విదేశాలకు వెళ్లే భారీ ఓడల్లో పనిచేయడమే వీరికి తెలిసింది. ఏవైనా వస్తువులు కొనాలనుకుంటే కేరళకు రావాల్సి ఉంటుంది. అందుకే నిత్యం లక్షద్వీప్ ప్రజలు కేరళలోని కోచి.. బేపొర్ ప్రాంతాలకు వస్తూ పోతూ ఉంటారు. దేశంలోనే తొలి కరోనా కేసు నమోదైన రాష్ట్రం కేరళ, ఇతర దేశాలకు నిత్యం రాకపోకలు సాగిస్తున్న ఈ ఐలాండ్స్‌కి చెందిన ప్రజల్లో ఒక్కరికి కూడా కరోనా రాకపోవడం నిజంగా ఆశ్చర్యకరమైన విషయం. గత ఏడాది కాలంగా దేశంలో రోజుకు వేలకొద్దీ కరోనా కేసులు వెలుగుచూస్తున్నా.. లక్షద్వీప్ మాత్రం జనవరి 17 వరకు జీరో కరోనా జోన్‌గా నిలవడం విశేషం.
ముందు జాగ్రత్త చర్యలే కాపాడాయి..
కరోనా తొలినాళ్లలో లక్షద్వీప్‌లో కఠిన నిబంధనలు అమలు చేశారు. సామాన్యుడైనా, అధికారైనా, ప్రజాప్రతినిధి అయినా ఈ ద్వీపానికి ఎవరైనా రావాలనుకుంటే కచ్చితంగా నియమాలు పాటించాల్సిందే. లక్షద్వీప్‌కు ఓడల్లో, హెలికాప్టర్లలో వెళ్లేందుకు ఏకైక కేంద్రంగా ఉన్న కోచిలో ఏడు రోజుల పాటు సంస్థాగత క్వారంటైన్లో ఉండాలని అక్కడి అధికారులు తప్పనిసరి ఆదేశాలు జారీచేశారు. క్వారంటైన్లో కరోనా పరీక్షలు నిర్వహించి నెగెటివ్ వచ్చినవారిని మాత్రమే లక్షద్వీప్ వచ్చేందుకు అనుమతించారు. అంతేగాక, లక్షద్వీప్‌కు చేరుకున్న తర్వాత కూడా వారం పాటు హోం క్వారంటైన్లో ఉండేలా పటిష్ఠ చర్యలు తీసుకున్నారు.
నిబంధనలను సడలించడంతో తొలి కేసు..
లక్షద్వీప్‌లో రెండు వారాల క్రితం ఎస్ఓపీ నిబంధనలను సవరించారు. కోచి నుంచి వచ్చేవారికి తప్పనిసరి క్వారంటైన్ నియమాన్ని తొలగించారు. ఈ నిర్ణయం తీసుకున్న కొద్ది రోజులకే అక్కడ తొలి కేసు నమోదవడం గమనార్హం. సోమవారం కరోనా కేసు బయటపడటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు పాజిటివ్‌గా తేలిన వ్యక్తితో కాంటాక్ట్ అయిన వారందరూ క్వారంటైన్‌కు వెళ్లాలని ఆదేశించింది. సదరు వ్యక్తి ప్రైమరీ కాంటాక్ట్‌ల రక్త నమూనాలను ల్యాబ్‌కు పంపింది. మంగళవారం నుంచి లక్షద్వీప్ దీవుల మధ్య నౌకలు సహా అన్ని రాకపోకలను నిలిపివేసింది.
ఇవీ చదవండి..
భారత్: గణనీయంగా తగ్గిన పాజిటివ్ కేసులు