అతిపెద్ద కాన్వాస్‌ పెయింటింగ్‌.. ధర ₹450కోట్లు!
close

తాజా వార్తలు

Published : 25/03/2021 01:14 IST

అతిపెద్ద కాన్వాస్‌ పెయింటింగ్‌.. ధర ₹450కోట్లు!

ఇంటర్నెట్‌ డెస్క్‌: గత ఏడాది అందరూ కరోనా భయంతో ఇళ్లలోనే ఉండిపోయారు.. కానీ, ఓ చిత్రకారుడు దుబాయ్‌ హోటల్‌లో పెయింటింగ్‌ వేస్తూ ఉండిపోయాడు. 17వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో కాన్వాస్‌పై అతడు వేసిన పెయింటింగ్‌ గిన్నిస్‌బుక్‌లో చోటు సంపాదించుకుంది. ప్రపంచంలోనే అతిపెద్ద కాన్వాస్‌ పెయింటింగ్‌గా రికార్డు సృష్టించింది. ఇది గొప్ప విషయమే. అయితే, తాజాగా ఆ పెయింటింగ్‌ ఊహించని ధరకు అమ్ముడుపోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. 

కరోనా సంక్షోభంలో చిన్నారులకు చేయూతనివ్వడం కోసం బ్రిటన్‌కు చెందిన చిత్రకారుడు సాషా జాఫ్రి ‘ది జర్నీ ఆఫ్‌ హ్యుమానిటీ’ పేరుతో గతేడాది మార్చి చివరివారంలో దుబాయ్‌లోని అట్లాంటిస్‌ ది పామ్‌ హోటల్‌లో భారీ కాన్వాస్‌ పెయింటింగ్‌ వేయడం మొదలుపెట్టాడు. ఏడు నెలలపాటు రోజుకు 20 గంటలు కష్టపడి పెయింటింగ్‌ను పూర్తి చేశాడు. ఆ పెయింటింగ్‌కు గిన్నిస్‌ బుక్‌లో స్థానం దక్కింది. కాగా, ఇటీవల ఆ భారీ పెయింటింగ్‌ను 70 ఫ్రేములుగా విభజించి వేలంలో విక్రయించాలని నిర్ణయించుకున్నాడు. అన్ని ఫ్రేమ్స్‌ను అమ్మితే కనీసం 32మిలియన్‌ డాలర్లు(దాదాపు రూ.217కోట్లు) రావాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. అయితే, చిన్నారుల కోసం పెయింటింగ్‌ విక్రయిస్తున్నారని తెలిసి దుబాయ్‌కి చెందిన వ్యాపారవేత్త ఆండ్రీ అబ్దూన్‌ ఆ ఫ్రేమ్స్‌ అన్నింటిని ఒక్కడే కొనుగోలు చేశాడు. ఇందుకోసం జాఫ్రి నిర్దేశించుకున్న నగదు కంటే రెట్టింపు నగదు.. 62మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ. 450కోట్లు) చెల్లించాడు. జాఫ్రి వేసిన పెయింటింగ్‌ ఎంతో బాగుందని, వాటిని వేరు చేయడం ఇష్టం లేకనే అన్నింటిని తానే కొంటున్నట్లు తెలిపాడు. అలాగే, పేదకుటుంబం నుంచి వచ్చిన తనకు ఆకలి గురించి బాగా తెలుసని, పేదరికంలో మగ్గుతున్న చిన్నారులకు ఈ విధంగా సాయం చేయడం తనకు సంతోషంగా ఉందని చెప్పాడు. పెయింటింగ్‌ విక్రయించగా వచ్చిన డబ్బును చిన్నారుల సంక్షేమం కోసం పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థలకు పంపిణీ చేయనున్నట్లు జాఫ్రి, వేలం నిర్వాహకులు తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని