కరోనాతో మళ్లీ స్కూళ్లు మూత.. ఏ రాష్ట్రంలో ఎలా? 

తాజా వార్తలు

Updated : 24/03/2021 18:07 IST

కరోనాతో మళ్లీ స్కూళ్లు మూత.. ఏ రాష్ట్రంలో ఎలా? 

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశంలో కరోనా వైరస్‌ మళ్లీ అలజడి సృష్టిస్తోంది. పలు రాష్ట్రాల్లో భారీగా నమోదవుతున్న కొత్త కేసులు కలవర పెడుతున్నాయి. గతేడాది విద్యారంగాన్ని కోలుకోలేని దెబ్బతీసిన ఈ మహమ్మారి మరోసారి పంజా విసురుతోంది. విద్యా సంస్థల్లోనూ కేసులు నమోదువుతుండటంతో అప్రమత్తమైన పలు రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాలు విద్యార్థుల రక్షణను దృష్టిలో ఉంచుకొని మరోసారి విద్యా సంస్థలు మూసివేస్తూ నిర్ణయం తీసుకున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో విద్యా సంస్థలన్నింటినీ మూసివేయగా.. మరికొన్ని చోట్ల కేవలం 1 నుంచి 8తరగతుల వరకు పాఠశాలల్లో తరగతులు రద్దు చేశారు. ఆ రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలివే.. 

* తెలంగాణలో నేటి నుంచి అన్ని విద్యా సంస్థలూ మూసివేత కొనసాగుతోంది. రాష్ట్రంలో మళ్లీ కరోనా కేసులు పెరగడంతో ప్రభుత్వం ఈ  నిర్ణయం తీసుకుంది. వైద్య కళాశాలలు మాత్రం యథాతథంగానే పనిచేస్తాయని స్పష్టంచేసింది. తదుపరి ఉత్తర్వులు జారీచేసే దాకా విద్యాసంస్థల తాత్కాలిక మూసివేత కొనసాగుతుందని ప్రభుత్వం స్పష్టంచేసింది. మరోవైపు, కరోనా తీవ్రత దృష్ట్యా డిగ్రీ, పీజీ పరీక్షలను సైతం వాయిదా వేస్తున్నట్టు తాజాగా ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. 

* ఛత్తీస్‌గఢ్‌లో మార్చి 22 నుంచి పాఠశాలలు, కళాశాలల మూసివేత కొనసాగుతోంది. మళ్లీ ఎప్పుడు పునఃప్రారంభమవుతాయన్న విషయాన్ని మాత్రం అక్కడి ప్రభుత్వం పేర్కొనలేదు. 

* మహారాష్ట్రలో పలు ప్రాంతాల్లో పాఠశాలలను మూసివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. పుణె, పాల్ఘర్‌, ఠానేలలో స్కూళ్లు, కళాశాలలను మార్చి 31వరకు మూసివేయనున్నట్టు అధికారులు వెల్లడించారు. 

* ఉత్తర్‌ప్రదేశ్‌లో కూడా నేటి నుంచే (మార్చి 24) పాఠశాలల మూసివేస్తున్నట్టు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. 1 నుంచి 8తరగతుల వరకే ఇది వర్తిస్తుందని స్పష్టంచేసింది. కళాశాలలను రేపటి నుంచి మూసివేయనున్నట్టు పేర్కొంది. మార్చి 31న తిరిగి తరగతులు పునఃప్రారంభమవుతాయని తెలిపింది. 

*  పంజాబ్‌లో అన్ని పాఠశాలలు, కళాశాలలు మూతబడ్డాయి. విద్యా సంస్థలు మూతబడినప్పటికీ నర్సింగ్‌ కళాశాలలు మాత్రం యథాతథంగా కొనసాగుతున్నాయి. విద్యాసంస్థలు మార్చి 31 నుంచి పునఃప్రారంభంకానున్నాయి. 

* తమిళనాడులో మార్చి 22 నుంచి అన్ని  స్కూళ్లు మూసివేత కొనసాగుతోంది. అన్ని కళాశాల్లోనూ ఆఫ్‌లైన్‌ తరగతులను రద్దు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. విద్యా సంస్థల పునఃప్రారంభానికి సంబంధించి ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. 

* కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో మార్చి 22 నుంచి కేవలం పాఠశాలల మూసివేత కొనసాగుతోంది. 1 నుంచి 8తరగతుల వరకే ఈ నిర్ణయం వర్తింపజేసింది. మిగతా విద్యార్థులకు తరగతులు కొనసాగిస్తున్నారు. ఇక్కడి పాఠశాలలు మార్చి 31న పునఃప్రారంభించే అవకాశం ఉంది.

* కేంద్రపాలితప్రాంతమైన చండీగఢ్‌లో పాఠశాలలు, కళాశాలల మూసివేత మార్చి 22 నుంచి కొనసాగుతోంది. కరోనా పరిస్థితి అదుపులోకి వస్తే మార్చి 31 తర్వాత తరగతులు పునఃప్రారంభిస్తామని అధికారులు తెలిపారు.

* గుజరాత్‌లో ఎనిమిది పెద్ద నగరాల్లో పాఠశాలలను మూసివేశారు. కరోనా తీవ్రత ఉన్న అహ్మదాబాద్‌, రాజ్‌కోట్‌, వడోదర, సూరత్‌, భావ్‌నగర్‌, గాంధీనగర్‌, జామ్‌నగర్‌, జునాగఢ్‌లలో ఈ నిర్ణయం అమలు చేస్తున్నారు. ఏప్రిల్‌ 10 వరకు ఆఫ్‌లైన్‌ తరగతులు రద్దు చేస్తున్నట్టు అక్కడి ప్రభుత్వం పేర్కొంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని