మహారాష్ట్ర: లాక్‌డౌన్‌ ఒక్కటే పరిష్కారం కాదు!

తాజా వార్తలు

Published : 30/03/2021 01:07 IST

మహారాష్ట్ర: లాక్‌డౌన్‌ ఒక్కటే పరిష్కారం కాదు!

ప్రభుత్వానికి సూచించిన భాజపా

ముంబయి: కరోనా విజృంభిస్తున్న వేళ లాక్‌డౌన్‌ దిశగా మహారాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్న వేళ భాజపా స్పందించింది. కరోనా కట్టడికి లాక్‌డౌన్‌ విధించడం పరిష్కారం కాదని రాష్ట్ర భాజపా అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్‌ అభిప్రాయపడ్డారు. ఇది కేవలం భాజపా అభిప్రాయం మాత్రమే కాదని, వ్యాపారులతో పాటు ఇతర రంగాల ప్రజలు కూడా లాక్‌డౌన్‌ను వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు.

‘రాష్ట్రంలో కొవిడ్‌ తీవ్రత పెరగుతోన్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ విధించడం ఒక్కటే మార్గం కాదు. ఒకవేళ లాక్‌డౌన్‌ విధిస్తే సామాన్యులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఎలాంటి సహాయం చేయదు. మాతోశ్రీ (ముఖ్యమంత్రి ఠాక్రే నివాసం)లో కూర్చున్న మీకు ఏడాదికాలంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులు మీకు అర్థం కావు’ అని భారతీయ జనతా పార్టీ మహారాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్‌ పాటిల్‌ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ని ఉద్దేశించి విమర్శలు చేశారు. కొవిడ్‌ కట్టడి చర్యల్లో భాగంగా రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదన్న ఆయన, పగటి సమయంలో మాత్రం ఆంక్షలు విధించకూడదని సూచించారు. ఒకవేళ లాక్‌డౌన్‌ విధించాల్సి వస్తే అసంఘటిత రంగంలోని ప్రతి కుటుంబానికి రూ.5వేల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు టెస్టింగ్‌, ట్రాకింగ్‌, ట్రీట్‌మెంట్‌ కీలకమైనవని, ప్రభుత్వం వీటిపై దృష్టిసారించాలని చంద్రకాంత్ పాటిల్‌ పేర్కొన్నారు.

ముంబయిలో నిత్యం 6వేల కొత్త కేసులు..!

మహారాష్ట్రలో నిత్యం రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్‌ కేసులు బయటపడుతున్నాయి. గడిచిన 24గంటల్లో ముంబయిలో కొత్తగా మరో 5888 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు బృహన్‌ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌ వెల్లడించింది. దీంతో నగరంలో క్రియాశీల కొవిడ్‌ కేసుల సంఖ్య 47వేలకు చేరింది. నేడు కొత్తగా మరో 12మంది కొవిడ్‌ మరణాలు సంభవించడంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 11,661కి చేరింది. ముంబయిలో కొవిడ్‌ ఉద్ధృతి పెరగడంతో నిర్ధారణ పరీక్షల సంఖ్యను పెంచుతున్నారు. నిత్యం దాదాపు 30వేలకు పైగా పరీక్షలు నిర్వహిస్తుండగా వీటిలో దాదాపు 6వేల పాజిటివ్‌ కేసులు బయటపడుతున్నాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని