అప్పుడు ₹52వేల కోట్లు.. ఇప్పుడు ₹2.94 లక్షల కోట్లు

తాజా వార్తలు

Updated : 08/03/2021 20:25 IST

అప్పుడు ₹52వేల కోట్లు.. ఇప్పుడు ₹2.94 లక్షల కోట్లు

దిల్లీ: దేశంలో పెట్రోల్‌, డీజిల్‌, ఎల్పీజీ సిలిండర్‌ ధరలు భగ్గుమంటున్నాయి. ఎన్నడూలేని రీతిలో వాటి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అంతర్జాతీయంగా రేట్లు పెరగడం వల్లే వీటి ధరలు పెరుగుతున్నాయని కేంద్రం చెప్పుకొస్తోంది. అయితే, సిలిండర్‌ ధరలు ఏమేర పెరిగాయ్‌? చమురుపై సుంకాల వల్ల ప్రభుత్వానికి ఎంత ఆదాయం సమకూరింది? అంటూ పార్లమెంటులో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. 2014లో గృహ అవసరాలకు వినియోగించే 14.2 కేజీల గ్యాస్‌ ధర ₹410.5 ఉండగా.. ప్రస్తుతం ₹819కి విక్రయిస్తున్నట్లు మంత్రి తెలిపారు. డిసెంబర్‌ 2020లో ₹594గా ఉన్న సిలిండర్‌ ధర కొద్ది రోజుల్లోనే ఈ స్థాయికి చేరిందని చెప్పారు. 2014లో సబ్సిడీపై అందించే కిరోసిన్‌ ధర 14.96 ఉండగా.. సబ్సిడీ పూర్తిగా ఎత్తివేసిన నేపథ్యంలో ₹35.35గా ఉందని పేర్కొన్నారు.

పెట్రోల్‌, డీజిల్‌పై సుంకాల ద్వారా వచ్చిన మొత్తాలనూ కేంద్రమంత్రి వివరించారు. 2013లో చమురుపై పన్నుల ద్వారా ₹52,537 కోట్లు వసూలు అయ్యేదని చెప్పారు. 2019-20 ఆర్థిక సంవత్సరం వచ్చేసరికి ₹2.13 లక్షల కోట్లు పన్నుల ద్వారా వసూలైనట్లు వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం గడిచిన 11 నెలల్లో పన్నుల ద్వారా ₹2.94 లక్షల కోట్ల మేర పన్ను ఆదాయం సమకూరినట్లు చెప్పారు. పెట్రోల్‌పై ₹32.90, డీజిల్‌పై ₹31.80 ఎక్సైజ్‌ సుంకం కేంద్రం విధిస్తోందని చెప్పారు. 2018లో పెట్రోల్‌పై ₹17.98, డీజిల్‌పై ₹13.83గా ఈ పన్నులుండేవని తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్ల ధరలకు అనుగుణంగా రేట్లు సవరించే విధానం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో చమురు కంపెనీలు వాటి ధరలు పెంచుతున్నాయని తన సమాధానంలో పేర్కొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని