కరోనా విలయం: ‘ప్రకృతి విపత్తు’గా పరిగణించండి!

తాజా వార్తలు

Published : 15/04/2021 16:17 IST

కరోనా విలయం: ‘ప్రకృతి విపత్తు’గా పరిగణించండి!

కేంద్రానికి మహారాష్ట్ర సీఎం విజ్ఞప్తి

ముంబయి: కరోనా వైరస్‌ మహమ్మారి ధాటికి మహారాష్ట్ర వణికిపోతోంది. ఇలాంటి సమయంలో కరోనా విలయాన్ని ‘ప్రకృతి విపత్తు’గా పరిగణించాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీంతో కొవిడ్‌ బాధితులను ఆదుకునేందుకు రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి(ఎస్‌డీఆర్‌ఎఫ్‌)ని రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకునే వీలు కలుగుతుందన్నారు. ఇదే విషయంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు.

‘ఇప్పటివరకు భారీ వర్షాలు, వరదలు, పిడుగుపాటు వంటి సంఘటనల వల్ల భారీ నష్టం వాటిల్లితేనే ప్రకృతి విపత్తుగా పరిగణిస్తున్నారు. తద్వారా బాధితులకు పరిహారం, ఆర్థిక సహాయాన్ని అందించే వీలుంది. కేంద్ర విపత్తు నిర్వహణ చట్టం ప్రకారమే రాష్ట్రానికి చెందిన అన్ని విపత్తు నిర్వహణ చట్టాలను రూపొందించారు. దీంతో కొవిడ్ విజృంభణ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిని ఆదుకోవడం ఇబ్బందిగా మారింది. ఇందుకు ఎస్‌డీఆర్‌ఎఫ్‌ నిధులను వినియోగించుకోవాలంటే కేంద్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి’ అని మహారాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారని పేర్కొన్నారు.

ఇదిలాఉంటే, మహారాష్ట్రలో కరోనా వైరస్‌ ఉద్ధృతి అంతకంతకూ పెరుగుతోంది. నిన్న కొత్తగా 59వేల పాజిటివ్‌ కేసులు, 278 మరణాలు నమోదయ్యాయి. ఒక్క మహారాష్ట్రలోనే ఇప్పటివరకు కరోనాతో ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 58వేలు దాటింది. దేశవ్యాప్తంగా లక్షా 73వేల మంది మృత్యువాతపడ్డారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని