మహారాష్ట్రపై మళ్లీ కొవిడ్‌ పంజా

తాజా వార్తలు

Updated : 18/02/2021 10:26 IST

మహారాష్ట్రపై మళ్లీ కొవిడ్‌ పంజా

దేశవ్యాప్తంగా 12వేలపైనే కొత్త కేసులు 

దిల్లీ/ముంబయి: దేశవ్యాప్తంగా కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతున్నప్పటికీ మహారాష్ట్రలో మాత్రం వైరస్‌ వ్యాప్తి పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. నిన్న ఒక్కరోజే అక్కడ దాదాపు 5వేల కేసులు బయటపడగా ఈ ఏడాదిలో ఇవే రోజువారీ అత్యధిక కేసులు కావడం గమనార్హం. మహారాష్ట్ర వ్యాప్తంగా బుధవారం 4,787 కొత్త కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం కేసుల సంఖ్య 20,76,093కి చేరింది. 

వైరస్‌ కారణంగా నిన్న రాష్ట్రంలో మరో 40 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 51,631కు పెరిగింది. గడిచిన 24 గంటల్లో 3,853 మంది వైరస్‌ నుంచి కోలుకున్నట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం అక్కడ 38,013 క్రియాశీల కేసులున్నట్లు తెలిపింది. గత వారం రోజులుగా మహారాష్ట్రలో 3వేలకు పైనే కొత్త కేసులు నమోదవుతుండగా.. నిన్న ఏకంగా రికార్డు స్థాయిలో బయటపడ్డాయి. 

రాష్ట్రంలో కరోనా మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో ఉద్ధవ్‌ ఠాక్రే ప్రభుత్వం అప్రమత్తమైంది. మాస్క్‌ ధరించడం, సామాజిక దూరం వంటి కొవిడ్‌ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, లేదంటే మరోసారి లాక్‌డౌన్‌ విధించాల్సి వస్తుందని సీఎం ఠాక్రే హెచ్చరించారు. మరోవైపు ప్రజలు నిబంధనలు పాటిస్తున్నారో లేదో పరిశీలించేందుకు రైల్వే స్టేషన్లలో అదనపు పోలీసులను ఏర్పాటు చేశారు. 

దేశంలో కొత్తగా 12,881 కేసులు

ఇక దేశవ్యాప్తంగా కరోనా కొత్త కేసుల సంఖ్య కూడా కాస్త పెరిగింది. అంతక్రితం రోజుతో 11వేల కేసులు నమోదవగా.. గడిచిన 24 గంటల్లో 12,881 కేసులు వెలుగుచూశాయి. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,09,50,201కి పెరిగింది. ఇక మరో 11,987 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 1,06,56,845కి చేరింది. రికవరీ రేటు 97.32శాతంగా ఉంది. 
గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా మరో 101 మంది వైరస్‌ వల్ల ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో ఇప్పటి వరకు 1,56,014 మంది కరోనాకు బలయ్యారు. ప్రస్తుతం 1,37,342 యాక్టివ్‌ కేసులుండగా.. క్రియాశీల రేటు 1.25 శాతంగా ఉంది. 

కోటికి చేరువలో టీకాలు..

మరోవైపు దేశంలో టీకా పంపిణీ కార్యక్రమం నిరాటంకంగా కొనసాగుతోంది. బుధవారం నాటికి దేశవ్యాప్తంగా 94,22,228 మంది కరోనా టీకా తీసుకున్నారు. జనవరి 16న తొలి డోసు తీసుకున్నవారికి ఫిబ్రవరి 14 నుంచి రెండో డోసు ఇస్తోంది. తొలి విడతలో ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు వ్యాక్సినేషన్‌ పూర్తయిన తర్వాత వృద్ధులకు టీకా పంపిణీ చేయనున్నట్లు కేంద్రం తెలిపింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని