
తాజా వార్తలు
దేశ్‌ముఖ్‌పై సీబీఐ దర్యాప్తు.. అవసరమే
‘మహా’ మాజీ హోంమంత్రికి సుప్రీంకోర్టులో చుక్కెదురు
దిల్లీ: మహారాష్ట్రలో రూ. 100కోట్ల వసూళ్ల ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు వ్యవహారంలో మహారాష్ట్ర సర్కారు, ఆ రాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌కు సర్వోన్నత న్యాయస్థానంలో చుక్కెదురైంది. ఈ ఆరోపణలపై సీబీఐ దర్యాప్తును సవాల్ చేస్తూ దేశ్‌ముఖ్, ప్రభుత్వం వేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులపై ఆరోపణలు వచ్చినందున వాటిపై స్వతంత్ర దర్యాప్తు అవసరమేనని జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది.
పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ నివాసం వద్ద పేలుడు పదార్థాల వాహనం కేసులో పోలీసు అధికారి సచిన్ వాజే అరెస్టు తర్వాత అప్పటి ముంబయి కమిషనర్‌గా ఉన్న పరమ్‌బీర్ సింగ్‌పై బదిలీ వేటు పడింది. ఈ నేపథ్యంలోనే పరమ్‌బీర్.. అనిల్ దేశ్‌ముఖ్‌పై సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దేశ్‌ముఖ్ ప్రతి నెలా రూ. 100కోట్ల వసూళ్లను వాజేకు లక్ష్యంగా పెట్టారంటూ సీఎం ఉద్దవ్ ఠాక్రేకు పరమ్‌బీర్ లేఖ రాశారు. తన ఆరోపణలను నిగ్గు తేల్చేందుకు సీబీఐతో దర్యాప్తు జరపాలంటూ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. పరమ్బీర్తో పాటు మరో ఇద్దరు కూడా ఈ ఆరోపణలపై పిటిషన్ దాఖలు చేయడంతో.. వాటిపై విచారణ జరిపిన హైకోర్టు.. సీబీఐ దర్యాప్తును ఆదేశించింది. దేశ్‌ముఖ్‌పై వచ్చిన ఆరోపణలపై 15 రోజుల్లోగా ప్రాథమిక విచారణ పూర్తి చేయాలని న్యాయస్థానం సీబీఐని ఆదేశించింది.
అయితే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ అనిల్ దేశ్‌ముఖ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అటు మహారాష్ట్ర సర్కారు కూడా దీనిపై సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ వేసింది. ఈ పిటిషన్లపై జస్టిస్ కౌల్ నేతృత్వంలోని ధర్మాసనం నేడు విచారణ జరిపింది. ‘‘ఆరోపణల తీవ్రత.. కేసుతో సంబంధం ఉన్న వ్యక్తుల హోదాను బట్టి స్వతంత్ర సంస్థతో దర్యాప్తు అవసరమే. ఇది కేవలం ప్రాథమిక దర్యాప్తే. ఓ సీనియర్ మంత్రిపై సీనియర్ అధికారి తీవ్రమైన ఆరోపణలు చేసినప్పుడు విచారణ జరిపితే తప్పేంటీ? ఈ ఇద్దరు(పరమ్‌బీర్, దేశ్‌ముఖ్) తమ పదవుల నుంచి తప్పుకునేవరకు కలిసి పనిచేసినవారే కదా’’ అని ధర్మాసనం అభిప్రాయం వ్యక్తం చేసింది. అనంతరం పిటిషన్లను కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది.