మహారాష్ట్ర: నెలలో 7గురు మంత్రులకు కొవిడ్‌

తాజా వార్తలు

Updated : 22/02/2021 12:58 IST

మహారాష్ట్ర: నెలలో 7గురు మంత్రులకు కొవిడ్‌

ఛగన్‌ భుజ్‌బల్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ

ముంబయి: మహారాష్ట్ర ఆహారం, పౌర సరఫరాలశాఖ మంత్రి ఛగన్‌ భుజ్‌బల్‌కు కరోనా సోకినట్టు వెల్లడైంది. కాగా, ఈ నెలలో కరోనా సోకిన రాష్ట్ర మంత్రుల్లో ఆయన ఏడో వ్యక్తి కావటం గమనార్హం. ఇప్పటి వరకూ అనిల్‌ దేశ్‌ముఖ్‌, రాజేంద్ర షింగ్రే, జయంత్‌ పాటిల్‌, రాజేశ్‌ తోపే, సతేజ్‌పాటిల్‌, బచ్చు కాడులకు కొవిడ్‌ వ్యాధి సోకింది.  కాగా, గతేడాది ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌తో సహా 12 మంది రాష్ట్ర మంత్రులకు సోకిన సంగతి తెలిసిందే.

తనకు కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు భుజ్‌బల్‌ సామాజిక మాధ్యమాల్లో వెల్లడించారు. తన ఆరోగ్యం నిలకడగా ఉందని కూడా ఆయన తెలిపారు. ఇటీవలి రెండు, మూడు రోజుల్లో తనకు సమీపంలో వచ్చిన వారు కొవిడ్‌ నిర్ధారణ పరీక్ష చేయించుకోవాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రజలందరూ మాస్కులు ధరించి, శానిటైజర్లు వాడాలని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన సూచించారు.

మరోవైపు కరోనా వైరస్ మహమ్మారి కలవరానికి గురి చేస్తోంది. మహారాష్ట్ర, కేరళ వంటి తదితర రాష్ట్రాల్లో వైరస్ ప్రభావం ప్రభుత్వాలను పరుగులు పెట్టిస్తోంది. లాక్‌డౌన్, రాత్రికర్ఫ్యూ వంటి వైపు మొగ్గుచూపేలా చేస్తోంది. ఇటీవల కాలంలో కొవిడ్ టీకాలకు అనుమతులు, పాజిటివ్ కేసుల్లో తగ్గుదలతో దేశవ్యాప్తంగా సానుకూల వాతావరణం నెలకొంది. అయితే గతవారం రోజుల్లో కొవిడ్ కేసుల్లో ఉన్నట్టుండి పెరుగుదల కనిపిస్తోంది. 15 వారాల అనంతరం కొత్త కేసులు భారీగా వెలుగుచూడటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటివరకు దేశంలో కోటి పది లక్షల మందికి పైగా వైరస్ సోకగా..65 రోజుల్లో చివరి పది లక్షల కేసులు నమోదయ్యాయని కేంద్ర గణాంకాలు వెల్లడిచేస్తున్నాయి. ఫిబ్రవరి 15 నుంచి 21 మధ్యలో 1,00,990 కేసులు బయటపడగా. గత వారంతో పోలిస్తే, 31 శాతం ఎక్కువకావడం గమనార్హం. ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోయి, చలి పెరగడం ఈ కొత్త కేసులకు కారణమని వైద్య నిపుణులు భావిస్తున్నారు. అలాగే టీకాల రాకతో, ప్రజల్లో పెరిగిన నిర్లక్ష్య వైఖరి కూడా కారణంగా తెలుస్తోంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని