
తాజా వార్తలు
మహారాష్ట్రలో ఆగని కరోనా విలయతాండవం
ముంబయి: మహారాష్ట్రలో కొవిడ్ ఉద్ధృతి తగ్గడం లేదు. గత కొన్నిరోజులుగా రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతుండటంతో ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. దేశవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో కేవలం మహారాష్ట్రలోనే సగానికి పైగా ఉంటున్నాయి. దీంతో ఆ రాష్ట్రంలో వైరస్ తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వం ఎన్నిరకాల కట్టడి చర్యలు తీసుకుంటున్నప్పటికీ కరోనా విలయతాండవం చేస్తోంది.
గడిచిన 24 గంటల్లో మహారాష్ట్రలో రికార్డు స్థాయిలో 56,286 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. తాజాగా 376 మంది చనిపోయారు. గురువారం 36,130 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు 2,13,85,551 నమూనాలను పరీక్షించగా 32,29,547 మందికి కరోనా సోకింది. 26,49,757 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 57,028 మంది చనిపోయారు. ప్రస్తుతం 5,21,317 యాక్టివ్ కేసులు ఉన్నాయి. బుధవారం వచ్చిన 59,907 కేసులతో పోలిస్తే గురువారం కాస్త తక్కువ కేసులు నమోదు అయ్యాయి.
ముంబయిలో 8,938 కేసులు
వాణిజ్య నగరమైన ముంబయిలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా 8,938 మంది కరోనా బారిన పడ్డారు. 23 మంది చనిపోయారు. ఇక అత్యంత జనసంచారం ఉండే ధారావిలో 19 కేసులు నమోదు అయ్యాయి. ముంబయిలో బుధవారంతో పోలిస్తే గురువారం కొన్ని కేసులు తక్కువగా వచ్చాయి. బుధవారం ఒక్కరోజే గరిష్టంగా 10 వేలకు పైగా కేసులు వచ్చాయి.