మహారాష్ట్రను వణికిస్తున్న కరోనా

తాజా వార్తలు

Published : 02/04/2021 01:30 IST

మహారాష్ట్రను వణికిస్తున్న కరోనా

ముంబయి: మహారాష్ట్రలో శరవేగంగా విస్తరిస్తున్న కరోనా వైరస్‌ కల్లోలం రేపుతోంది. గత రికార్డులను తిరగరాసేలా అక్కడ నమోదవుతున్న కొత్త కేసులు తీవ్ర కలవరానికి గురిచేస్తున్నాయి. భారత్‌లోకి ఈ జిత్తులమారి వైరస్‌ ప్రవేశించిన తర్వాత కనీవినీ ఎరుగని రీతిలో ఒక్కరోజే మహారాష్ట్రలో 43 వేలకు పైగా కొత్త కేసులు వెలుగుచూడటం గుబులు రేపుతోంది. ఓ వైపు కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ శరవేగంగా కొనసాగుతుండటం, మరోవైపు, రాత్రిపూట కర్ఫ్యూ సహా పలు ఆంక్షలు అమలుచేస్తున్న తరుణంలో రికార్డుస్థాయిలో కొత్తకేసులు రావడం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో మహారాష్ట్రలో 43,183 కొత్త కేసులు నమోదు కాగా.. 249 మంది మృతిచెందారు. అలాగే, 32,641మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు.

రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,99,75,341 శాంపిల్స్‌ పరీక్షించగా.. 28,56,163 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వీరిలో 24,33,368 మంది కోలుకోగా.. 54,898 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం 3,66,533 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో అత్యధికంగా పుణెలో 64,599 యాక్టివ్‌ కేసులు ఉండగా.. ముంబయిలో 54,807, ఠానే 42,151, నాసిక్‌ 36,292, నాగ్‌పుర్‌ 48,806 చొప్పున యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

ముంబయిలోనే 8,646

మరోవైపు, దేశ ఆర్థికనగరాన్ని కరోనా వణికిస్తోంది. ఒక్కరోజే అక్కడ 8,646 కొత్త కేసులు 18 మరణాలు నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు నగరంలో నమోదైన ఒక్క రోజు కేసుల్లో ఇదే అత్యధికం కావడం గమనార్హం. ఇప్పటికే పలు నిబంధనలు అమలుచేస్తున్న మహారాష్ట్ర ప్రభుత్వం ఆర్‌టీ పీసీఆర్‌ పరీక్షల ధరలను కూడా రూ.1000 నుంచి 500లకు బుధవారం తగ్గించిన విషయం తెలిసిందే.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని