‘మలయాళంలో మాట్లాడొద్దంటారా? క్షమాపణ చెప్పండి’
close

తాజా వార్తలు

Updated : 06/06/2021 21:41 IST

‘మలయాళంలో మాట్లాడొద్దంటారా? క్షమాపణ చెప్పండి’

దిల్లీ: దేశరాజధానిలోని ఓ ఆస్పత్రిలో మలయాళం మాట్లాడవద్దని జారీ చేసిన సర్క్యులర్‌పై మలయాళీ నర్సులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. యాజమాన్యం వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇంతకీ ఏమైందంటే..

దిల్లీ ప్రభుత్వం ఆధ్వర్యంలో వైద్య సేవలు అందించే గోవింద్‌ బల్లభ్‌ పంత్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌(జిప్‌మర్‌) ఆస్పత్రిలో చాలా మంది మలయాళీలు నర్సింగ్‌ ఉన్నత విద్యను అభ్యసిస్తూ నర్సులుగా సేవలు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం ఒక సర్క్యూలర్‌ జారీ అయింది. నర్సులు ఎవరూ మలయాళంలో మాట్లాడుకోవద్దని.. హిందీ లేదా ఇంగ్లిష్‌లో మాట్లాడుకోవాలనేది సర్క్యులర్‌ సారాంశం. దీంతో మలయాళీ నర్సులు ఆస్పత్రి యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వెంటనే సర్క్యులర్‌ను ఉపసంహరించుకున్న యాజమాన్యం.. తమ ప్రమేయం లేకుండానే సర్క్యులర్‌ జారీ అయిందని వివరణ ఇచ్చుకుంది.

అయినా, మలయాళీ నర్సులు ఆందోళన కొనసాగిస్తున్నారు. ‘‘ఈ సర్క్యులర్‌ మమ్మల్ని షాక్‌కు గురిచేసింది. మా భాషపరమైన స్వేచ్ఛకు ప్రమాదం పొంచి ఉన్న భావన కలిగింది. మా భాషని, రాష్ట్రాన్ని అవహేళన చేస్తూ సర్క్యులర్‌ విడుదల చేసిన వ్యక్తిపై తగిన చర్యలు తీసుకోవాలని, యాజమాన్యం మాకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నాం. అప్పటి వరకు మా ఆందోళన కొనసాగుతుంది. తమ ప్రమేయం లేకుండానే సర్క్యులర్‌ విడుదలైందని యాజమాన్యం చెబుతోంది. అలాంటప్పుడు ఈ విషయంపై మరింత కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది’’అని మలయాళీ నర్సుల దిల్లీ యాక్షన్‌ కమిటీ ప్రతినిధి ఫామీర్‌ తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని