నడుము పట్టేసింది.. పరిహారం ఇప్పించండి!

తాజా వార్తలు

Published : 09/02/2021 17:26 IST

నడుము పట్టేసింది.. పరిహారం ఇప్పించండి!

ఇంటర్నెట్‌ డెస్క్‌: విధులు నిర్వర్తిస్తున్న సమయంలో ఉద్యోగులకు ప్రమాదం జరిగితే కంపెనీలు పరిహారం చెల్లిస్తుంటాయి. అలాగే, ఆస్ట్రేలియాకు చెందిన ఓ వ్యక్తికి విధుల్లో ఉండగా నడుం పట్టేసింది. దీంతో పరిహారం చెల్లించమని కంపెనీని కోరాడు. ఇందుకు కంపెనీ నిరాకరించడంతో న్యాయపోరాటానికి దిగాడు. ఇటీవల అతడికి అనుకూలంగా కోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో రాబర్ట్‌ వార్తల్లోకెక్కాడు.

రాబర్ట్‌ తాలెన్‌ అనే వ్యక్తి దక్షిణ ఆస్ట్రేలియాలోని ఎస్‌ఏ పవర్‌ నెట్‌వర్క్స్‌లో వర్క్స్‌ కో ఆర్డినేటర్‌గా పనిచేస్తున్నాడు. 2019 సెప్టెంబర్‌ 9న కంపెనీ పురమాయించిన పని చేసేందుకు.. కంపెనీ ఇచ్చిన కారులోనే బయలుదేరబోయాడు. కారు ఎక్కి సీటు బెల్టు పెట్టుకున్న తర్వాత కారు తాళం చెవి రోడ్డుపై పడింది. దాన్ని తీసుకునేందుకు వంగడంతో రాబర్ట్‌ నడుము పట్టేసింది. వెన్నులో తీవ్ర నొప్పి ఉన్నా ఎలాగో అలా కార్యాలయం చేరుకున్నాడు. అక్కడి నుంచి ఆస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకున్నాడు. అయితే, కొన్నాళ్లు ఎలాంటి పనులు చేయకూడదని వైద్యులు సూచించారు. ఆస్పత్రిలో చికిత్సకు అయిన ఖర్చు, జరిగిన నష్టానికి పరిహారం ఇచ్చేందుకు కంపెనీ నిరాకరించింది.

కంపెనీపై పిటిషన్‌.. ఎట్టకేలకు గెలుపు

దీంతో అదే ఏడాది రాబర్ట్‌ కోర్టును ఆశ్రయించాడు. న్యాయస్థానంలో వాదనలు వినిపించిన కంపెనీ తరఫు న్యాయవాది.. రాబర్ట్‌కు జరిగిన నష్టానికి, కంపెనీకి ఎలాంటి సంబంధం లేదని అన్నారు. రాబర్ట్‌ విధులకు హాజరయ్యేందుకు సన్నద్ధమయ్యే సమయంలో ఘటన జరిగిందని, విధుల్లో ఉన్నప్పుడు కాదని చెప్పారు. దీనిపై రాబర్ట్‌ వివరణ ఇస్తూ.. కంపెనీ ఒప్పందంలో ఉద్యోగి పనికి బయలుదేరే సమయం నుంచే వేతనం లభిస్తున్నట్లు ఉందని పేర్కొన్నాడు. వాదోపవాదనలు విన్న న్యాయమూర్తి రాబర్ట్‌ పిటిషన్‌ను కొట్టివేశారు. ఈ ఘటనకి, కంపెనీకి ఎలాంటి సంబంధం లేదని తీర్పు వెల్లడించారు.

కోర్టు తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేసిన రాబర్ట్‌.. సౌత్‌ ఆస్ట్రేలియన్‌ ఎంప్లాయిమెంట్‌ ట్రైబ్యునల్‌లో ఆ తీర్పును సవాల్‌ చేస్తూ పిటిషన్‌ దాఖలు చేశాడు. దీనిపై సమగ్ర విచారణ జరిపిన ట్రైబ్యునల్‌ కోర్టు.. గతనెలలో రాబర్ట్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. విధులకు బయలుదేరే సమయంలోనే ఈ ఘటన చోటుచేసుకుంది కాబట్టి.. ఉద్యోగికి జరిగిన నష్టానికి కంపెనీ పరిహారం ఇవ్వాల్సిందేనని కోర్టు స్పష్టం చేసింది. దీంతో రాబర్ట్‌ కేసు గెలిచి, పరిహారం అందుకోనున్నాడు.

ఇవీ చదవండి..

నమ్మండి.. నేను బతికే ఉన్నా!

‘వాటర్‌ బాటిల్‌’పై కేసు.. ఐదేళ్ల తర్వాత గెలుపు!


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని