ఫాస్టాగ్‌ వల్ల రూ.25వేల కోట్లు ఆదా: గడ్కరీ

తాజా వార్తలు

Published : 01/03/2021 22:10 IST

ఫాస్టాగ్‌ వల్ల రూ.25వేల కోట్లు ఆదా: గడ్కరీ

దిల్లీ: ఫాస్టాగ్‌ను తప్పనిసరి చేయడం వల్ల ఇంధన వినియోగం తగ్గి తద్వారా ఏడాదికి రూ.20వేల కోట్లు ఆదా అవుతాయని కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ అన్నారు. అంతేకాకుండా, ప్రభుత్వానికి అదనంగా రూ.10వేల కోట్ల ఆదాయం సమకూరుతుందని చెప్పారు. సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జాతీయ రహదారుల వినియోగం, నిర్మాణం, నాణ్యత విషయంలో మరో ముందడుగు పడినట్లు తెలిపారు.

‘‘జాతీయ రహదారులపై ప్రయాణించే వారికి ఫాస్టాగ్‌ను తప్పనిసరి చేయడం వల్ల టోల్‌ ప్లాజాల వద్ద సమయం వృథాను నివారించవచ్చు. దీని వల్ల ఇంధనం వినియోగం తగ్గి తద్వారా రూ.20 వేలకోట్లు ఆదా అవుతాయి. గతంతో పోలిస్తే టోల్‌ ప్లాజాల వద్ద వాహనదారులు ఆగే సమయం గణనీయంగా తగ్గింది. జైపూర్‌ టోల్‌ప్లాజ్‌ దాటాలంటే గతంలో ఒక్కో వాహనానికి 30 నిమిషాలు పడుతుండగా, ఇప్పుడు కేవలం 5 నిమిషాల్లో దాటుతున్నారు’’ అని గడ్కరీ పేర్కొన్నారు.

గతంలో 80శాతం వరకూ ఫాస్టాగ్‌ చెల్లింపులు జరగ్గా, ఫిబ్రవరి 16 తర్వాత అది 93శాతం వరకూ చేరిందని గడ్కరీ తెలిపారు. అదే విధంగా టోల్‌ ప్లాజాల వద్ద లైవ్‌ మానిటరింగ్‌ కూడా పలు విధాలుగా ఉపయోగపడుతోందన్నారు. ఇటీవల ముంబయిలో ఓ పారిశ్రామిక వేత్త ఇంటి ముందున్న కారు ఏ టోల్‌ ప్లాజా నుంచి వచ్చిందో తెలుసుకోవడం సులభమైందన్నారు. ప్రస్తుతం దానిపై విచారణ కొనసాగుతోందని తెలిపారు. జాతీయ రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటడాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని వివరించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని