Covaxin: అంక్లేశ్వర్‌లో తొలి బ్యాచ్‌ కొవాగ్జిన్‌ టీకాలు విడుదల

తాజా వార్తలు

Updated : 29/08/2021 16:48 IST

Covaxin: అంక్లేశ్వర్‌లో తొలి బ్యాచ్‌ కొవాగ్జిన్‌ టీకాలు విడుదల

గుజరాత్‌: భారత్‌ బయోటెక్‌ గుజరాత్‌లోని అంక్లేశ్వర్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన ప్లాంటు నుంచి కొవాగ్జిన్‌ తొలి బ్యాచ్‌ టీకాలను కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ విడుదల చేశారు. అంక్లేశ్వర్‌ పర్యటనలో భాగంగా ఆయన భారత్‌ బయోటెక్‌ యూనిట్‌ను ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘దేశంలో కొవిడ్‌-19 వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోంది. వైరస్‌ బారి నుంచి ప్రజలను రక్షించడానికి వ్యాక్సినేషన్‌ ఒక్కటే ప్రధాన మార్గమని.. ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్‌ అందించేలా సన్నాహాలు చేపట్టింది. వీలైనంత త్వరగా టీకాలు అందించాలన్న ప్రభుత్వ లక్ష్యానికి భారత్‌ బయోటెక్‌ విస్తరించిన కొవాగ్జిన్‌ టీకాల ఉత్పత్తి ఎంతో దోహదం చేస్తోంది’ అని అన్నారు. ఈ మేరకు తన ట్విటర్‌ ఖాతాలో కూడా ఈ విషయాన్ని పంచుకున్నారు. ‘ప్రతి పౌరుడికి వ్యాక్సినేషన్‌ జరగాలంటే ఎక్కువ మొత్తంలో టీకాల ఉత్పత్తిని పెంచి దేశమంతా సరఫరా చేయాలి’ అని ట్విటర్‌లో పేర్కొన్నారు.

భారత్‌ బయోటెక్‌ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ కృష్ణా ఎల్లా మాట్లాడుతూ.. ‘వ్యాక్సిన్ల కొరతను తగ్గించి ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందించాలనే ఉద్దేశంతో కొవాగ్జిన్‌ ఉత్పత్తికి మరో యూనిట్‌ను ప్రారంభించాం. దీంతో ఏడాదికి 1 బిలియన్‌ డోసులను ఉత్పత్తి చేయాలని పెట్టుకున్న మా లక్ష్యం నెరవేరనుంది. వచ్చే సెప్టెంబరు నుంచి అంక్లేశ్వర్‌ ప్లాంట్‌ ద్వారా టీకాల సరఫరా చేపడతాం’ అని వెల్లడించారు. విదేశాల్లోని భాగస్వాములతో కలిసి ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింత పెంచే దిశగా కృషి చేస్తుందని సంస్థ జేఎండీ సుచిత్రా ఎల్లా పేర్కొన్నారు. ఇప్పటికే హైదరాబాద్, మలూర్, బెంగళూరు, పుణెలలోని ల్యాబ్‌ల నుంచి భారత్ బయోటెక్ కొవాగ్జిన్ ఉత్పత్తి చేస్తుండగా తాజాగా అంక్లేశ్వర్‌ నుంచి కొవాగ్జిన్‌ తయారవడం తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింత పెంచుతుందని సంస్థ అభిప్రాయపడింది. ఈ ఏడాది జూన్ ప్రథమార్ధం నుంచే అంక్లేశ్వర్‌లో ఉత్పత్తి కార్యక్రమాలు ప్రారంభించినట్టు భారత్ బయోటెక్ ప్రకటించింది.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని