
తాజా వార్తలు
కరోనా విజృంభణపై మోదీ సమీక్ష
దిల్లీ: దేశంలో గత కొన్నిరోజులుగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు వైరస్ పరిస్థితిపై సమీక్ష చేపట్టారు. ప్రధానమంత్రి కార్యాలయంలో జరుగుతున్న ఈ సమావేశానికి ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ తదితరులు హాజరయ్యారు. దేశంలో వైరస్ తాజా పరిస్థితి, కొత్త రకం కరోనా వ్యాప్తి తదితర అంశాలపై చర్చిస్తున్నట్లు సమాచారం.
ఇటీవల కొన్ని రాష్ట్రాల్లో కరోనా మళ్లీ విజృంభిస్తోన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా కేరళ, మహారాష్ట్రల్లో రోజువారీ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. దేశంలో మొత్తం నమోదైన రోజువారీ కేసుల్లో దాదాపు 75శాతం ఈ రెండు రాష్ట్రాల్లోనే ఉంటున్నాయి. అంతేగాక, ఇక్కడ క్రియాశీల కేసులు కూడా 50వేలకు పైనే ఉన్నాయి. వీటితో పాటు పంజాబ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోనూ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఆయా రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి.