మోదీ అడిగిన ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసా?

తాజా వార్తలు

Updated : 27/06/2021 14:05 IST

మోదీ అడిగిన ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసా?

దిల్లీ: మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న టోక్యో ఒలింపిక్స్‌పై ప్రశ్నలతో ప్రధాని మోదీ ఈనెల ‘మన్‌ కీ బాత్‌’ని ఆరంభించారు. ఈ సందర్భంగా ఆయన మూడు ప్రశ్నలు సంధించారు. www.mygov.in వెబ్‌సైట్‌ వేదికగా నిర్వహిస్తున్న ‘రోడ్‌ టు టోక్యో’ క్విజ్‌లో పాల్గొనడం ద్వారా విలువైన బహుమతులు గెలుచుకోవాలని పిలుపునిచ్చారు.

ఒలింపిక్స్‌పై మోదీ అడిగిన ప్రశ్నలు

* ఒలింపిక్స్‌లో వ్యక్తిగత హోదాలో స్వర్ణ పతకం సాధించిన తొలి ఇండియన్ ఎవరు?
* ఏ ఆటలో భారత్‌ అత్యధిక బంగారు పతకాలు సాధించింది?
* ఒలింపిక్స్‌లో అత్యధిక పతకాలు సాధించిన  ఆటగాడెవరు?

* ఒలింపిక్స్‌ ప్రస్తావనలో ఫ్లయింగ్‌ సిఖ్‌గా పేరుగాంచిన పరుగుల వీరుడు మిల్కా సింగ్‌ను మోదీ గుర్తుచేసుకున్నారు. ఓ లెజెండరీ అథ్లెట్‌ను కరోనా మనకు దూరం చేసిందంటూ విచారం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ఆయనతో మాట్లాడినట్లు గుర్తుచేసుకున్నారు. 1964 ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన మీరు.. ఈ సారి ఒలింపిక్స్‌కు వెళుతున్న బృందంలో స్ఫూర్తి నింపాలని కోరితే మిల్కా సింగ్‌ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. కానీ, అంతలోనే విధి మరో ప్రణాళిక సిద్ధం చేసుకుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

* ఎన్నో కష్టనష్టాలకోర్చి ఈసారి ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న పలువురు గ్రామీణ క్రీడాకారుల గురించి మోదీ ఈ సందర్భంగా ప్రస్తావించారు. మహారాష్ట్రలోని సతారా జిల్లాకు చెందిన ప్రవీణ్‌ జాదవ్ ఆర్చరీలో భారత్‌ తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు. అలాగే హాకీ క్రీడాకారిణి నేహా గోయల్‌నూ మోదీ ప్రత్యేకంగా అభినందించారు. పేద కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన ఇలాంటి క్రీడాకారులు భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తుండడం గర్వంగా ఉందన్నారు. ఇలా పలువురు క్రీడాకారుల పోరాటాన్ని ప్రస్తావించిన మోదీ.. వారికి యావత్‌ భారత్‌ మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు.

* జూన్‌ 21న ప్రారంభమైన సార్వత్రిక వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో తొలిరోజే రికార్డు స్థాయిలో వ్యాక్సిన్ల పంపిణీ చేసినట్లు మోదీ గుర్తుచేశారు. ఏడాది క్రితం వ్యాక్సిన్లపై సందిగ్ధత ఉండేదని తెలిపారు. కానీ, ఇప్పుడు ఓకే రోజు లక్షల మందికి దేశీయంగా తయారు చేసిన టీకాలను ఉచితంగా అందజేయగలుగుతున్నామని తెలిపారు.

* వ్యాక్సిన్‌పై గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కల్పించాలని కోరారు. గ్రామాల్లో ప్రతిఒక్కరూ టీకా తీసుకోవాలని కోరారు. మహమ్మారిపై పోరులో నిరంతర పోరాటం కొనసాగాలన్నారు. అప్పుడే విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

* వర్షాకాలం నేపథ్యంలో వర్షపు నీటిని ఒడిసిపట్టడానికి ఉన్న ప్రాముఖ్యతను మోదీ గుర్తుచేశారు. భూగర్భ జల మట్టాలు పెరగాలంటే నీటిని ఒడిసిపట్టాలని పిలుపునిచ్చారు. దీన్ని ఒకరకమైన సేవగా, బాధ్యతగా భావించాలన్నారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల్లో ఈ మేరకు కొనసాగుతున్న కృషిని ప్రధాని ప్రస్తావించారు.

* మన వృక్ష సంపదలో ఉన్న ఔషధ గుణాలకు సంబంధించిన సమాచారం కరోనా మూలంగా ఒక్కోటి వెలుగులోకి వస్తున్నట్లు మోదీ తెలిపారు. నైనిటాల్‌కు చెందిన ఓ వ్యక్తి ‘గిలోయ్‌’ అనే మొక్కలో ఉన్న ఔషధ విలువలను ప్రస్తావిస్తూ తనకు లేఖ రాసినట్లు తెలిపారు. ఆ మొక్క ప్రాశస్త్యాన్ని మన్‌ కీ బాత్‌ సందర్భంగా ప్రతిఒక్కరికీ తెలపాలని కోరినట్లు పేర్కొన్నారు.

* జులై 1న ‘డాక్టర్స్‌ డే’, ‘చార్టెడ్‌ అకౌంటెంట్స్‌ డే’ నేపథ్యంలో ఆ రంగంలో సేవలందిస్తున్న వారందరికీ మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు.

* కరోనాతో ఇటీవల మరణించిన కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి గురుప్రసాద్‌ మొహపాత్ర సేవల్ని ఈ సందర్భంగా మోదీ గుర్తుచేసుకున్నారు. కరోనా సోకినప్పటికీ.. చికిత్స తీసుకుంటూనే విధులు నిర్వర్తించారని తెలిపారు. దేశంలో ప్రతి మూలకు ఆక్సిజన్‌ చేర్చేందుకు విశేష కృషి చేశారన్నారు. విశ్రాంతి తీసుకోమని ఎన్నిసార్లు చెప్పినా.. ఆక్సిజన్‌పై జరిగిన ప్రతి సమీక్షలో గురుప్రసాద్‌ వర్చువల్‌గా పాల్గొన్నారని మోదీ గుర్తుచేసుకున్నారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని