త్రివర్ణ పతాకానికి జరిగిన అవమానం బాధించింది

తాజా వార్తలు

Updated : 31/01/2021 13:24 IST

త్రివర్ణ పతాకానికి జరిగిన అవమానం బాధించింది

‘మన్‌ కీ బాత్‌’లో ప్రధాని మోదీ

దిల్లీ: ‘జనవరి 26న దిల్లీలో త్రివర్ణ పతాకానికి జరిగిన అవమానాన్ని చూసి యావత్‌ భారతావని దుఃఖించింది’ అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గణతంత్ర దినోత్సవం రోజు రైతులు నిర్వహించిన ట్రాక్టర్‌ ర్యాలీలో భాగంగా కొంతమంది ఎర్రకోటపై ఇతర జెండాలను ఎగురవేసిన ఘటనను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సంఘటనపై మోదీ బహిరంగంగా స్పందించడం ఇదే తొలిసారి. ప్రతి నెలా చివరి ఆదివారం ప్రసారమయ్యే మన్‌ కీ బాత్‌ కార్యక్రమంలో భాగంగా నేడు ఆయన తన భావాలను ప్రజలతో పంచుకున్నారు. పద్మ పురస్కారాలకు ఎంపికైన వారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. అలాగే టెస్టు క్రికెట్‌లో ఆస్ట్రేలియాపై భారత్‌ సాధించిన అద్భుత విజయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు.

పండుగలు, ఉత్సవాలు, గణతంత్ర వేడుకలు, బడ్జెట్‌ సమావేశాల ప్రారంభం వంటి కార్యక్రమాలతో జనవరి నెల వేగంగా గడిచిపోయిందని మోదీ గుర్తుచేశారు. దేశం కోసం వివిధ రంగాల్లో కృషి చేసిన వారిని పద్మ పురస్కారాలతో గౌరవించుకున్నామన్నారు. తొలుత ఎదుర్కొన్న అరిష్టాలను అధిగమించి క్రికెట్‌లో టీమ్‌ఇండియా అద్భుత విజయాన్ని సొంతం చేసుకుందన్నారు. ఇలాంటి ఉత్సాహ వాతావరణం మధ్య జనవరి 26న మువ్వన్నెల జెండాకు జరిగిన అవమానం ప్రతిఒక్కరినీ బాధించిందన్నారు. గత ఏడాది ప్రతిఒక్కరూ అద్భుతమైన ధైర్య సాహసాలు, సహనాన్ని ప్రదర్శించారంటూ కరోనా కష్టకాలాన్ని గుర్తుచేశారు. అదే స్ఫూర్తిని ఈ సంవత్సరమూ కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్‌ కార్యక్రమం భారత్‌లో ప్రారంభమైందన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అత్యంత వేగంగా ప్రజలకు టీకా అందజేస్తున్నామన్నారు. కేవలం 15 రోజుల్లో 30 లక్షల మందికి టీకా అందించిన విషయాన్ని గుర్తుచేశారు. అభివృద్ధి చెందిన అమెరికాలో 30 లక్షల డోసులు అందించేందుకు 18 రోజులు, బ్రిటన్‌లో 36 రోజులు పట్టిందన్నారు. కరోనాపై భారత్‌ చేస్తున్న యుద్ధం ప్రపంచం మొత్తానికి ఆదర్శంగా నిలుస్తోందన్నారు. అదే తరహాలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమం సైతం ప్రతిఒక్కరిలో స్ఫూర్తి నింపుతోందన్నారు. కొవిడ్‌ టీకా ఉత్పత్తి భారత్‌ తయారీ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిందన్నారు. సరైన సమయంలో టీకా అందించి ఆదుకున్నందుకు ప్రపంచ దేశాలు భారత్‌పై ప్రశంసలు కురిపిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా మోదీ గుర్తుచేశారు.

ఇక ఎప్పటిలాగే దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో పలువురు చేస్తున్న కృషిని ప్రధాని ఈ సందర్భంగా ప్రస్తావించారు. హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లి కూరగాయల మార్కెట్‌లో చెత్త నుంచి విద్యుత్తు ఉత్పత్తి చేస్తున్న తీరును మోదీ అభినందించారు. అదే తరహాలో హరియాణాలోని బదౌతి గ్రామంలో మురుగు నీటిని సాగునీరుగా మార్చుతున్న వైనాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. కేరళలో రాజప్పన్‌ అనే దివ్యాంగుడు ఓ సరస్సును ప్లాస్టిక్‌ రహితంగా మార్చుతున్న తీరును ప్రశంసించారు. అలాగే ఎయిరిండియాకు చెందిన మహిళా పైలట్లు ఉత్తర ధ్రువం మీదుగా అత్యంత సుదూర ప్రయాణాన్ని సాగించిన సాహసాన్ని ఈ సందర్భంగా కొనియాడారు. జబల్‌పూర్‌లో కరోనా వల్ల ఉపాధి కోల్పోయిన మహిళలంతా కలిసి రైస్‌ మిల్లును కొనుగోలు చేసి నడుపుతున్న తీరును ప్రధాని అభినందించారు. బుందేల్‌ఖండ్‌ ప్రాంతంలో విద్యార్థినులు చేపట్టిన స్ట్రాబెర్రీ సాగును మోదీ తన ప్రసంగంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇలా మరికొంత మంది వివిధ రంగాల్లో చేస్తున్న కృషిని ఈ సందర్భంగా ప్రధాని దేశ ప్రజలతో పంచుకున్నారు.

ఇవీ చదవండి...

ఈ దశాబ్దం భారత్‌కు చాలా కీలకం: మోదీ

పాక్‌ నుంచి భారత్‌ వచ్చి.. బంగ్లాకు ముక్తినిచ్చి!



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని