లాక్‌డౌన్‌లో శరీరక కదలికలు తగ్గాయట! 

తాజా వార్తలు

Published : 24/03/2021 02:13 IST

లాక్‌డౌన్‌లో శరీరక కదలికలు తగ్గాయట! 

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా విజృంభణ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు లాక్‌డౌన్‌ ఆంక్షలు విధిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సమయంలో వ్యక్తుల దినచర్యల్లో చాలా మార్పులకు కారణమవుతున్నట్లు తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. కరోనా మహమ్మారికి ముందు, లాక్‌డౌన్‌ వేళ శారీరక శ్రమలో మార్పులపై లండన్‌ శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధన వివరాలు తాజాగా బీఎంజే జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.

లాక్‌డౌన్‌లో పరిస్థితుల వల్ల రోజువారీ కార్యకలాపాల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయనే విషయాలను తెలుసుకునేందుకు కింగ్స్‌ కాలేజీ లండన్‌ పరిశోధకులు ఓ అధ్యయనం చేశారు. పరిశోధనలో భాగంగా విభిన్న శారీరక సామర్థ్యాలు ఉన్న వారి కార్యాచరణను పరిగణనలోకి తీసుకున్నారు. ముఖ్యంగా నరాల బలహీనత, కండరాల జబ్బు ఉన్న వారిలోనూ ఎలాంటి మార్పులు వచ్చాయో పరీక్షించారు. స్వతంత్రంగా పనిచేసుకునే వారి నుంచి ఇతరులపై ఆధారపడే వారిని, వీల్‌ చెయిర్‌పై (41మంది) ఆధారపడే వారి దినచర్యలను ఈ పరిశోధనలో భాగంగా పరీక్షించారు.

శారీరక శ్రమపై 2019-20 మధ్య కాలంలో చేపట్టిన అధ్యయనంలో భాగంగా లండన్‌ శాస్త్రవేత్తలు ఈ పరిశోధనను చేపట్టారు. పరిశోధనలో పాల్గొన్న వారి శారీరక పనితీరును లాక్‌డౌన్‌కు ముందు, లాక్‌డౌన్‌ కాలంలో యాక్సెలెరోమీటర్‌ సాయంతో కొలిచారు. కఠినమైన, మోతాదు, తేలిక విభాగాల్లో వారి శరీర పనితీరును అంచనా వేశారు. తద్వారా లాక్‌డౌన్‌ సమయంలో రోజువారీ దినచర్యలో గణనీయమైన తగ్గింపు ఉన్నట్లు పరిశోధనలో భాగంగా గుర్తించారు. లాక్‌డౌన్‌కు ముందు నిత్యం దాదాపు 84.5 నిమిషాల పాటు తేలికైన పనుల్లో నిమగ్నం కాగా, లాక్‌డౌన్‌ సమయంలో ఇది సగటున 25నిమిషాలకు పడిపోయినట్లు గుర్తించారు. ఇక గంటల కదలికల ప్రకారం చూస్తే ఇది 11శాతం తగ్గిందని తేల్చారు.

లాక్‌డౌన్‌ కారణంగా పనులకు వెళ్లకపోవడం, ఇతరులతో కలవలేకపోవడం, విశ్రాంతి కోసం బయటకు వెళ్లకపోవడం లాంటి పరిమితుల వల్ల తేలికపాటి దినచర్యకు కూడా ఆటంకం ఏర్పడినట్లు పరిశోధకులు గుర్తించారు. కేవలం వ్యాయామమే కాకుండా, దినచర్య, సాధారణంగా చేసే తేలికైన పనులు ప్రతిఒక్కరి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని.. వ్యాయామం చేయని వారిపైనా ఈ లాక్‌డౌన్‌ ప్రభావం చూపించిందని కింగ్స్‌ కాలేజీ లండన్‌కు చెందిన న్యూరాలజీ నిపుణులు సారా రాబెర్ట్‌ లూయీస్‌ పేర్కొన్నారు. ఇక శారీరక వైకల్యం, నరాల సమస్యలు ఉన్న వారిలో ఇది మరింత ఎక్కువగా ఉన్నట్లు అభిప్రాయపడ్డారు. అందుకే ప్రతి గంటలో ఒక ఐదు నిమిషాల పాటు  శరీరాన్ని కదిలించాలని సూచిస్తున్నారు. వీటికి అదనంగా రోజులో ఓ ముప్పై నిమిషాల పాటు యోగా లాంటి తేలికపాటి వ్యాయామాలు చేయాలని సూచిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పినట్లుగా ప్రతి శారీరక కదలిక మనకు ప్రయోజనాన్ని చేకూరుస్తుందనే సూచనను నిపుణులు గుర్తు చేస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని