Mullah Baradar: తాలిబన్‌ ప్రభుత్వాధినేతగా ముల్లా బరాదర్‌..!

తాజా వార్తలు

Updated : 04/09/2021 04:52 IST

Mullah Baradar: తాలిబన్‌ ప్రభుత్వాధినేతగా ముల్లా బరాదర్‌..!

ఇంటర్నెట్‌డెస్క్‌: తాలిబన్‌ ప్రభుత్వ అధినేతగా శుక్రవారం ముల్లా బరాదర్‌ పేరును ఖరారు చేసినట్లు సమాచారం. ఆయన ఇప్పటి వరకు తాలిబన్ల పొలిటికల్‌ ఆఫీస్‌ అధిపతిగా వ్యవహరిస్తూ వచ్చారు. ఈ విషయాన్ని ముగ్గురు తాలిబన్‌ నాయకులు ధ్రువీకరించినట్లు ఆంగ్ల వార్త సంస్థ రాయిటర్స్‌ పేర్కొంది. ఇక తాలిబన్‌ వ్యవస్థాపకుడు ముల్లా ఒమర్‌ కుమారుడు ముల్లా యాకూబ్‌, షేర్ మహమ్మద్‌ స్టాన్జాయ్‌లకు కీలక స్థానాలు దక్కనున్నాయి.

అమెరికాతో చర్చలతో వార్తల్లోకి..

అఫ్గాన్‌లో యుద్ధాన్ని ముగించాలని ట్రంప్‌ సర్కారు భావించడంతో తాలిబన్లతో చర్చలకు తెరలేచింది. అమెరికా- తాలిబన్ల మధ్య ఫిబ్రవరి29న ఒప్పందం కుదిరింది. ఈ క్రమంలో 2020 మార్చిలో నాటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఫోన్‌ కాల్‌లో బరాదర్‌తో మాట్లాడారు. అఫ్గానిస్థాన్‌లో హింసను ఆపాలని కోరారు. ఈ ఘటన తర్వాత బరాదర్‌ పేరు ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కింది. తాలిబన్‌ ప్రతినిధిగా ఆయన వివిధ దేశాల నాయకులతో చర్చలు జరిపారు. ఇటీవల చైనాను సందర్శించిన తాలిబన్‌ బృందానికి బరాదర్‌ నాయకత్వం వహించారు.

తాలిబన్‌ సహ వ్యవస్థాపకుడు‌..

అఫ్గానిస్థాన్‌లోని ఉర్జాన్‌ ప్రావిన్స్‌లోని వీట్‌మాక్‌లో 1968లో బరాదర్‌  దుర్రానీ పష్తూన్‌ తెగలో జన్మించాడు. పెరిగిందంతా కాందహార్‌లోనే. 1970ల్లో సోవియట్‌ ఆక్రమణ తర్వాత తిరుగుబాటు బృందంలో చేరాడు. అప్పట్లో ఒంటికన్ను ముల్లా ఒమర్‌తో  కలిసి సోవియట్‌ సేనలపై పోరాటం చేశాడు. సోవియట్‌ సేనలు అఫ్గానిస్థాన్‌ నుంచి వెళ్లిపోయాక దేశంలో అవినీతి, అంతర్యుద్ధ పరిస్థితులు తలెత్తాయి. దీంతో ముల్లా ఒమర్‌తో కలిసి తాలిబన్‌ను స్థాపించాడు. ఆ తర్వాత అఫ్గానిస్థాన్‌లో 1996 నుంచి 2001 వరకు తాలిబన్‌ పాలన సాగింది. ఈ సమయంలో హెరాత్‌, నిమ్రూజ్‌ ప్రావిన్స్‌లకు గవర్నర్‌గా, పశ్చిమ అఫ్గాన్‌ కోర్‌ కమాండర్‌గా వ్యవహరించాడు. తాలిబన్‌ ఆర్మీకి డిప్యూటీగా పనిచేసినట్లు అమెరికా స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌ పత్రాలు వెల్లడిస్తున్నాయి. కాబుల్‌లో సెంట్రల్‌ఆర్మీ కోర్‌ కమాండర్‌గా కూడా పనిచేశాడు. ఇంటర్‌పోల్‌ మాత్రం అతడిని నాటి అఫ్గాన్‌ డిప్యూటీ మినిస్టర్‌ ఆఫ్‌ డిఫెన్స్‌గా పేర్కొంది.  తాలిబన్‌ సైన్యం కోసం కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ను పుస్తక రూపంలో బరాదర్‌ రాశాడు.

2001లో అమెరికా దాడుల సమయంలో బరాదర్‌ తన మిత్రుడు ముల్లా ఒమర్‌తో కలిసి మోటార్‌ సైకిల్‌పై పర్వతాల్లో పలాయనం చిత్తగించాడు. తర్వాత తిరుగుబాటుదారుల పాలన గుర్తింపు కోసం నాటి అధ్యక్షుడు హమీద్‌ ఖర్జాయ్‌తో చర్చలు జరిపాడు.

2010 ఫిబ్రవరి 8వ తేదీ ఉదయం వేళ పాకిస్థాన్‌కు చెందిన ఇంటర్‌ సర్వీస్‌ ఇంటెలిజెన్స్‌, అమెరికాకు చెందిన సీఐఏ సిబ్బంది బరాదర్‌ను కరాచీ నగరంలో అదుపులోకి తీసుకొన్నారు. వారం తర్వాత పాక్‌ ఈ వార్తను ధ్రువీకరించింది. ఖర్జాయ్‌ ప్రభుత్వం బరాదర్‌తో జరుపుతున్న చర్చలను అడ్డుకొనేందుకు పాక్‌ దీనిని వాడుకొన్నట్లు విమర్శలు ఉన్నాయి. 2018లో అమెరికా ఒత్తిడితో పాక్‌ బరాదర్‌ను విడుదల చేసింది. తర్వాత ఆయన్ను ఖతార్‌కు తరలించి తాలిబన్‌ పొలిటికల్‌ ఆఫీస్‌ పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని