Corona: ఒకే వ్యక్తికి..13 నెలల్లో మూడుసార్లు కొవిడ్.. 

తాజా వార్తలు

Updated : 28/07/2021 04:46 IST

Corona: ఒకే వ్యక్తికి..13 నెలల్లో మూడుసార్లు కొవిడ్.. 

టీకా తీసుకున్నాక రెండు సార్లు సోకిన మహమ్మారి

(ప్రతీకాత్మక చిత్రం)

దిల్లీ: కొత్త వేరియంట్ల రూపంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. దాంతో రీ ఇన్ఫెక్షన్‌ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా ఓ 26 ఏళ్ల వైద్యురాలు 13 నెలల వ్యవధిలో మూడుసార్లు కొవిడ్ బారినపడ్డారు. ఆమెతో పాటు ఆమె కుటుంబ సభ్యులకు కూడా వైరస్ సోకింది. ఈ విషయాన్ని స్వయంగా బాధితురాలే వెల్లడించారు.  

డాక్టర్ సృష్టి హళ్లారి ముంబయిలోని వీర్ సావర్కర్ ఆస్పత్రిలో కొవిడ్ విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె గతేడాది జూన్ 17న మొదటిసారి వైరస్‌ బారినపడ్డారు. ఆ సమయంలో ఆమెలో స్వల్పస్థాయి లక్షణాలు మాత్రమే కనిపించాయి. ఆ తర్వాత ఈ ఏడాది మార్చి, ఏప్రిల్‌లో ఆమెతో సహా కుటుంబం అంతా రెండు డోసుల టీకా తీసుకున్నారు. సరిగ్గా నెలరోజులకు మే 29న ఈ వైద్యురాలు రెండోసారి వైరస్ బారినపడ్డారు. అప్పుడు కూడా ఆమె ఇంట్లోనే ఉండి కోలుకున్నారు. ఇక మూడోసారి జులై 11న ఆమెకు మళ్లీ కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. ఈసారి ఆమెతో పాటు కుటుంబం మొత్తానికి వైరస్ సోకిందని సృష్టి వెల్లడించారు. 

‘నేను మూడోసారి కరోనా బారినపడ్డాను. ఈసారి వైరస్ తీవ్రంగా ఇబ్బందిపెడుతోంది. నాతో సహా కుటుంబమంతా ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది. మాకు రెమ్‌డెసివిర్ వాడాల్సిన పరిస్థితి ఎదురైంది. మా అమ్మ, సోదరుడికి మధుమేహం ఉంది. మా నాన్నకు బీపీ, కొలెస్ట్రాల్ సమస్య ఉంది. నా సోదరుడికి శ్వాసలో ఇబ్బంది తలెత్తడంతో రెండురోజుల పాటు ఆక్సిజన్ అందించాల్సి వచ్చింది’ అని ఆమె తెలిపారు. 

ఇదిలా ఉండగా.. కొవిడ్ టీకా వేయించుకున్నా వైరస్ సోకుతుందని, అయితే వ్యాధి తీవ్రత తక్కువగా ఉంటుందని ముందునుంచి వైద్య నిపుణులు వెల్లడిస్తూనే ఉన్నారు. ‘టీకా రెండు డోసుల తర్వాత వైరస్ బారినపడినవారున్నారు. అన్ని వయస్సులవారికి బ్రేక్‌ థ్రో ఇన్ఫెక్షన్( టీకాలు తీసుకున్న తర్వాత వైరస్ సోకడం)వచ్చే ఆస్కారం ఉంది. అయితే టీకాలు వ్యాధి తీవ్రతను తగ్గించడంతో పాటు త్వరగా కోలుకునేందుకు సహకరిస్తాయి’ అని వాక్‌హార్డ్ ఆస్పత్రికి చెందిన వైద్యులు బెహ్రామ్ పార్దివాలా వెల్లడించారు. ఇటీవల ఐసీఎంఆర్ అధ్యయనంలో కూడా ఇదే విషయం వెల్లడైన సంగతి తెలిసిందే.  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని