
తాజా వార్తలు
నాలుగో అంతస్తు నుంచి పడి ముత్తూట్ ఛైర్మన్ మృతి
దిల్లీ: ముత్తూట్ గ్రూప్ ఛైర్మన్ ఎంజీ జార్జ్ (71) తూర్పు కైలాస్ ప్రాంతంలోని ఓ భవనం నాలుగో అంతస్తు నుంచి పడి మృతి చెందినట్టు దిల్లీ పోలీసులు వెల్లడించారు. శుక్రవారం రాత్రి ఆయన మరణించగా.. ఆయన మరణానికి గల కారణాలను శనివారం పోలీసులు వివరించారు. ఓ భవనంలోని నాలుగో అంతస్తు నుంచి కింద పడడంతో వెంటనే ఫోర్టిస్ ఎస్కార్ట్ ఆస్పత్రికి తరలించారని, అక్కడే చికిత్సపొందుతూ ఆయన ప్రాణాలు విడిచారని పేర్కొన్నారు. పోస్టుమార్టం పూర్తయిందని, ఆయన మరణంపై ఎలాంటి అనుమానాలూ, ఫిర్యాదులూ లేవని పోలీసులు తెలిపారు.
ముత్తూట్ గ్రూప్ ఛైర్మన్ ఎంజీ జార్జ్‌కు భార్య సారా జార్జ్, ఇద్దరు కుమారులు జార్జ్ ఎం.జార్జ్ (ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్), అలెగ్జాండర్ జార్జ్ (గ్రూప్ డైరెక్టర్) ఉన్నారు. ముత్తూట్ గ్రూప్ ఛైర్మన్‌గా ఆయన కుటుంబంలో మూడో తరానికి చెందిన వారు జార్జ్. 1979లో మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు తీసుకున్న ఆయన 1993లో గ్రూప్ ఛైర్మన్‌గా మారారు. దేశంలోనే అతి పెద్ద పసిడి ఆభరణాల తనఖా రుణాల కంపెనీ అయిన ముత్తూట్ ఫైనాన్స్‌కు 5,000 శాఖలు ఉన్నాయి. ఇంకా 20కి పైగా వ్యాపారాలకు మరో 550 శాఖలున్నాయి. ఫిక్కీ జాతీయ కార్యవర్గ కమిటీలో సభ్యుడిగా, ఫిక్కీ కేరళ రాష్ట్ర కౌన్సిల్ ఛైర్మన్‌గానూ జార్జ్ ముత్తూట్ వ్యవహరిస్తున్నారు. ఫోర్బ్స్ ఆసియా మ్యాగజైన్ ఇండియా సంపన్నుల జాబితా ప్రకారం, 2011లో ఈయన భారత్‌లో 50వ స్థానంలో ఉన్నారు. 2020కి ర్యాంకింగ్ మెరుగుపరచుకుని 500 కోట్ల డాలర్ల సంపదతో 44వ స్థానానికి చేరారు.