close

తాజా వార్తలు

Updated : 12/08/2020 18:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పుతిన్‌.. ఓ మిస్టరీ..!

* కుమార్తెకు టీకా ఇప్పించడంతో సంచలనం

* ప్రతిదానికీ ఓ లెక్కుంటుంది..!

ఇంటర్నెడెస్క్‌ ప్రత్యేకం

‘స్పుత్నిక్‌-వీ’ పేరుతో కరోనావైరస్‌ టీకాను అందుబాటులోకి తెచ్చినట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ చేసిన ప్రకటనతో ప్రపంచం దృష్టి ఇప్పుడు ఆ దేశంపై పడింది. అంతేకాదు.. తన రక్తం పంచుకుపుట్టిన కుమార్తె కూడా టీకా తీసుకొందని ప్రకటించడంతో విమర్శించే వారు కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి నెలకొల్పారు పుతిన్‌. పుతిన్‌ శైలే అంత.. ఈ మాజీ  కేజీబీ గూఢచారి ఎదుటివారిని ఆత్మరక్షణలోకి నెట్టేయడంలో దిట్ట. దాదాపు రెండు దశాబ్దాలుగా అధికారంపై ఆయన ఉడుంపట్టు కొనసాగుతోంది. రష్యా ఆర్థికంగా బాగా దెబ్బతిన్నా.. ప్రపంచంలో ఆ దేశ పలుకుబడి ఏమాత్రం తగ్గకుండా చేసిన ఘనత పుతిన్‌కే దక్కుతుంది. అమెరికా-రష్యా సంబంధాలను ఈయనే బాగు చేయగలరని జార్జి డబ్ల్యూ బుష్‌ అన్నారంటే ఎంతగా ప్రభావితం చేశారో అర్థం చేసుకోవచ్చు. కానీ, అమెరికా డెమొక్రటిక్‌ పార్టీ నేత హిల్లరీ క్లింటన్‌ పుతిన్‌ను అస్సలు నమ్మడానికి వీల్లేని వ్యక్తి అని బహిరంగంగానే వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఆమె ఓటమికి ఓ రకంగా పుతినే కారణమనే ఆరోపణలున్నాయి. 

గూఢచర్యంపై ఆసక్తి..

సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌లో పుట్టిన పుతిన్‌ ఒక సింగిల్‌ బెడ్రూంలో పెరిగాడు. ఆయన తండ్రి రెండో ప్రపంచ యుద్ధంలో సబ్‌మెరైన్‌లో పనిచేసేవారు. తల్లి ఫ్యాక్టరీలో పనిచేసేది. చిన్నప్పుడే ఇద్దరు సోదరులను పుతిన్‌ కోల్పోయాడు. 16ఏళ్ల వయస్సులో సినిమాలతో ప్రభావితమై గూఢచారిగా మారేందుకు 1968లో నేరుగా సోవియట్‌ గూఢచర్య సంస్థ  కేజీబీ ఆఫీస్‌కు వెళ్లి దరఖాస్తు చేసుకొన్నారు. అప్పట్లో కుదరకపోవడంతో న్యాయవిద్యను పూర్తి చేశారు. ఆ తర్వాత కేజీబీలో చేరి నాటి సోవియట్‌ కనుసన్నల్లోని తూర్పు జర్మనీ కేజీబీ కార్యాలయంలో ట్రాన్స్‌లేటర్‌గా చేరారు. 1989లో జర్మనీ గోడను కూల్చే సమయంలో భారీ సంఖ్యలో ప్రజలు అక్కడి సోవియట్‌ ఆఫీస్‌ను చుట్టుముట్టారు. వెంటనే కేజీబీ ఆఫీస్‌లో ఫైల్స్‌ను దహనం చేయించాడు. అక్కడికి భారీగా చేరినవారిని చెదరగొట్టేందుకు వ్యూహాత్మంగా కార్యాలయం బయటకు వచ్చి సాయుధులతో కాల్పులు జరిపిస్తానని హెచ్చరించాడు. దీంతో వారు వెనక్కి వెళ్లిపోయారు. ఈ ఘటన పుతిన్‌కు పేరుతెచ్చింది. 

రాజకీయ సోపానంలో పైపైకి..

సోవియట్‌ యూనియన్‌ కుప్పకూలిపోయిన సమయంలో మిఖాయిల్‌ గోర్భచేవ్‌ నుంచి అధికారం బోరిస్‌ ఎల్సిన్‌కు వెళ్లింది. ఎల్సిన్‌పై అవినీతి ఆరోపణలు పెరిగిపోవడంతో అధికారం నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. అదే సమయంలో పుతిన్‌ రాజకీయంగా మెల్లిగా ఎదిగారు.  1997లో అధ్యక్షుడి వద్ద డిప్యూటీ చీఫ్‌ ఆఫ్‌ ప్రెసిడెన్షియల్‌ స్టాఫ్‌ పదవిలో నియమితులయ్యారు. 98లో పదోన్నతి లభించింది. 99లో పుతిన్‌ డిప్యూటీ ప్రధానిగా నియమితులయ్యారు. పుతినే‌ తన వారసుడని ఎల్సిన్‌ బలంగా నమ్మారు. ఆయనపై అవినీతి ఆరోపణలు పెరిగిపోవడతో 1999 డిసెంబర్‌ 31న  రాజీనామా చేసి పగ్గాలను పుతిన్‌కు అప్పజెప్పారు. ఈ క్రమంలో ఎల్సిన్‌తో ఒప్పందం  ప్రకారం ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అక్కడి నుంచి రష్యాపై పుతిన్‌ పట్టు పెరిగిపోయింది.  చెచెన్‌‌ వేర్పాటు వాదులను పుతిన్‌ అణచివేసిన తీరు ప్రజలను ఆకట్టుకుంది.

1999 సెప్టెంబర్‌లో పలు చోట్ల ప్రభుత్వమే పేలుళ్లు జరిపించి.. వేర్పాటు వాదులపైకి నెట్టి.. క్రూరంగా అణచివేయడం వెనుక పుతిన్‌ హస్తం ఉందంటారు. చెచెన్యాను రిపబ్లిక్‌గా ప్రకటించారు.. కొన్నాళ్లకే నమ్మకస్తుడు రంజాన్‌ కడ్యరోవ్‌ చేతికి పగ్గాలు వచ్చేట్లు చేశారు.  ఇక రష్యాలో రెండు సార్లు అధ్యక్షుడిగా.. 1999 నుంచి 2008 వరకు,  ప్రధానిగా 2008-2012 వరకు బాధ్యతలు నిర్వహించారు. ఏ నాయకుడూ రెండుసార్లకు మించి అధ్యక్ష పదవిలో కొనసాగరాదన్న రష్యా రాజ్యాంగ నిర్దేశాన్ని అధిగమించడానికి 2008 ఎన్నికల్లో పుతిన్‌ ప్రధానమంత్రి పదవిని చేపట్టి, దిమిత్రీ మెద్వెదేవ్‌కు దేశాధ్యక్ష పదవి అప్పగించారు. కానీ, పాలనా పగ్గాలన్నీ పుతిన్‌ చేతిలోనే ఉంటాయన్నది బహిరంగ రహస్యమే. ఈ విధంగా రాజ్యాంగ పరిమితిని అధిగమించిన తరవాత 2012 ఎన్నికల్లో ఆయన మళ్లీ అధ్యక్ష పదవి చేపట్టి, ప్రధానిగా మెద్వెదేవ్‌ను నియమించారు. 2014లో ఉక్రెయిన్‌పై సైనిక చర్య చేపట్టి, క్రైమియాను జనవాక్య సేకరణ(రెఫరెండం) సాకుతో రష్యాలో కలిపేసుకున్నారు. ఎదురులేని విజేతగా ప్రజల ముందుకెళ్లి 2018 ఎన్నికల్లో మళ్లీ భారీ మెజారిటీతో గెలిచారు. ఈ ఏడాది జూన్‌ 25-జులై ఒకటి మధ్యకాలంలో జనవాక్య సేకరణ జరిపి, అధ్యక్షుడి పదవీకాలంపై పరిమితులను తొలగించేసుకున్నారు.  ఆయన 2036 వరకు తానే అధ్యక్షుడిగా కొనసాగేలా రాజ్యాంగంలో మార్పులు చేసుకొన్నారు.

ఎప్పుడూ వార్తల్లో..

పులిని పట్టుకొని, మార్షల్‌ ఆర్ట్స్‌ చేస్తూ, చేపల వేటలో ఉన్న పుతిన్‌ ఫొటోలు తరచూ మీడియాలో వస్తుంటాయి. గుర్రపు స్వారీ, కత్తియుద్ధాలు, వెయిట్ లిఫ్టింగ్‌ చేస్తున్న ఫొటోలు చక్కర్లు కొడుతుంటాయి. పుతిన్‌ కుటుంబం గురించి మీడియాలో చాలా తక్కువగా చర్చ వస్తుంది. ఆయన 1983లో ల్యడమిలా షెక్రబెనోవానను వివాహం చేసుకొన్నారు. వీరికి మారియా, కేథరినా అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పుతిన్‌ అధ్యక్షుడు అయ్యాక వీరిని రహస్యంగా ఉంచి చదివించారు. 2013లో భార్య నుంచి పుతిన్‌ విడాకులు తీసుకొన్నారు. ఆ తర్వాత ఓ జిమ్నాస్టిక్‌ క్రీడాకారిణితో సన్నిహితంగా ఉన్నారు. 2015లో ఆమె ద్వారా పుతిన్‌కు మరో కుమార్తె పుట్టినట్లు వదంతులు వచ్చాయి. .. దీనిని అధికారికంగా ధ్రువీకరించలేదు. 

కుమార్తె పరిశోధకురాలు..

పుతిన్‌ ఇద్దరు కుమార్తెల్లో మారియా వైద్యురాలు కాగా.. కేథరినా ఏషియన్‌ స్టడీస్‌లో పట్టభద్రురాలు. వీరిద్దరు మారుపేర్లతో విశ్వవిద్యాలయంలో చదువుకొన్నారు. మారియా మెడికల్‌ రీసెర్చ్‌ వైపు వెళ్లారు. డీఎన్‌ఏ పరిశోధనల్లో ఆమె పేరు బయటకు వచ్చింది. గత ఏడాది ఒక చెవిటి జంట కోసం జన్యుమార్పులు చేసి సంతానం ఇచ్చే ప్రాజెక్టుకు ఆమె మద్దతు తెలిపారు. ఇది వివాదాస్పదమైంది.
 

ఇక చిన్న కుమార్తె కేథరినా ఆక్రోబాట్‌ నృత్యకారణిగా స్థిరపడి అత్యంత విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారని అక్కడి పత్రికలు పేర్కొంటాయి. ఆమె రష్యన్‌ బిలియనీర్‌ కెర్రిల్‌ షమలోవ్‌ను 2013లో పెళ్లి చేసుకొన్నారు. కానీ, త్వరలోనే ఆ జంట విడిపోయింది. పుతిన్‌ తన కుమార్తెలను ఎప్పుడూ మీడియా కంటపడనీయరు. వారి వ్యక్తిగత జీవితాలు చాలా గోప్యంగా ఉంటాయి. 

టీకా విషయంలో పట్టుదల దేనికి..?

ప్రస్తుతం వీరిలో టీకా ఎవరు వేయించుకొన్నారో మాత్రం పుతిన్‌ వెల్లడించలేదు. మెడికల్‌ రీసెర్చిలో ఉన్న మారియానే టీకా ప్రయోగాల్లో పాల్గొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.  ఇక టీకా విషయంలో పుతిన్‌ పట్టుదలగా ఉండటానికి చాలా కారణాలు ఉన్నాయి. మసకబారుతున్న రష్యా ప్రతిష్ఠను పెంచడానికి కొవిడ్‌ టీకాను అవకాశంగా మలుచుకొన్నారు. చైనా, అమెరికా, యూకే వంటి దిగ్గజాలను దాటుకొని రష్యా ముందు నిలిచిందని ప్రపంచానికి చెప్పాలనుకొన్నారు. అందుకే ఆద్యంతం రహస్యంగా వ్యవహరించారు. అడినోవైరస్‌తో టీకాను అభివృద్ధి చేస్తున్న ఆక్స్‌ఫర్డ్‌ నుంచి సాంకేతికతను దొంగిలించారనే ఆరోపణలు వచ్చినా లెక్క చేయలేదు. రష్యా కూడా అడినోవైరస్‌తోనే టీకాను తయారు చేయడం విశేషం. ఈ వైరస్‌కు సార్స్‌ కోవ్‌ 2 వలే స్పైక్‌ ప్రొటీన్‌ ఉంటుంది. దీనిని ఎదుర్కోవాడానికి తయారయ్యే రోగనిరోధక శక్తి కరోనా వైరస్‌ను కూడా ఎదుర్కోగలదు.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.