Narada Case: సీబీఐకి షాక్‌.. నేతలకు బెయిల్‌

తాజా వార్తలు

Published : 28/05/2021 19:23 IST

Narada Case: సీబీఐకి షాక్‌.. నేతలకు బెయిల్‌

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో రాజకీయ తుపానుకు తేరలేపిన నారదా కుంభకోణానికి సంబంధించి తృణమూల్‌ కాంగ్రెస్‌ మంత్రులు సహా నేతల అరెస్టు వ్యవహారంలో కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)కు ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో సీబీఐ వాదనను తోసిపుచ్చుతూ నలుగురు నేతలకు కోల్‌కతా హైకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. రూ. 2లక్షల వ్యక్తిగత పూచీకత్తుతో వారికి బెయిల్‌ ఇచ్చింది.

నారదా స్టింగ్‌ ఆపరేషన్‌ కేసులో టీఎంసీ మంత్రులు ఫిర్హాద్‌ హకీం, సుబ్రతా ముఖర్జీ, తృణమూల్‌ ఎమ్మెల్యే మదన్‌ మిత్రా, మాజీ మంత్రి సోవన్‌ ఛటర్జీని గతవారం సీబీఐ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. దీంతో వారు హైకోర్టును ఆశ్రయించారు. నేతల పిటిషన్లపై హైకోర్టు ద్విసభ్య ధర్మానసం ఇటీవల విచారణ జరిపింది. అయితే తీర్పుపై న్యాయమూర్తుల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఈ పిటిషన్లను విస్తృత ధర్మాసనానికి పంపింది. అదే సమయంలో నేతలను గృహనిర్బంధంలో ఉంచాలని ఆదేశించింది. దీంతో మే 19 నుంచి నలుగురు నాయకులు గృహనిర్బంధంలో ఉన్నారు.

ఈ పిటిషన్లపై ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన హైకోర్టు విస్తృత ధర్మాసనం నేడు విచారణ జరిపింది. సీబీఐ తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ‘‘ఈ నాయకులు బయటకు వస్తే దర్యాప్తు ప్రక్రియలో జోక్యం చేసుకుంటారు. అది సమాజంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముంది. అందువల్ల వీరికి బెయిల్‌ మంజూరు చేయవద్దు’’అని తుషార్‌ మెహతా కోర్టును కోరారు. అయితే ఈ వాదనను న్యాయస్థానం తోసిపుచ్చింది. ప్రస్తుత కరోనా పరిస్థితులు, లాక్‌డౌన్‌ దృష్ట్యా వారికి మధ్యంతర బెయిల్‌ మంజూరు చేస్తున్నట్లు వెల్లడించింది. అయితే ఈ సందర్భంగా కొన్ని షరతులు కూడా విధించింది. కేసుకు సంబంధించిన దర్యాప్తులో ఎలాంటి జోక్యం చేసుకోవద్దని, విచారణలో సీబీఐకి సహకరించాలని ఆదేశించింది. అంతేగాక, కేసు పూర్వాపరాల గురించి మీడియాకు ఎలాంటి ఇంటర్వ్యూలు ఇవ్వకూడదని స్పష్టంచేసింది.

ఏంటీ స్టింగ్‌ ఆపరేషన్‌..

నారదా న్యూస్‌ పోర్టల్‌కు చెందిన ఓ విలేకరి 2014లో స్టింగ్‌ ఆపరేషన్‌ నిర్వహించారు. ఆ సమయంలో ఈ నలుగురు నేతలు దీదీ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నారు. తానో కంపెనీ పెడుతున్నానని, దానికి లాభం చేకూర్చడానికి లంచాలు ఇస్తామని..  చెప్పగా అందుకు వీరు అంగీకరించారు. లంచం  తీసుకుంటూ కెమెరాకు చిక్కారు. 2016 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ వీడియో టేపులు కలకలం సృష్టించాయి. ఈ కేసులో సీబీఐ దర్యాప్తునకు 2017లో కోల్‌కతా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో వీరిపై సీబీఐ కేసు నమోదు చేసింది. వీరితో పాటు మరో 9 మంది నేతలు, అధికారులపై కేసు నమోదైంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని