Nasal Vaccine: ఒక్క డోసుతో రక్షణతోపాటే కట్టడి!

తాజా వార్తలు

Published : 12/07/2021 14:41 IST

Nasal Vaccine: ఒక్క డోసుతో రక్షణతోపాటే కట్టడి!

జంతువులపై చేసిన ప్రయోగాల్లో మెరుగైన ఫలితాలు - అమెరికా శాస్త్రవేత్తల వెల్లడి

వాషింగ్టన్: ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ మహమ్మారిని ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్‌లు సాధ్యమైనంత వరకూ కట్టడి చేస్తున్నట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అయితే, ఇప్పటివరకూ వచ్చిన టీకాలన్నీ ఇంజక్షన్‌ రూపంలో మాత్రమే తీసుకోవాల్సి ఉంది. ఇదే సమయంలో ఇన్‌ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ మాదిరిగానే కరోనాను ఎదుర్కొనేందుకు ముక్కు ద్వారా తీసుకునే టీకా కోసం ప్రయోగాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా పలు కంపెనీలు ఇటువంటి టీకాలను అభివృద్ధి చేయగా.. ప్రస్తుతం అవి ప్రయోగదశలో ఉన్నాయి. తాజాగా అమెరికా శాస్త్రవేత్తలు ముక్కు ద్వారా తీసుకునే టీకాను జంతువులపై ప్రయోగాలు జరపగా.. కేవలం ఒక్క డోసుతోనే వైరస్‌ వ్యాప్తిని అడ్డుకట్ట వేయడంతోపాటు ప్రాణాంతక ఇన్‌ఫెక్షన్‌ నుంచి పూర్తి రక్షణ కల్పిస్తున్నట్లు తేలింది.

జంతువుల్లో ప్రయోగాల్లో మెరుగైన ఫలితాలు..

ముక్కు ద్వారా తీసుకునే టీకాను అభివృద్ధి చేసిన అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ జార్జియా పరిశోధకులు, ఇందుకోసం పారాఇన్‌ఫ్లుయెంజా వైరస్‌5(PIV5)ను ఉపయోగించారు. దీన్ని జంతువులపై ప్రయోగించగా ఇన్‌ఫెక్షన్‌ నుంచి రక్షణ కల్పించడంతో పాటు వైరస్‌ వ్యాప్తిని గణనీయంగా తగ్గిస్తున్నట్లు యూనివర్సిటీ ఆఫ్‌ జార్జియాకు చెందిన ప్రొఫెసర్‌ బయో పేర్కొన్నారు. ముఖ్యంగా శ్లేష్మ పొరలో వైరస్‌ కణాలను లక్ష్యంగా చేసుకొని పనిచేయడం వల్ల శ్వాసమార్గాల్లోనే వైరస్‌ను కట్టడి చేయగలుగుతున్నట్లు వెల్లడించారు. వ్యాక్సిన్‌ వల్ల ఉత్పత్తి అయ్యే యాంటీబాడీలు ఇన్‌ఫెక్షన్‌ నుంచి రక్షణ కల్పించడమే కాకుండా వైరస్‌ ఇతరులకు వ్యాప్తి చెందకుండా కాపాడుతున్నాయని చెప్పారు. ఇదివరకు జరిపిన ప్రయోగాల్లో ఈ తరహా వ్యాక్సిన్‌లు ప్రమాదకర మెర్స్‌ (MERS) నుంచి రక్షణ కల్పించినట్లు పరిశోధకులు గుర్తుచేశారు.

ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్‌లు కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంలో విజయవంతమైనవి. కానీ, ప్రపంచంలోని చాలా మందికి వ్యాక్సిన్‌ అందుబాటులోకి రాలేదు. ఇలాంటి సమయంలో తేలికగా వాడడమే కాకుండా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునే వ్యాక్సిన్‌ అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని యూనివర్సిటీ ఆఫ్ జార్జియాకు చెందిన ప్రొఫెసర్‌ పాల్‌ మెక్‌క్రే పేర్కొన్నారు. ఒకవేళ ఇది మానవుల్లోనూ సమర్థంగా పనిచేస్తే మహమ్మారి వ్యాప్తికి అడ్డుకట్టవేయడంలో ఎంతో దోహదపడుతుందని పాల్‌ మెక్‌క్రే అభిప్రాయపడ్డారు.

ఒక్క డోసుతోనే..

ముక్కు ద్వారా తీసుకునే ఈ టీకాను కేవలం సింగిల్‌ డోసులోనే తీసుకుంటే సరిపోతుందని పరిశోధకులు వెల్లడించారు. సాధారణ ఉష్ణోగ్రతల వద్ద కనీసం మూడు నెలలపాటు నిల్వ ఉంచుకునే వెసులుబాటు ఉంది. అంతేకాకుండా ఇంజక్షన్‌కు భయపడే వారికి ముక్కు ద్వారా తీసుకునే టీకా ఎంతో సౌలభ్యంగా ఉంటుందని నిపుణులు స్పష్టంచేశారు.

భారత్‌ పైనే అందరి దృష్టి..

ఇదిలాఉంటే, ముక్కు ద్వారా తీసుకునే వ్యాక్సిన్‌ను రూపొందించడంలో భారత్‌ ముందుందనే చెప్పవచ్చు. భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన ఇంట్రానాజల్‌ వ్యాక్సిన్‌ ప్రయోగాలు ఇప్పటికే ముమ్మరంగా కొనసాగుతున్నాయి. వీటికి సంబంధించిన ప్రయోగాల సమాచార విశ్లేషణ అటు అమెరికాలోనూ జరుగుతోంది. ఒకవేళ ఇది అందుబాటులోకి వస్తే కరోనా వ్యాక్సిన్‌లలో గేమ్‌ ఛేంజర్‌గా మారే అవకాశాలు ఉన్నట్లు నిపుణులు భావిస్తున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని